ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 26, 2020 , 02:02:00

మూడు తరాల సైకిల్‌ యానం

మూడు తరాల  సైకిల్‌ యానం

ఇవ్వాళ రేపు బయటికి వెళ్లాలంటే చాలు బైక్‌ తీస్తుంటారు. పక్కనే ఉన్న మార్కెట్‌కు పోవాలన్నా.. కిరాణా దుకాణంలో నిత్యావసర సామగ్రి తేవాలన్నా.. ఇలా ఏ చిన్నపాటి పనికైనా మోటర్‌ సైకిల్‌నే వినియోగిస్తున్నారు. కానీ, జమ్మికుంటకు చెందిన ‘రావికంటి’  కుటుంబం మాత్రం 70ఏళ్లుగా సైకిల్‌నే ఉపయోగిస్తున్నది. 1950లో ముత్తాత తొక్కిన సైకిల్‌ను నేటికీ అపురూపంగా చూసుకుంటూ మూడు తరాల అనుబంధాన్ని కొనసాగిస్తున్నది. ఎంత ఎదిగినా తాత చూపిన బాటలో పయనిస్తూ, కొడుకులు, మనువళ్లు, మునిమనువళ్లదాకా సైకిల్‌ ప్రయాణం చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నది. - జమ్మికుంట 

జమ్మికుంట: మనిషికీ సైకిల్‌కు మంచి అనుబంధం ఉంది. ప్రజారవాణా అందుబాటులో లేని సమయంలో ప్రయాణ సాధనంగా నిలిచింది. శారీరక వ్యాయామం, ఉచిత ప్రయాణం చేరవేసేది. మోటర్‌ సైకిల్‌ దెబ్బకి సైకిల్‌ చక్రం ఏనాడో విరిగిపోయింది. ఇప్పుడు ఇంటికో బైకో.. కారో ఉంటున్నది. బయటికి వెళ్లాలంటే బండి తీస్తున్న ఈ రోజుల్లో జమ్మికుంటకు చెందిన రావికంటి కుటుంబం మాత్రం సైకిల్‌పైనే సవారీ చేస్తున్నది. ఒకటి కాదు రెండు కాదు 70ఏళ్లుగా ఆ ఇంటి పెద్దలంతా ఎక్కడికి వెళ్లాలన్నా సైకిల్‌నే వినియోగిస్తున్నారు. ఆధునిక యుగంలో ఈ సైకిలేంది..? వాళ్లేమైన నిరుపేదలా అనుకుంటే పొరపాటే. వాళ్లు ప్రభుత్వ ఉద్యోగులు. వేలల్లో వేతనం ఉన్నా తాత ఇచ్చిన ఆస్తిని అపురూపంగా చూసుకోవడమే కాదు.. ఆయన చూపిన బాటలో ఎటు వెళ్లినా సైకిల్‌పైనే ప్రయాణం చేస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. 

1950లో కొనుగోలు.. 

జమ్మికుంటకు చెందిన రావికంటి శంకరయ్య వ్యాపారి. వర్తక సంఘం ప్రధాన కార్యదర్శి. 1950లో హెర్క్యులస్‌ కంపెనీకి చెందిన 12 సైకిళ్లు జమ్మికుంటకు రాగా, అందులో ఒక సైకిల్‌ను కొన్నాడు. ఆయన తర్వాత దానిని కొడుకు సాంబయ్య వాడుకున్నాడు. 1968 నుంచి 1995 వరకు అంటే 37ఏళ్లకుపైగా టీచర్‌ వృత్తిలో ఉన్నప్పటికీ ఏ మారుమూల గ్రామానికైనా సైకిల్‌పైనే వెళ్లాడు. విద్యాబోధన చేశాడు. ఆయన తదనంతరం ఇదే సైకిల్‌ను ఇద్దరు కొడుకులు సురేందర్‌, హరీశ్‌ సైతం వాడుకున్నారు. ఇప్పుడు సురేందర్‌ ఇద్దరు కొడుకులూ.. హరీశ్‌ కొడుకూ సైతం ముత్తాత సైకిల్‌ తొక్కుతూ మురిసిపోతున్నారు. ఇలా ముత్తాత, తాత, తండ్రుల వారసత్వంగా వస్తున్న ఆ‘పాత’ సైకిల్‌ను అపురూపంగా చూసుకుంటూ, మరో రెండు మూడు సైకిళ్లను కొనుక్కొని ఇంటిల్లి పాది సవారీ చేస్తున్నారు. 

మనువడి ప్రయాణం..

బైక్‌లు, కార్లలో ప్రయాణించే వారే అలసిపోతున్న ఈ రోజుల్లో.. 57 ఏళ్ల ప్రభుత్వోపాధ్యాయుడు సురేందర్‌, 28ఏళ్లుగా తాత శంకరయ్య సైకిల్‌పైనే పాఠశాలకు వెళ్తున్నాడు. నిత్యం 15కిలో మీటర్ల వరకు సైకిల్‌పైనే ప్రయాణిస్తున్నాడు. బడికి.. గుడికి.. కూరగాయల మార్కెట్‌కు.. ఇలా ఎటు పోవాలన్నా దానినే ఉపయోగిస్తున్నాడు. తన 24ఏళ్ల సర్వీస్‌లో అంకుశాపూర్‌(8కిలోమీటర్ల దూరం), ఇల్లందకుంట(5కి.మీ.), రంగమ్మపల్లి(4కి.మీ.) హుజూరాబాద్‌ మండలం పెద్దపాపయ్యపల్లి గ్రామాల్లో పనిచేశాడు.

ఆరోగ్యం బాగుంటుంది..

70 ఏళ్ల కిందట మా తాత కొన్న సైకిల్‌ ఇది. మా నాన్న, తర్వాత నేను, మా తమ్ముడు, మా పిల్లలూ ఇదే సైకిల్‌ను వాడుతున్నరు. నేను ఎటు పోవాలన్నా సైకిల్‌పైనే వెళ్త. ఇప్పుడు రంగమ్మపల్లిలో నౌకరీ. అక్కడికీ సైకిల్‌ మీదనే పోతున్న. సైకిల్‌ తొక్కడం వల్ల శారీరక వ్యాయామం. ఉచిత ప్రయాణం రెండూ సాధ్యమైతయి. ఆరోగ్యం బాగుంటుంది. పర్యావరణాన్ని పరిరక్షించిన వాళ్లమవుతం.

- రావికంటి సురేందర్‌, ప్రభుత్వోపాధ్యాయుడు (జమ్మికుంట)