సోమవారం 03 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 07, 2020 , 02:19:32

నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

నగర సుందరీకరణపై ప్రత్యేక దృష్టి

  • n  బల్దియా ఆధ్వర్యంలో  చకచకా పనులు
  • n  వాకింగ్‌ ట్రాక్‌లు, స్మార్ట్‌ టాయిలెట్స్‌,   పార్కుల నిర్మాణం 
  • n  త్వరలోనే రూ. 50 కోట్ల పనులు   ప్రారంభం 

కార్పొరేషన్‌: నగర సుందరీకరణపై బల్దియా ప్రత్యేక దృష్టి పెట్టింది. అధునాతన టాయిలెట్స్‌, వాకింగ్‌ట్రాక్‌లు, పార్కుల అభివృద్ధి, ఓపెన్‌ జిమ్‌లు, శ్మశానవాటికల నిర్మాణ పనులు ప్రారంభించగా శరవేగంగా సాగుతున్నాయి. అలాగే, సీఎం అస్యూరెన్స్‌, స్మార్ట్‌సిటీ నిధులతో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపడుతున్నారు. మేయర్‌ వై సునీల్‌రావు నిరంతరం పర్యవేక్షిస్తూ పనులను పరుగులు పెట్టిస్తున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వివిధ గ్రాంట్ల ద్వారా వచ్చిన నిధులను అభివృద్ధి పనులకే వెచ్చిస్తున్నారు. బల్దియాలో అందుబాటులో ఉన్న పట్టణ ప్రగతి, ఎల్‌ఆర్‌ఎస్‌ కింద మంజూరైన రూ. 50 కోట్లతో మరిన్ని పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.  

మౌలిక వసతుల కల్పనే ధ్యేయంగా..

వివిధ డివిజన్లు, ముఖ్యంగా శివారు కాలనీల్లో మౌలిక వసతుల కల్పనపై బల్దియా యంత్రాంగం దృష్టి పెట్టింది. ఇప్పటికే సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు కొనసాగుతుండగా మిషన్‌ భగీరథ పనులు పూర్తికావచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ యేడాది శ్మశానవాటికల అభివృద్ధి, వాకింగ్‌ ట్రాక్‌లు, పబ్లిక్‌ టాయిలెట్స్‌, ఓపెన్‌ జిమ్‌లు, పార్కుల సుందరీకరణ, పార్కింగ్‌ స్థలాల ఏర్పాటుపై దృష్టి సారిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం సైతం అధునాతన టాయిలెట్స్‌ నిర్మించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో నగరవ్యాప్తంగా 15 ప్రాంతాల్లో స్మార్ట్‌ టాయిలెట్స్‌ నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నారు. మరో 20 చోట్ల ఓపెన్‌ జిమ్‌ల ఏర్పాటుతో పాటు శిథిలావస్థలో ఉన్న జిమ్‌లలో  కొత్త పరికరాలు అమర్చనున్నారు. పార్కుల అభివృద్ధికి ప్రణాళికా ప్రకారం ముందుకెళ్తున్నారు.

 త్వరలోనే పాలకవర్గ సమావేశం

నగరంలో రూ. 50 కోట్లతో సుందరీకరణ, అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఇందుకు బల్దియాకు కేటాయించిన పట్టణ ప్రగతి, ప్రభుత్వాల నుంచి మంజూరైన వివిధ గ్రాంట్ల నిధులు అందుబాటులో ఉన్నాయి. వివిధ పనులకు సంబంధించి పూర్తిస్థాయిలో ప్రతిపాదనలు సిద్ధం చేయగా, బల్దియా ఆమోదం పొందాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశం నిర్వహించేందుకు అధికారులు, మేయర్‌ సమాలోచనలు చేస్తున్నారు. నగరంలో కరోనా  విజృంభిస్తున్న నేపథ్యంలో ఏ విధంగా నిర్వహించాలనే విషయంపై తర్జనభర్జన పడుతున్నారు. సమావేశం నిర్వహించి పాలకవర్గం ఆమోదం తెలిపిన వెంటనే పనులు ప్రారంభించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. 


logo