బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 27, 2020 , 03:05:30

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

రాజన్న ఆలయంలో భక్తుల రద్దీ

వేములవాడ కల్చరల్‌ : వేములవాడ శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామివారి ఆలయం ఆదివారం  భక్తులతో రద్దీగా కనిపించింది. కరోనా నేపథ్యంలో రాజన్న ఆలయ సిబ్బంది భక్తులకు థర్మల్‌ స్క్రీనింగ్‌ చేస్తూ, ఆలయ ఎదుట ఏర్పాటు చేసిన డిసిన్ఫెక్షన్‌ టన్నెల్‌ నుంచి లోపలికి  ప్రవేశించి స్వామివారి దర్శనం చేసుకునేలా ఏర్పాట్లు చేశారు. భక్తులు భౌతికదూరం పాటిస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. పూజల అనంతరం భక్తులు మాస్కులు ధరించి స్వామివారిని దర్శనం చేసుకున్నారు. రాజన్నను 2696 మంది దర్శనం చేసుకోగా, రూ.69620 ఆదాయం సమకూ రినట్లు  ఆలయ అధికారులు వెల్లడించారు.

ఆన్‌లైన్లో పూజలు  

ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకున్న రాజన్న భక్తులకు ఆలయ స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు పూజలు నిర్వహించారు.  ఆలయ ఆర్చకులు భక్తుల గోత్రనామాలపేర ఆలయ అద్దాలమండపంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అద్దాల మండపంలో అర్చకులు కోడెమొక్కులు, అభిషేక, అన్నపూజలు, నాగిరెడ్డి మండపంలో అమ్మవారి వద్దకుంకుమ పూజలు, స్వామివారి కళాభవన్‌లో స్వామివారి నిత్య కల్యాణం, చండీహోమం, సత్యనారాయణవ్రతం, లింగార్చన కార్యక్రమాలు  నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఈశ్వరగారి సురేశ్‌, గోపన్నగారి  రాఘవేందర్‌, దేవరాజు భాస్కర్‌, దుమాల నాగరాజు, గణేశ్‌, కృపాల్‌, శ్రీనాథ్‌ తదితరులు  పాల్గొన్నారు.