మంగళవారం 11 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 06, 2020 , 01:29:26

బియ్యం పంపిణీ షురూ..

బియ్యం పంపిణీ షురూ..

కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో సర్కారు పేదలకు మరోసారి ఉచిత బియ్యాన్ని అందించాలని నిర్ణయం తీసుకుంది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన 5కిలోల బియ్యం ఏమాత్రం సరిపోనందున రాష్ట్ర ప్రభుత్వం మరో 5కిలోలు కలిపి పేదల కడుపు నింపేందుకు ముందుకొచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా ఆదివారం బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఉచిత బియ్యం పంపిణీ నవంబర్‌ వరకు కొనసాగనుంది.

-రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ 

 జిల్లాలో 1,73,065 తెల్లరేషన్‌ కార్డులుండగా, 5,05, 476 మందికి లబ్ధి చేకూరనుంది. రాష్ట్ర సర్కారు తీసుకున్న నిర్ణయంతో పేదల్లో హర్షం వ్యక్త మవుతోంది. ఉచితంగా బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు. కరోనా కట్టడికి ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించింది. దీంతో ఉపాధి కోల్పోయిన పేదలకు చేయూత నిచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఉచిత బియ్యం పథకాన్ని ప్రవేశపెట్టింది. కేంద్ర ప్రభుత్వం కేవలం 5కిలోలు మాత్రమే ఇవ్వడంతో అవి సరిపోవని భావించిన రాష్ట్ర సర్కారు మరో 5 కిలోలు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. ప్రతి  కుటుంబానికి 10కిలోల చొప్పున ఉచిత బియ్యం అందించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. 

జిల్లాలో 5,05,476 మంది  లబ్ధిదారులు 

పేదల సంక్షేమమే ధ్యేయంగా అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న తెలంగాణ సర్కారు ఆపత్కాలంలోనూ అండగా నిలుస్తున్నది. ఇప్పటివరకు అందించిన ఉచిత బియ్యం పథకాన్ని వచ్చే నవంబర్‌ వరకు కొనసాగించాలని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆదివారం నుంచి జిల్లాలో పంపిణీ కార్యక్రమాన్ని అధికారులు ప్రారంభించారు.  జిల్లాలోని లబ్ధిదారులకు  పంపిణీ చేసేందుకు జిల్లా యంత్రాంగం గత వారం నుంచే రేషన్‌ దుకాణాలకు నిత్యావసర సరుకులను తరలించింది. జిల్లాలోని 13 మండలాల్లో  లక్షా 73వేల 65 తెల్లరేషన్‌ కార్డులు ఉండగా, 5 లక్షల 5వేల 476 మంది లబ్ధిదారులు ఉన్నారు. వీరందరికీ 344 దుకాణాల్లో బయోమెట్రిక్‌ ద్వారా బియ్యం  పంపిణీ చేస్తున్నారు. ఉపాధి కోసం వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారంతా కరోనా వ్యాప్తి చెందుతున్న క్రమంలో తిరిగి స్వగ్రామాలకు తిరిగి వస్తున్నారు. వారికి సైతం సర్కారు ఉచిత బియ్యాన్ని పది కిలోల చొప్పున అందిస్తున్నది. కార్డు లేకున్నా ఆధార్‌కార్డు ఆధారంగా ఉచిత బియ్యాన్ని అందించి ఆకలి తీర్చింది. 

నేరుగా ఇంటికే సరుకులు...

స్వీయ నిర్బంధంలో ఉన్న వారికి నేరుగా ఇంటికే సరుకులు సరఫరా చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.  జిల్లాలో కరోనా వైరస్‌ వాప్తి ఎక్కువగా ఉంది. దీంతో జనం ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు మహారాష్ట్ర, గుజరాత్‌ ఇతర ప్రాంతాల నుంచి వస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. దీంతో చాలా మంది స్వీయ నిర్బంధంలో ఉండి ఇళ్లకే పరిమితమయ్యారు. వీరంతా బయటకు రాలేక పోతున్నందున అధికారులు వారి ఇంటి వద్దకే వెళ్లి బియ్యాన్ని సరఫరా చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. ఉచిత బియ్యం అందించి అండగా నిలుస్తున్నందుకు రాష్ట్ర ప్రభుత్వంపై సర్వత్రా హర్షాతీరేకాలు వ్యక్తమవుతున్నాయి. 


logo