శుక్రవారం 07 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 13, 2020 , 02:20:32

మత్స్యకారులకు బాసట

మత్స్యకారులకు బాసట

సిరిసిల్ల: మత్స్యకారులకు ఆర్థిక పరిపుష్టి కలిగించేందుకు సీఎం కేసీఆర్‌ వెన్నుదన్నుగా ఉంటున్నా రు. వారికి బాసటగా నిలిచేందుకు పలు పథకాలు ప్రవేశపెడుతున్నారు. చేపలు పట్టి, విక్రయించే వారి కి కిసాన్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా వివిధ రకాల రుణాలు అందించనున్నారు. ఈ రుణాలను బ్యాంకుల ద్వారా మంజూరు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. 25 వేల నుంచి సుమారు 6లక్షల వరకు రుణాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు ఆయా మండలాల్లోని బ్యాంకులకు మత్స్యశాఖ అధికారులు ఇటీవలే సర్క్యులర్‌ జారీ చేశారు. ఈ రుణాలు ఇచ్చేందుకు గాను విధి విధానాలపై త్వరలో అవగాహన సదస్సులు నిర్వహించనున్నట్లు మత్స్యశాఖ అధికారులు తెలిపారు. 

మత్స్యకారులకు   ప్రయోజనం ఇలా..

జిల్లాలో శ్రీ రాజరాజేశ్వర, ఎగువ మానేరు జలాశయాల పరిధిలో చేపలు పట్టేవారికి, చేపలు పట్టే ఆసక్తిగల వారికి ఈ రుణ సదుపాయం అందించనున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 402 చెరువులకు గాను 89 మత్స్య సహకార సంఘాలు ఉన్నాయి. మొత్తం 6,975 మంది మత్స్యకారులు ఉన్నారు. శ్రీ రాజరాజేశ్వర జలాశయం, ఎగువ మానేరులో చేపలు పట్టేందుకు 2,625మంది లైసెన్స్‌ పొంది ఉన్నారు. 4,350 మంది ఈ సంఘాల్లో సభ్యులుగా ఉన్నారు. కేసీఆర్‌ సర్కార్‌ ఇప్పటికే మత్స్యకారులకు పలు రాయితీలతో రుణాలు అందించింది. చేపలు పట్టేందుకు వలలు, తెప్పలు కొనుగోలుకు, మార్కెట్‌లో చేపల విక్రయాల కోసం రుణాలు ఇవ్వనున్నారు. రుణాల కోసం దరఖాస్తు చేసుకొనే వారి ఆదాయం, సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకోనున్నారు. 25 వేల నుంచి 6లక్షల వరకు రుణాలు మంజూరు చేయనున్నారు. కరోనా నేపథ్యంలో కేంద్రం కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా రుణాలు ఇవ్వనుంది. 

 రుణం పొందేందుకు అర్హతలు

జిల్లా సహకార సంఘాల్లో సభ్యుడిగా ఉం డాలి. శ్రీ రాజరాజేశ్వర, ఎగువ మానేరు జలాశ యాల్లో చేపలు పట్టేందుకు లైసెన్స్‌ కలిగి ఉండాలి. అలాగే బ్యాంకులో గతంలో రుణం పొంది సక్రమంగా చెల్లించి ఉండాలి.

దరఖాస్తులు స్వీకరిస్తున్నాం

రుణాలు ఇవ్వడానికి మత్స్యశాఖ సిద్ధంగా ఉన్నది. అర్హులైన వారి నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నాం. రుణాలు ఇవ్వాలని జిల్లాలోని బ్యాంకులకు లేఖలు రాశాం. జిల్లా వ్యాప్తంగా కిసాన్‌ క్రెడిట్‌ కార్డుల ద్వారా ఇచ్చే రుణాలకు సంబంధించిన అవగాహనా సదస్సులు త్వరలోనే నిర్వహిస్తాం. శ్రీ రాజరాజేశ్వర జలాశయానికి సంబంధించిన మత్స్యకారులకు కొదురుపాకలో, ఎగువ మానేరు జలాశయానికి సంబంధించిన మత్స్యకారులకు గంభీరావుపేటలో అవగాహనా సదస్సులు నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం.- ఖదీర్‌ అహ్మద్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా మత్స్యశాఖ అధికారి


logo