శుక్రవారం 27 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 23, 2020 , 02:10:22

కషాయం చాయ్‌..తాగుదామా..

కషాయం చాయ్‌..తాగుదామా..

కరోనా రక్కసితో చిరువ్యాపారులకు కోలుకోని దెబ్బతగిలింది. కొనేటోళ్లు.. వచ్చేటోళ్లు లేక ఆగమైతుండగా, అప్పుడే గంభీరావుపేటలోని ఓ టీ కొట్టు నిర్వాహకుడికి మంచి ఉపాయం వచ్చింది. పడిపోయిన గిరాకీని తిరిగి రప్పించేందుకు కొద్దిరోజులుగా రోగ నిరోధక శక్తిని పెంచే కషాయం చాయ్‌ తయారు చేస్తుండగా, మంచి స్పందన వస్తున్నది. - సిరిసిల్ల/గంభీరావుపేట

కరోనా నేపథ్యంలో ప్రతి ఒక్కరికీ ఆరోగ్యంపై శ్రద్ధ పెరుగుతున్నది. ప్రజల అభిరుచికి తగ్గట్టే వ్యాపార రంగాల్లోనూ మార్పు వస్తున్నది. అందులోంచి ఈ కషాయం చాయ్‌ పుట్టుకొచ్చింది. గంభీరావుపేటకు చెందిన కోట్లె సుశీల-వెంకటేశ్‌ దంపతులు తయారు చేస్తున్న ఈ తేనీటికి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. స్థానికంగా టీ సెంటర్‌ నడుపుకునే ఈ దంపతులు, కరోనా మహమ్మారితో దెబ్బతిన్న వ్యాపారాన్ని నిలబెట్టేందుకు సరికొత్తగా ఆలోచించారు. రోగ నిరోధక శక్తిని పెంచే వివిధ రకాల మసాలా దినుసులు, ఆకులతో కషాయం చాయ్‌ తయారు చేస్తున్నారు. 7కు కప్పు అందిస్తున్నారు. స్థానికంగా బాగా ప్రాచుర్యం పొందడం, బస్టాండ్‌ ప్రాంతం కావడంతో గిరాకీ బాగా పెరిగి రోజుకు 100 నుంచి 125 కప్పుల చాయ్‌ను విక్రయిస్తున్నారు.  

ఇలా తయారీ..

మనం ఇంట్లో తయారు చేసుకునే కషాయం సాధారణంగా కాస్త చేదుగా ఉంటుంది. కానీ ఇక్కడి కషాయం చాయ్‌ మాత్రం స్వీటుగా ఉంటుంది. ఇందులో తులసీ, పుదీన, తమల పాకుతోపాటు వివిధ రకాల పత్రాలు, బెల్లం, మిరియాలు, అల్లం, శొంఠి, సోంపు, లవంగాలు, యాలకులు, తేనె, దాల్చిన చెక్క, ధనియాలు, నిమ్మకాయ రసంతో రుచికరంగా తయారు చేస్తుండడంతో ఆదరణ పెరిగింది. తక్కువ ధరకు మంచి ఆరోగ్యాన్ని పంచే తేనీరు దొరుకుతుండడంతో స్థానిక ప్రజలు తెగ తాగేస్తున్నారు.  

చాలా బాగుంది..

బయట నలుగురు దోస్తులు కలిస్తే చాలు ముందుగా గుర్తుకు వచ్చేది చాయే. కనీస మర్యాద కోసమైనా ఎవరో ఒకరు తాగుదామంటరు. తాగంది ఇడిసిపెట్టరు. కానీ కరోనా వైరస్‌ ఏందోగాని అలవాట్లన్నీ మారినయ్‌. బయట చాయ్‌ వంటివన్నీ తగ్గినయ్‌. కానీ ఈ హోటల్‌లో కషాయం మనం తాగే టీ కంటే మేలు చేసేదికావడంతో రోజూ తాగుతున్నం. చాలా రుచిగా ఉంది.

- ఎగదండి స్వామి, మాజీ ఎంపీటీసీ (గంభీరావుపేట)

ఇంట్లో చేసినట్టే ఉంది..

ఇక్కడ చాలా బాగా తయారు చేస్తున్నరు. గ్లాస్‌ కషాయం చాయ్‌ 7కే ఇస్తున్నరు. ఇది తాగడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందట. అందుకే రోజూ ఇక్కడికి వస్తున్న. ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్యం మీద ఎంత దృష్టి పెడితే అంత మంచిది. బయట చాయ్‌లు తాగే బదులుగా ఈ కషాయాన్ని తాగితే మేలు జరుగుతుంది.

- దోసల శంకర్‌, దోసల గూడెం