సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 09, 2020 , 01:13:38

పచ్చదనం పెంపునకు తమవంతు

పచ్చదనం పెంపునకు తమవంతు

సిరిసిల్లలోని విద్యార్థి ప్రజ్ఞ స్వచ్ఛంద సంస్థ సామాజిక సేవలో తరిస్తున్నది. ఓ వైపు అన్నార్థులు, పేద ప్రజలను ఆదుకుంటూనే, మరోవైపు పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నది. స్థానికంగా నిరుపేద విద్యార్థులకు చేయూత ఇవ్వడంతోపాటు ఆపదలో ఉన్నవారిని ఆదుకోవడమే లక్ష్యంగా తంగళ్లపల్లి మండల కేంద్రానికి చెందిన ఎడ్మల రవికిరణ్‌రెడ్డి, సిరిసిల్లకు చెందిన ఆదిత్య కలిసి 2012లో ఈ సంస్థను ప్రారంభించారు. మన దగ్గరే కాకుండా ఆంధ్రప్రదేశ్‌లోనూ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ‘స్లేట్‌' పేరిట స్థానికంగా ఏటా వేలాది మందికి నోటు పుస్తకాలు, పెన్నులు, పెన్సిళ్లు అందిస్తున్నారు. లాక్‌డౌన్‌లో ఉపాధిలేక ఇబ్బందులు పడుతున్న 1200 మందికి నిత్యావసర సరుకులతోపాటు పోలీసులు, జర్నలిస్టులు, కార్మికులకు శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేశారు. తాజాగా హరితహారంలోనూ తమవంతు పాలుపంచుకుంటూ, పలువురి మన్ననలు పొందుతున్నారు. 

 డీఎస్పీ స్ఫూర్తిగా..

పర్యావరణ పరిరక్షణపై మొదటి నుంచీ ప్రత్యేక దృష్టిసారిస్తున్న సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్‌ స్ఫూర్తిగా సంస్థ సభ్యులు హరితహారంలో పాలు పంచుకుంటున్నారు. మానవాళికి మేలు చేసే వేప మొక్కలను నాటిసిరిసిల్ల సబ్‌ డివిజన్‌ను పచ్చలహారంగా మార్చాలన్న ఉద్దేశంతో డీఎస్పీ కొద్దిరోజులుగా స్థానికంగా విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజాప్రతినిధులు, ప్రజల్లో చైతన్యం తెస్తున్నారు. అయితే వేప మొక్క (మూడు మీటర్లు పొడవు) ధర మన ప్రాంతంలో రూ.800 ధర పలుకుతుండడంతో వెనుకడుగు వేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. ఈ పరిస్థితిని గమనించిన సంస్థ సభ్యులు డీఎస్పీ చంద్రశేఖర్‌ను కలిసి తక్కువ ధరకే మొక్కలు అందిస్తామని, ఈ బృహత్తర క్రతువులో ‘మేము సైతం’ భాగస్వామ్యం అవుతామని చెప్పి పని మొదలు పెట్టారు. 

రాజమండ్రి నుంచి  మొక్కల సేకరణ..

మూడు మీటర్ల సైజు పెరిగిన మొక్కలు రాజమండ్రిలో తక్కువ ధరకే దొరుకుతుండడంతో అక్కడికి వెళ్లి తీసుకురావాలని సంస్థ సభ్యులు నిర్ణయించుకున్నారు. ప్రత్యేకంగా వాహనాన్ని సమకూర్చుకొని ఒక్కో మొక్కను రూ.200కు కొనుగోలు చేసి తెచ్చి, ఇక్కడ రూ.150కే అందిస్తున్నారు. ఇలా ఇప్పటివరకు 4వేలకు పైగా మొక్కలు కొని స్థానికంగా ప్రజాప్రతినిధులకు అందజేశారు. తాము నష్టపోయినా ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం అవుతున్నామనే సంతృప్తి దొరుకుతున్నదని సభ్యులు చెప్పారు.  

సమాజ సేవే లక్ష్యంగా పురుడుపోసుకున్న విద్యార్థి ప్రజ్ఞ స్వచ్ఛంద సంస్థ, పర్యావరణ పరిరక్షణకు తపిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న హరితహారంలో తన వంతు భాగస్వామ్యమవుతూ పచ్చదనం పెంపునకు విశేష కృషిచేస్తున్నది. స్థానికంగా ఒక్కోటి రూ.800 పలికే వేప (మూడు మీటర్ల పొడవు)మొక్కలను రాజమండ్రిలో రూ.200కే కొనుగోలు చేసి స్థానిక ప్రజాప్రతినిధులకు రూ.150కే అందజేస్తూ ప్రాకృతిక సేవ చేస్తున్నది.  - సిరిసిల్ల రూరల్‌

వేపచెట్లతో ఆరోగ్యం.. 

వేప చెట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. యాంటీ బ్యాక్టీరియాగా పనిచేయడంతోపాటు ఆక్సిజన్‌ను అధికంగా అందిస్తుంది. వైరస్‌లను నిరోధిస్తుంది. సిరిసిల్ల సబ్‌ డివిజన్‌లో సుమారు 20వేల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు వేశాం. ప్రజలు, ప్రజాప్రతినిధులు ముందుకురాగా, ఇప్పటి వరకు 4వేల మొక్కలు పెట్టాం. విద్యార్థి ప్రజ్ఞ సంస్థ ప్రతినిధులకు, ప్రజాప్రతినిధులకు అభినందనలు.    - చంద్రశేఖర్‌, సిరిసిల్ల డీఎస్పీ

సార్‌ ఆలోచనలతోనే.. 

డీఎస్పీ చంద్రశేఖర్‌ సార్‌ వేప మొక్కలు నాటాలనే ఆలోచన ఉందని చెప్పారు. మేం బాగా ఆలోచించాం. ఇంత మంచి కార్యక్రమానికి మా వంతు సాయం చేయాలని నిర్ణయించుకున్నాం. ఇక్కడ వేప మొక్కల ధరలు అధికంగా ఉండడంతో రాజమండ్రిలో తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడ అందిస్తున్నాం. ఇప్పటి వరకు 4వేల మొక్కలు సరఫరా చేశాం. ఇంకా చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం.- ఎడ్మల రవికిరణ్‌రెడ్డి, విద్యార్థి ప్రజ్ఞ సంస్థ అధ్యక్షుడుlogo