బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 20, 2020 , 03:35:24

వేదిక రైతు ప్రగతికి దీపిక

వేదిక రైతు ప్రగతికి దీపిక

గంభీరావుపేట : రైతుల సంక్షేమమే ధ్యేయంగా సరికొత్త పథకాలతో పాటు వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసి దేశంలో ఎక్కడా లేని విధంగా క్లస్టర్ల వారీగా రైతు వేదికల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ప్రతి వ్యవసాయ క్లస్టర్‌కు ఒకటి చొప్పున రూ. 22లక్షల వ్యయంతో వీటి నిర్మాణం జరుగుతుంది. గంభీరావుపేట మండలానికి  ఆరు రైతు వేదికలు కేటాయించారు. ఇప్పటికే క్లస్టర్ల వారీగా స్థల సేకరణ పూర్తి కావడంతో నిర్మాణాలు జరుగుతున్నాయి. 

మండల కేంద్రంపై మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక దృష్టి

మండలంలోని ఆరు క్లస్టర్లలో గ్రామాల వారీగా రైతు వేదికలు నిర్మాణాలు చేపట్టడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  మండల కేంద్రంలో నిర్మించే రైతు వేదికకు మంత్రి కేటీఆర్‌ సొంతంగా ఖర్చులు భరిస్తున్నారు. గంభీరావుపేట గ్రామ శివారులో కాకుల గుట్ట వద్ద కేటీఆర్‌ సహకారంతో చేపడుతున్న రైతు వేదిక నిర్మాణ పనులు యుద్ధ ప్రాతిపదికన చేపడుతున్నారు. పనులు ప్రారంభించిన 25 రోజుల్లోనే తుది దశకు చేరుకున్నాయి. దీంతో క్లస్టర్‌ పరిధిలోని రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 

అన్నదాతల ఐక్యతకు వేదిక 

ప్రతి నిత్యం వ్యవసాయ పనుల్లో బిజీ బిజీగా ఉండే రైతులకు కాసేపు ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడానికి వారి ఐక్యతను చాటడానికి రైతు వేదికలు దోహదం చేయనున్నాయి. ఈ వేదికల్లోనే రైతుల కష్ట సుఖాలు వారు అనుసరించే నూతన పద్ధతులపై చర్చించడానికి వేదికలు మైలు రాయిగా నిలువనున్నాయి. 

సాంకేతిక సాగు చేరువ చేయడానికి

సాంకేతిక విధానంతో పంటలు సాగు చేసే పద్ధతులను రైతులకు చేరువ చేయడానికే రాష్ట్ర ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతు వేదికలు నిర్మాణం చేస్తున్నది. ప్రతి రైతు వేదికకు ఎకరం భూమిని సేకరించాలని, లేదా 20 గుంటల భూమిలో రైతు వేదిక నిర్మాణం చేపట్టాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ అధికారులకు సూచించారు. రైతు వేదికల వద్దకు వచ్చే రైతులంతా ఒక్క దగ్గర చేరి పంటల సాగు, మార్కెటింగ్‌ విధానం, అధునాతన పద్ధతులు, రైతు సంక్షేమ పథకాలు, తదితర అంశాలపై చర్చించుకోవడానికి వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. రైతు వేదికలో ఒక హాలు, రెండు గదులు, మరుగుదొడ్లు, వీడియో కాన్ఫరెన్స్‌ సౌకర్యం ఏర్పాటు చేయనున్నారు. రైతు వేదికకు సమీపంలోనే గోదాం నిర్మించి  రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు అందించనున్నారు. 

మండలంలో ఆరు రైతు వేదికలు

గంభీరావుపేట మండలంలోని ఆరు క్లస్టర్లలో రైతు వేదికలు నిర్మాణం చేస్తున్నారు. గంభీరావుపేట, సముద్రలింగాపూర్‌, దమ్మన్నపేట, నర్మాల, లింగన్నపేట, మల్లారెడ్డిపేట గ్రామాల్లో పనులు సాగుతున్నాయి. మండల కేంద్రంలో మంత్రి కేటీఆర్‌, సముద్రలింగాపూర్‌లో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు దాతలుగా వ్యవహరిస్తున్నారు. మిగతా నాలుగు రైతు వేదికలను ప్రభుత్వం నిర్మాణం చేస్తుంది. ఒక్కొక్కటి రూ.22లక్షల వ్యయంతో వీటిని నిర్మించనున్నారు.