మంగళవారం 01 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jul 23, 2020 , 02:35:57

కల్లాల నిర్మాణంతో కష్టాలకు చెక్‌

కల్లాల నిర్మాణంతో కష్టాలకు చెక్‌

రైతులు పండించిన ధాన్యాన్ని ఆరబెట్టుకునేందుకు పడుతున్న కష్టాలకు ఇక చెక్‌ పడనున్నది. ఉపాధి జాబ్‌ కార్డు వారికి సర్కారు కల్లాలు నిర్మించుకు నేందుకు రుణాలను ఇస్తున్నది. దీంతో రైతులు ఆనందంగా కల్లాల నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు. సర్కారు నిర్ణయంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

గంభీరావుపేట: ఆరుగాలం కష్టపడి పండించిన పంటను ఆరబెట్టుకునేందుకు రైతులు నానా ఇబ్బందులు పడేవారు.  పంటలు సాగు చేస్తున్న రైతులకు బంగారు తెలంగాణలో మంచి రోజులు వస్తున్నాయి. పండించిన ధాన్యం ఆరబెట్టిన తర్వాతనే మార్కెట్‌లో కొనుగోలు చేస్తారు. మార్కెట్‌లలో అందరికీ సరిపడా స్థలంలేక రోడ్ల వెంబడి ధాన్యం పోసి ఆరబెట్టుకునే వాళ్లు. అలాంటి కష్టాలకు చెక్‌ పెట్టేందుకు వ్యవసాయ క్షేత్రాల వద్దే ధాన్యాన్ని ఆరబెట్టేందుకు ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నది. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా నిధులు మంజూరు చేసి నిర్మాణాలు చేపడుతున్నది.

కల్లాల నిర్మాణానికి నిధులు

రైతులు తమ వ్యవసాయ క్షేత్రాల వద్ద కల్లాలు నిర్మాణం చేసుకునే వారు మండల వ్యవసాయ శాఖ కార్యాలయంలో దరఖాస్తు చేసుకుంటే వా రిని ఎంపిక చేసి నిధులు మంజూరు చేస్తారు. జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం ద్వారా జాబ్‌కార్డు ఉన్న వారు మాత్రమే కల్లాలను ని ర్మింకోవడానికి అర్హులవుతారు. 50 చదరపు అడుగుల కల్లం నిర్మాణానికి రూ.56 వేలు, 60 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.68 వేలు, 76 చదరపు అడుగుల నిర్మాణానికి రూ.85 వేలను అర్హులైన వారికి ప్రభుత్వం అందజేస్తుంది. 

రైతుల హర్షం

గంభీరావుపేట మండలంలోని 21 గ్రామాల్లో కల్లాల నిర్మాణానికి 130 మంది రైతులు         దరఖాస్తు చేసుకున్నారు. సంబంధిత శాఖాధికారులు క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి కల్లాల నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నారు. వంద శాతం రాయితీపై ప్రభుత్వం కల్లాల నిర్మాణానికి నిధులు మంజూరు చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం మార్కెట్లో అమ్మే ముందు రోడ్ల వెంబడి, గుట్టల పక్కన పెద్ద బండలు ఉన్నచోట ఆరబెట్టుకునే వాళ్లం. పొద్దు, మాపు అక్కడే ఉండి కావలి గాసేటోళ్లం. ఎండినంక మళ్ల మార్కెట్‌కు ధాన్యం తీస్కపోయే వాల్లం. ఇప్పుడు గింత మంచిగ సర్కారు సాయం జేత్తంది. మంచిగని ప్తితంది.  నా పొలంల కల్లం కట్టేటందుకు   దరఖాస్తు చేసుకున్న.-పొన్నాల నారాయణ, రైతు, పొన్నాల పల్లె

అవగాహన కల్పిస్తున్నం

ప్రభుత్వ ఆదేశాల మేరకు మండలంలోని గ్రామ పంచాయతీల వారీగా కల్లాల నిర్మాణానికి చర్యలు ప్రారంభించాం. దరఖాస్తు చేసుకున్న రైతులకు జాబ్‌కార్డు ఆధారంగా అనుమతులు ఇస్తున్నాం. మండలంలో ఇప్పటికే 130 మంది రైతులు దరఖాస్తు చేసుకున్నారు. రైతులు కల్లాలను నిర్మించుకునేందుకు అవగాహన కల్పిస్తున్నాం. -శ్రీనివాస్‌, ఎంపీడీవో, గంభీరావుపేట

జాబ్‌కార్డు ఉన్న వారందరికీ కల్లం  

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా దరఖాస్తు చేసుకున్న ప్రతి రైతుకూ కల్లం నిర్మాణానికి అనుమతులు ఇస్తున్నాం. జాబ్‌కార్డు ఉన్న రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు. ప్రభుత్వం కల్పిస్తున్న వసతులను అర్హులైన వారు సద్వినియోగం చేసుకోవాలి. -రాజయ్య, ఏపీవో, గంభీరావుపేట