సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 08, 2020 , 02:03:31

రైతులకు ‘పట్టాలు’ ప్రగతికి ‘వారధులు’

రైతులకు ‘పట్టాలు’ ప్రగతికి ‘వారధులు’

తరతరాలుగా భూమి సాగు చేసుకుంటూ హక్కు పత్రాలు లేక ఇబ్బందులు పడ్డ రైతులకు మంత్రి కేటీఆర్‌ పట్టాలు అందించి ఏళ్లనాటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారు. సరైన రవాణా సౌకర్యం లేని మారుమూల గ్రామాల్లో ఒకేసారి ఐదు వంతెనలను ప్రారంభించి దశాబ్దాల కలను సాకారం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలంలో మంగళవారం పర్యటించిన అమాత్యుడు రామన్న, ముందుగా సబ్‌స్టేషన్‌, మూడు వారధులను ప్రారంభించారు. అనంతరం రంగంపేటలో 307 మంది రైతులకు భూ పట్టాలు పంపిణీ చేసి, గర్జనపల్లిలో సొంతఖర్చులతో నిర్మించనున్న రైతువేదిక నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఆ తర్వాత మరో రెండు వంతెనలకు ప్రారంభోత్సవం చేసి, డబుల్‌బెడ్‌రూం ఇండ్ల ప్రగతిపై సిరిసిల్లలో సమీక్ష నిర్వహించారు.   - సిరిసిల్ల/వీర్నపల్లి 

రైతును రాజు చేయాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, 24గంటల ఉచిత కరెంట్‌, రుణమాఫీతోపాటు పండించిన ధాన్యానికి మద్దతు ధర కల్పిస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రతి గ్రామానికి గోదావరి జలాలు అందిస్తూ వ్యవసాయాన్ని పండుగలా చేస్తున్నారు. కాళేశ్వరం నీళ్లు రావడంతో ప్రతి పల్లెలో సాగు విస్తీ ర్ణం పెరుగుతూ, ప్రతిఇంటా ధాన్యం సిరులు కురుస్తున్నాయి. ధాన్యం ధర రాక అమ్మకపోయినా దాచుకొనేందుకు గోదాములను సైతం సర్కారు నిర్మించింది. పండించిన ధాన్యం ఆరబోసుకొనేందుకు స్థలాలు లేక రోడ్లపైనా పోస్తున్నారు. దీంతో వచ్చే పోయే వాహనాలు, ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఈ విష యాన్ని గుర్తించిన ప్రభుత్వం ప్రతి రైతు ముగింట్లో కల్లాలు నిర్మించాలని నిర్ణయం తీసుకున్నది. 

తీరనున్న కల్లం కష్టాలు 

కల్లాలు లేక రైతులు పడుతున్న ఇబ్బందులు ఇక తీరనున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కల్లాలు నిర్మించాల ని సీఎం కేసీఆర్‌ ఆదేశాలతో అధికార యంత్రాంగం రంగంలోకి దిగింది. జిల్లాలోని 255పంచాయతీల్లో 297కలాలు నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇందుకోసం 14కోట్లు మంజూరయ్యా రు. రైతుల భూముల్లోనే కల్లాలు నిర్మించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కల్లాలు నిర్మించుకొనేందుకు రైతులు కూడా ముందుకు రావడంతో అధికారులు నిర్మాణ పనులను వేగవంతం చేస్తున్నారు. ఇప్పటికే ఎల్లారెడ్డిపేట మండలం పదిర గ్రామంలో నిర్మించిన కల్లాన్ని మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఉపాధిహామీ పథకంలో నిర్మిస్తున్న కల్లాలు ఎస్సీ, ఎస్టీలకు వంద శాతం, బీసీ, ఇతరులకు 90శాతం సబ్సిడీతో నిర్మిస్తున్నారు. 50స్వేర్‌ ఫీట్ల కల్లానికి 56వేలు, 60స్వేర్‌ ఫీట్ల కల్లానికి 68 వేలు, 75స్వేర్‌ ఫీట్ల కల్లానికి 80 వేలు ఖర్చు చేయనున్నారు. 

కేటీఆర్‌ ఆదేశాలతో వేగిరం ...

మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో జిల్లాలో కల్లాల నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేసేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. జిల్లాలోనే మొట్టమొదటగా ఎల్లారెడ్డిపేట మండలం పదిరలో నిర్మించిన కల్లాన్ని శాసనసభ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డితో కలిసి గత నెల 26న మంత్రి కేటీఆర్‌ ప్రారంభించా రు. మొత్తం 297కల్లాలు రెండు నెలల్లో పూర్తి చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేయడంతో రైతులు సంబురపడుతున్నారు. 

