గురువారం 29 అక్టోబర్ 2020
Rajanna-siricilla - Jul 28, 2020 , 02:28:25

నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

 నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

  • పొదపు పథకంతో  సర్కారు చేయూత 
  • జిల్లాలో 1,566 మందికి లబ్ధి
  • సర్వత్రా హర్షం

 నేత కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నది. త్రిఫ్ట్‌ పథకం ద్వారా చేనేత, మరమగ్గాల పరిశ్రమల్లో పని చేసే కార్మికులకు భరోసా కల్పిస్తున్నది. సంపాదించిన కూలీలో కార్మికుడు ప్రతి నెలా 8 శాతం, ప్రభుత్వం 8శాతం కలిపి నెలకు రూ.1,200 బ్యాంకులో జమయ్యేలా చర్యలు తీసుకుంటు న్నది. పొదుపు చేసిన డబ్బులు మూడేండ్ల తర్వాత వడ్డీతో కలిపి అవసరానికి తీసుకొనే సౌకర్యం కల్పించింది. ఈ పథకంతో 1,566 మంది మరమగ్గాల కార్మికులు, 236 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. దీంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

- రాజన్న సిరిసిల్ల , నమస్తే తెలంగాణ

సమైక్య పాలకుల చతికిలపడ్డ చేనేత, మరమగ్గాల పరిశ్రమలకు తెలంగాణ సర్కారు జీవం పోసింది. బతుకమ్మ చీర లు, రంజాన్‌, క్రిస్మస్‌ వస్త్ర ఉత్పత్తుల ఆర్డర్లు ఇచ్చి కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపింది. చేనేతలక్ష్మి పథకం ద్వారా ప్రతి సోమవారం అధికారులు నేత వస్ర్తాలు ధరించాలని ఇచ్చిన పిలుపునకు విశేష స్పందన వస్తున్నది. ఓ వైపు కార్మికులకు చేతినిండా పని కల్పిస్తూనే, వారు సంపాదించిన కూలీలో కొంత పొదుపు చేసుకొనేందుకు త్రిఫ్ట్‌ పథకాన్ని అమలు చేసింది. ఈ పథకం కార్మికులకు భరోసానిస్తున్నది. 

నేత, మర నేతన్నల కోసమే..

కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించిం ది. మంత్రి కేటీఆర్‌ తన సొంత ఖర్చుతో ప్రతి కార్మికుడికి జనశ్రీ బీమా చేయించి, పాలసీ ప్రీమియం డబ్బులు చెల్లించారు. కార్మికుల పిల్లలకు ప్రభుత్వం ఉపకార వేతనాలు అందిస్తున్నది. దాంతో పాటు చేనేత కార్మికులకు త్రిఫ్ట్‌ పథకాన్ని వర్తింపజేస్తూ ప్రత్యేక జీవో జారీ చేసింది. త్రిఫ్ట్‌ పథకంలో జిల్లా వ్యాప్తంగా 1,566 మంది మరమగ్గాల కార్మికులు, 236 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనున్నది. ఈ పథకంలో భాగంగా ప్రభుత్వం జిల్లాకు 12కోట్లు కేటాయించింది. గతంలో కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ఈ పథకంలో కార్మికుడు నాలుగు శాతం, కేంద్రం నాలుగు శాతం, రాష్ట్ర ప్రభుత్వం నాలుగు శాతం చెల్లించేది. పదేండ్ల క్రితం ఈ పథకం రద్దు కాగా, తెలంగాణ ప్రభుత్వం కార్మికుల సం క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని పునః ప్రారంభించింది.

నిబంధనలు సడలింపు

లాక్‌డౌన్‌ నేపథ్యంలో త్రిఫ్ట్‌ పథకంలోని నిబంధనలను ప్రభుత్వం సడలించింది. మూడేండ్ల తర్వాత చెల్లించాల్సిన పొదుపు నగదును కార్మికుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని మధ్యలోనే తీసుకునే సౌకర్యం కల్పించింది. ప్రభుత్వం త్రిఫ్ట్‌ పథకాన్ని నవంబర్‌ 2017లో ప్రారంభించగా, కార్మికులు డిసెంబర్‌ 2018లో ఈ పథకంలో చేరారు. ఈ సంవత్సరం డిసెంబర్‌, వచ్చే సంవత్సరం ఫిబ్రవరిలో ఈ పథకం ముగియనున్నది. కాగా, కరోనా నేపథ్యంలో ఆరు నెలల ముందే బ్యాంకు నుంచి డబ్బులు పొందే అవకాశాన్ని ప్రభు త్వం కల్పించింది. 1,566మంది మరమగ్గాల కార్మికులకు 446.36లక్షలు, 235మంది చేనేత కార్మికులకు 67.74 లక్షలు బ్యాంకు నుంచి ఇప్పించింది. తిరిగి ఈ పథకంలో చేరేందుకు ఈ నెల నుంచి దరఖాస్తులు స్వీకరించేలా చేనేత జౌళిశాఖ కసరత్తు చేస్తున్నది. 

దరఖాస్తులు చేసుకోవడం ఇలా

త్రిఫ్ట్‌ పొదుపు పథకంలో చేరాలంటే ముందుగా చేనేత జౌళి శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫారంలో ఇంటి చిరునామా, పని చేస్తున్న కార్ఖానా, సాంచాలు, జియోట్యాగ్‌ చేసిన యూనిక్‌ నంబర్‌, నెల వేతనం వివరాలు రాయాలి. ఆధార్‌కార్డు, చేనేత జౌళిశాఖ జారీ చేసిన గుర్తింపు కార్డు, బ్యాంకు ఖాతా జిరాక్స్‌ పత్రాలు సమర్పించాలి. సాంచాలు, డైయింగ్‌, సైజింగ్‌, వార్పిన్‌, జాఫర్‌, భీములు నింపడం, మాస్టర్‌, హెల్పర్‌, టెక్నిషియన్‌, డిజైనింగ్‌, పని వివరాలు రాయాలి. 

ప్రతి కార్మికుడు చేరాలి

కార్మికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం త్రిఫ్ట్‌ పథకాన్ని పునః ప్రారంభించింది. మొదటి దఫాలో ఈ పథకంలో చేరిన 1,566మంది మరమగ్గాల కార్మికులకు 446.36లక్షలు, 235 మంది చేనేత కార్మికులకు 67.74లక్షలు బ్యాంకు నుంచి ఇప్పించింది. ఇంకా ఆరు నెలల గడువు ఉన్నా కరోనా నేపథ్యంలో డబ్బులు ముందస్తుగా చెల్లించేలా చర్యలు తీసుకున్నది. కార్మికులు తిరిగి ఈ పథకంలో మళ్లీ చేరేందుకు అవగాహన కల్పిస్తున్నాం. 

- అశోక్‌రావు, జిల్లా చేనేత జౌళీశాఖ అధికారిlogo