ఆదివారం 29 నవంబర్ 2020
Rajanna-siricilla - Jul 16, 2020 , 02:37:56

ఆయకట్టుకు జీవం

ఆయకట్టుకు జీవం

  •  చొప్పదండి నియోజకవర్గానికి మరోసారి గోదావరి జలాలు
  •  ఎల్లంపల్లి నుంచి విడుదల చేయాలని సీఎం ఆదేశం
  •  నేడో రేపో నారాయణపూర్‌ రిజర్వాయర్‌కు నీళ్లు 
  •  ఫలించిన ఎమ్మెల్యే రవి శంకర్‌ కృషి
  •  65వేల ఎకరాలకు ప్రయోజనం

వట్టిపోతున్న క్షేత్రాలను అభిషేకించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న తెలంగాణ ప్రభుత్వం చొప్పదండి నియోజకవర్గానికి శుభవార్త చెప్పింది. చివరి ఆయకట్టునూ తడిపేందుకు మరోసారి గోదావరి జలాలను విడుదల చేయాలని నిర్ణయించింది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కృషితో తాజాగా సీఎం కేసీఆర్‌ ఆదేశాలు జారీ చేయగా, త్వరలోనే ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్‌కు గంగమ్మ పరవళ్లు తొక్కనున్నది. ఫలితంగా నియోజకవర్గంలోని 70 చెరువులు, 65వేల ఎకరాలకు ప్రయోజనం కలుగనున్నది.                             - గంగాధర  

చొప్పదండి నియోజకవర్గంలోని చివరి మడికీ తడి అందబోతున్నది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ కృషితో ఎల్లంపల్లి నుంచి నారాయణపూర్‌కు నీటిని విడుదల చేయనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. ఈనెల 12న  ప్రగతి భవన్‌లో ప్రాజెక్టులు, నీటి లభ్యత, రిజర్వాయర్లు, చెరువులు నింపడంపై మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ హాజరు కాగా, చొప్పదండి నియోజకవర్గం ఇప్పటికే వాటర్‌ హబ్‌గా మారిందని, వరదకాలువ జీవనదిలా ప్రవహిస్తోందని సీఎంకు వివరించారు. ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలం నారాయణపూర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయాలని సీఎం కేసీఆర్‌కు విజ్ఞప్తి చేశారు. నారాయణపూర్‌ జలాశయం పూర్తిస్థాయిలో నిండితే నియోజకవర్గంలోని 70 చెరువులు నిండడంతో పాటు కాలువల ద్వారా ఆరు మండలాల్లో 65 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంటుందని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎమ్మెల్యే విజ్ఞపి మేరకు నారాయణపూర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు. నేడో, రేపో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి నారాయణపూర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయడానికి అధికారులు ఏర్పాట్లు  చేస్తున్నారు. అన్నదాతల జీవితాల్లో సిరులు కురిపించడానికి ఒకటి రెండు రోజుల్లో గోదావరి జలాలు మరోసారి గంగాధర గడ్డపైన పరవల్లుతొక్కనున్నాయి. 

చివరి మడికీ సాగునీరు

నియోజకవర్గంలోని చివరి మడికీ సాగునీరు అందించేలా కృషి చేస్తాం. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆధ్వర్యంలో రాష్ట్రంలో రైతు సంక్షేమ ప్రభుత్వం నడుస్తున్నది. ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గంగాధర మండలం నారాయణపూర్‌ జలాశయానికి నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేయగా స్పందించి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. నేడో, రేపో గోదావరి జలాలు నారాయణపూర్‌ జలాశయానికి రానున్నాయి. రైతులు ప్రతి నీటి బొట్టును సద్వినియోగం చేసుకొని అధిక దిగుబడి సాధించాలి. నీటి విడుదలకు ఆదేశాలు జారీ చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు నియోజకవర్గ రైతుల తరఫున కృతజ్ఞతలు 

- సుంకె రవిశంకర్‌, ఎమ్మెల్యే, చొప్పదండి