 సిరిసిల్ల/వీర్నపల్లి : మంత్రి కేటీఆర్‌ మంగళవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. ఉదయం హైదరాబాద్‌ నుంచి బయలు దేరి, మధ్యాహ్నం 12:45 గంటలకు గంభీరావుపేట మండలం దమ్మన్నపేటకు చేరుకున్నారు. అక్కడ ఇటీవల మృతిచెందిన సింగిల్‌విండో డైరెక్టర్‌ చంద్రారెడ్డి కుటుంబాన్ని టెస్కాబ్‌ చైర్మన్‌ రవీందర్‌రావుతో కలిసి పరామర్శించి, అండగా ఉంటానని మనోధైర్యం కల్పించారు. అనంతరం 1:20 గంటలకు వీర్నపల్లి మండలం కంచర్లలో 33/11 సబ్‌స్టేషన్‌ను, 1:55 గంటలకు రాశిగుట్ట- భూక్యాతండాల మధ్య వంతెనను, 2:05 గంటలకు మద్దిమల్లతండా-గుగులోత్‌ తండాల మధ్య నిర్మించిన వారధిని, 2:30 గంటలకు మద్దిమల్ల-సోమారంపేట మధ్య నిర్మించిన వంతెనను ప్రారంభించారు. 3:30 గంటలకు రంగంపేటలో పట్టాల పంపిణీ కార్యక్రమానికి వచ్చిన అమాత్యుడు రామన్నకు గ్రామస్తులు, తండావాసులు డప్పు చప్పుళ్లతో ఘనస్వాగతం పలికారు. అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై సర్వేనంబర్‌-10లోని సుమారు 281 ఎకరాల భూమికి సంబంధించిన పట్టాలను 307 మంది రైతులకు పంపిణీ చేశారు. అనంతరం సభావేదికపై ప్రసంగించారు. 4:15 గంటలకు గర్జనపల్లి బస్టాండ్‌ ప్రాంతంలో మంత్రి తన సొంత ఖర్చులతో నిర్మించనున్న రైతు వేదిక నిర్మాణానికి జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్యతో కలిసి భూమిపూజ చేశారు. 4:35 గంటలకు వన్‌పల్లి-చీమన్‌పల్లి దారిలో నిర్మించిన వంతెనను, 4:49 గంటలకు వన్‌పల్లి-శాంతినగర్‌ మధ్య నిర్మించిన వారధికి మంత్రి ప్రా రంభోత్సవం చేశారు. సాయంత్రం 6:20 గంటలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, అధికారులతో డబుల్‌బెడ్రూం ఇండ్ల ప్రగతిపై సమీక్షా సమావేశం నిర్వహించారు. 

అటవీ రక్షణ అందరి బాధ్యత..

అటవీ ప్రాంతాల్లో ఉన్న వారికి అటవీ సంపదను కాపాడే బాధ్యత కూడా ఉందని మంత్రి కేటీఆర్‌ సూచించారు. విచక్షణారహితంగా చెట్లను నరికివేస్తే రానున్న కాలంలో పీల్చే గాలి కోసం ఆక్సిజన్‌ సిలిండర్లను వీపుపై మోసుకెళ్లే పరిస్థితి ఎదురవుతుందని హెచ్చరించారు. అడవులు నరికివేసే వారిపై అటవీ అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. హరితహారంలో భాగంగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి, సంరక్షించాలని కోరారు.

వీర్నపల్లిని ఆదర్శంగా తీర్చిదిద్దుతా..

అటవీ ప్రాంతమైన వీర్నపల్లి మండలాన్ని అభివృద్ధిలో ఆదర్శంగా తీర్చిదిద్దుతానని మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. వెనుకబడిన ప్రాంతంగా ఉందని చింతించవద్దని, అన్ని రంగాల్లో అభివృద్ధి చేసే బాధ్యత తనదేనని స్పష్టం చేశారు. ఇటీవల విద్యుదాఘాతంతో హోటల్‌ దగ్ధం కాగా, బాధితుడు లకావత్‌ రాజేశ్‌కు రూ.లక్ష చెక్కును అందించారు.  కార్యక్రమంలో జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, జడ్పీ కో-ఆప్షన్‌ సభ్యుడు చాంద్‌ పాషా, జడ్పీటీసీ గుగులో త్‌ కళావతి, ఎంపీపీ భూల, టీఆర్‌ఎస్‌ జి ల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, ఆర్‌బీఎస్‌ మండల కన్వీనర్‌ ఎడ్ల సాగర్‌, ఆర్డీ వో శ్రీనివాసరావు, వైస్‌ ఎంపీపీ ఇసంపల్లి హేమ, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు రాజిరె డ్డి, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.

డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రగతిపై సమీక్ష

వీర్నపల్లి మండలంలో పర్యటించిన తర్వాత మంత్రి కేటీఆర్‌ సిరిసిల్లలోని తన క్యాంపు కార్యాలయంలో డబుల్‌ బెడ్రూం ఇండ్ల ప్రగతిపై కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాకు మంజూరైన డబుల్‌బెడ్రూం ఇండ్లను 9నెలల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. ఇండ్ల నిర్మాణంలో వేగం పెంచేందుకు ప్రతి మండలానికి ఒక నోడల్‌ అధికారిని నియమించాలని, ప్రత్యేక క్యాలెండర్‌ తయారు చేసుకోవాలన్నారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా ఉండాలని సూచించారు. 


logo