శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 27, 2020 , 02:37:55

మూడేండ్లు.. ఐదు కొలువులు

మూడేండ్లు.. ఐదు కొలువులు

ప్రభుత్వ ఉద్యోగం యువత స్వప్నం. సాకారం కోసం చాలా కష్టపడుతుంటారు. ఒకసారి రాకపోతే.. మళ్లీ మళ్లీ ట్రై చేస్తుంటారు. కొందరే సక్సెస్‌ సాధిస్తుంటారు. మరికొందరు ఆశ వదులుకొని ఇంకో లక్ష్యంవైపు అడుగులేస్తుంటారు. కానీ, పోటీ పరీక్ష ఏదైనా ఉద్యోగాన్ని సొంతం చేసుకుంటున్నారు మట్ట శ్రీనివాస్‌. సిద్దిపేట జిల్లాలో సాధారణ రైతు కుటుంబంలో పుట్టిన ఆయన, బాల్యం నుంచే తల్లిదండ్రుల కష్టాలను కళ్లారా చూసి చలించిపోయారు. మూడేండ్ల్లలోనే ఒకటి కాదు రెండు కాదు.. ఐదు జాబ్స్‌ సాధించి, ప్రస్తుతం వేములవాడ మున్సిపల్‌ కమిషనర్‌గా సేవలందిస్తున్నారు.   - వేములవాడ

సర్కారు విద్యాలయాల్లోనే అభ్యాసం..

శ్రీనివాస్‌ది సిద్దిపేట జిల్లాకేంద్రంలోని లింగారెడ్డిపల్లి. సాధారణ రైతు కుటుంబం. తల్లిదండ్రులు మట్ట రాజిరెడ్డి- లక్ష్మి దంపతుల ద్వితీయ సంతానం. శ్రీనివాస్‌ బాల్యం నుంచే చదువులో చురుగ్గా ఉండేవారు. స్వగ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 7వతరగతి దాకా అభ్యసించారు. తర్వాత సిద్దిపేటలో 10వతరగతి దాకా చదువుకొని 524మార్కులతో ప్రథమస్థానంలో ఉత్తీర్ణత సాధించారు. అత్యధిక మార్కుల సాధనకుగాను ఓ ప్రైవేట్‌ కళాశాల ఇంటర్‌లో ఫ్రీ ఎడ్యుకేషన్‌ కూడా అందించింది. అక్కడా 942మార్కులతో ప్రథమ స్థానం సాధించడమేకాదు డిగ్రీలోనూ ప్రతిభచూపి ప్రభుత్వ కోటాలోనే హైదరాబాద్‌లో గోకరాజు రంగరాజు కళాశాలలో ఎంసీఏ పూర్తిచేశారు. 

 ప్రజాసేవ చేయాలని..

ఎంసీఏ పూర్తిచేసిన శ్రీనివాస్‌రెడ్డి మొదట సాఫ్ట్‌వేర్‌ రంగంలో స్థిరపడాలనుకున్నారు. కానీ, ఏదో వెలితిగా ఉండడంతో 2013లో తిరిగి ఇంటికి చేరుకొని వ్యవసాయంలో తల్లిదండ్రులకు చేదోడువాదోడుగా నిలిచారు. 2015లో గ్రూప్‌-2 నోటిఫికేషన్‌ రావడంతో ఇంటివద్దే సన్నద్ధమై పరీక్ష రాశారు. ఫలితాలు ఆలస్యం కావడంతో 2017లో ఆర్‌ఆర్‌బీ ఎగ్జామ్‌ రాసి, అసిస్టెంట్‌ స్టేషన్‌ మాస్టర్‌ ఉద్యోగానికి ఎంపికయ్యారు. పోస్టింగ్‌ విజయవాడలో కావడంతో వెనక్కి తగ్గారు. ఆ తర్వాత పంచాయతీ సెక్రెటరీ, 2019లో వీఆర్వో, గ్రూప్‌-4లో జూనియర్‌ అసిస్టెంట్‌ ఉద్యోగాలకు ఎంపికైనప్పటికీ అదే సమయంలో వచ్చిన గ్రూప్‌-2 ఫలితాల్లో రాష్ట్రంలోనే 31వ ర్యాంకు సాధించారు. తనకు తహసీల్దార్‌, కమర్షియల్‌ ట్యాక్స్‌ అధికారి, సబ్‌ రిజిస్ట్రార్‌, అసిస్టెంట్‌ సెక్షన్‌ అధికారి, అసిస్టెంట్‌ రిజిస్ట్రార్‌, తదితర శాఖల్లో ఉద్యోగ అవకాశం ఉన్నప్పటికీ ప్రజా సంబంధాలు పెంచుకొని సేవ చేయాలనే సంకల్పంతో మున్సిపల్‌ కమిషనర్‌ ఉద్యోగంలో చేరారు. వేములవాడ పురపాలక సంఘంలో మొదటి పోస్టింగ్‌ను అందుకొని సమర్థవంతంగా పనిచేస్తున్నారు. 

ప్రజా సేవే లక్ష్యం..

కష్టపడితే సాధించలేనిదేమీ ఉండదు.. అది ఉద్యోగమైనా.. మరింకేదైనా.. నేను పూర్తిగా ఇంటి వద్ద సన్నద్ధమయ్యే జాబ్‌ సాధించా. ప్రజా సేవే లక్ష్యం. సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించి వారి కండ్లలో సంతోషం చూడాలన్నదే నా కోరిక. గ్రూప్‌-2లోనూ మెరుగైన ర్యాంకు వచ్చి, వివిధ పోస్టుల్లో అవకాశం ఉన్నప్పటికీ సేవ చేయాలనే ఉద్దేశంతో మున్సిపల్‌ కమిషనర్‌ జాబ్‌కు మొదటి ప్రాధాన్యమిచ్చా.  - మట్ట శ్రీనివాస్‌రెడ్డి, 

కమిషనర్‌ వేములవాడ