ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 22, 2020 , 02:09:57

స్వచ్ఛత వైపు పల్లెలు అడుగులు

స్వచ్ఛత వైపు పల్లెలు అడుగులు

స్వచ్ఛత వైపు పల్లెలు అడుగులు వేస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ రోడ్లపై పడేసే చెత్తను తరలించేం దుకు గ్రామాల్లో డంప్‌యార్డులు నిర్మిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో ఇప్పటికే 18 గ్రామాల్లో నిర్మాణ పనులు పూర్తి కాగా, మిగతా గ్రామాల్లో తుది దశకు చేరుకున్నాయి. కంపోస్ట్‌ షెడ్ల వినియోగంపై సర్పంచులు, కార్యదర్శులకు త్వరలో శిక్షణ ఇవ్వను న్నారు. ప్రతి కంపోస్ట్‌ షెడ్‌ను సంపద మార్గంగా సృష్టించేందుకు అధికార యంత్రాంగం కృషి చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు.

 చెత్త సేకరణ కోసం ప్రభుత్వం ఇప్పటికే ప్రతి ఇంటికీ రెండు చెత్త బుట్టలను అందించింది. అందులో తడి, పొడి చెత్తకు వేర్వేరు బుట్టలను వినియోగించాలని అవగాహన కల్పించింది. పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి గ్రామానికి ఒక ట్రాక్టర్‌ కొనుగోలు చేసేలా ప్రోత్సహించింది. పెద్ద గ్రామాల్లో ట్రాక్టర్‌కు ఓ మైక్‌ పెట్టి చెత్త సేకరణ కోసం ఇంటింటా తిరుగుతూ ప్రచారం నిర్వహిస్తున్నది. మండల కేంద్రం లో చెత్తను తప్పనిసరిగా సేకరణ వాహనానికి అందించేలా చొర వ తీసుకున్నారు. ఫలితంగా ప్రజలు ఓ అలవాటుగా పంచాయతీ ట్రాక్టర్‌కు చెత్తను అందిస్తున్నారు. 

మంత్రి కేటీఆర్‌ దిశానిర్దేశం..

సిరిసిల్ల పద్మనాయక కల్యాణ మండపంలో సర్పంచులు, ప్రజాప్రతినిధులకు అవగాహనా సదస్సు నిర్వహించి డంప్‌యార్డు నిర్మాణంపై మంత్రి కేటీఆర్‌ కచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. దీంతో సర్పంచులు డంప్‌యార్డుల నిర్మాణాన్ని పూరి ్త చేశారు. 

నిపుణులతో శిక్షణ..

డంప్‌యార్డుల నిర్మాణం పూర్తి కావడంతో వాటిని ఎలా వినియోగించుకోవాలో తెలుసుకొనేందుకు పలువురితో కార్యదర్శులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఇందు కోసం కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం బీబీపేటకు చెందిన సిద్ధ రామయ్య ఇటీవలే కంపోస్ట్‌ ఎరువు తయారీపై కార్యదర్శులకు శిక్షణ ఇచ్చారు. సేకరించిన చెత్తను తడి, పొడిగా వేరు చేయాలన్నారు. తడి చెత్తను బయటే ఓ గోతి తీసి అందులో వేసి రెండు, మూడు రోజులకు ఓసారి పశువుల పేడ నీళ్లను వేయడం ద్వారా కుళ్లిపోకుండా ఉంటుందని తెలిపారు. అనంతరం పొడిగా మారిన చెత్తను కంపోస్ట్‌ షెడ్‌ మొదటి అరలో వేసి దానిపై ఎర్రలు (వానపాములు) వేయాలని, ఇవి ఎరువును తయారీ చేస్తాయన్నారు. సేకరించిన చెత్తను ఎలా వేరు చేయాలి అనే అం శంపై స్వచ్ఛ భారత్‌ మిషన్‌ కో ఆర్డినేటర్‌ ఇటీవలే అవగాహన కల్పించారు. 

సంపద మార్గం ఇలా..

సేకరించిన తడి చెత్తను బయట గోతిలో వేసి పొడిగా మారిన తర్వాత కంపోస్ట్‌ షెడ్‌లో వేయాలి. అందులో వానపాములు వేయాలి. రెండో సారి వాటిపై మరో లేయర్‌ తడి చెత్తను వేసి నింపాలి. ఒక కంపోస్ట్‌ షెడ్‌ అరలో ఒక టన్ను నుంచి టన్నునర సేంద్రియ ఎరువు తయారు అవుతుంది. దీంతో సుమారు 15వేల నుంచి 20వేల వరకు వస్తుంది. ప్లాస్టిక్‌ సేకరించి తారు రోడ్డులో వినియోగించేందుకు ప్రయత్నిస్తున్నారు. చెత్తను ఎరువుగా మార్చేందుకు అవగాహన కల్పిస్తున్న తీరును కేంద్ర కమిటీ సభ్యులు రబ్బాని సైతం మెచ్చుకున్నారు.

సేంద్రియ ఎరువుతో ఆరోగ్యం..

సేంద్రియ ఎరువులతోనే మనిషి ఆరోగ్యంగా ఉంటాడు. పొలాల్లో వాడే రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందుల వినియోగంతో ఇబ్బందులు అయితున్నయ్‌. కంపోస్ట్‌ షెడ్‌ను సరిగా వినియోగించుకొని ఎరువుగా తయారు చేస్తే పంచాయతీకి మంచి ఆదాయం వస్తది.  

- సిద్ధ రామయ్య, సేంద్రియ ఎరువుల తయారీ నిపుణుడు

సర్పంచుల చొరవ భేష్‌

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సర్పంచులు వేగంగా నిర్మాణాలు పూర్తి చేశారు. ఇందుకు స్థానిక నాయకులు, ప్రజలు అందించిన సహకారం మరువలేము. దాదా పు డంప్‌యార్డుల నిర్మాణా లు పూర్తయ్యాయి. 

- బి.చిరంజీవి, ఎంపీడీవో, ఎల్లారెడ్డిపేట