మంగళవారం 11 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 06, 2020 , 00:43:46

చేపలకుంట.. సిరుల పంట

చేపలకుంట.. సిరుల పంట

తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు జిల్లాలోని వ్యవసాయరంగాన్ని సమూలంగా మార్చివేస్తున్నది. ఏండ్లుగా సంప్రదాయ పద్ధతులతో.. ఒకే రకమైన పంటలను సాగు చేస్తూ వచ్చిన రైతులు ఇప్పుడు వ్యవసాయానుబంధ పరిశ్రమల వైపు అడుగులు వేస్తున్నారు. అందివచ్చిన జలాలను.. సర్కారు ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకుంటూ వినూత్న పంటలకు శ్రీకారం చుడుతున్నారు. చేపల  చెరువులను ఏర్పాటు చేసి లాభాలను గడిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో ఫిష్‌కల్చర్‌ చేపట్టి ముందుకు సాగుతున్న పలువురు రైతులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..   - జ్యోతినగర్‌/ రామడుగు/వేములవాడ రూరల్‌/ఎల్లారెడ్డిపేట/జూలపల్లి

వర్షాలు పడితే వరి, పత్తి, మక్క..లేదంటే ఆరుతడి. ఇదీ నిన్నామొన్నటి వరకు తెలంగాణలో కొనసాగిన పంటల సాగుతీరు. ఇప్పుడు పరిస్థితి మారుతున్నది. అందివస్తున్న ‘కాళేశ్వర’ జలాలు.. సర్కారు ప్రోత్సాహకాల దన్నుతో రైతన్నలు వినూత్న పంథాలో సాగుతున్నారు. విభిన్న రకాల పంటల సాగుకు మొగ్గుచూపుతున్నారు. సేద్యంలో సరికొత్త చరిత్రను తిరగరాస్తూ ఔరా అనిపిస్తున్నారు. ఒకప్పుడు ఆంధ్రా, తదితర నీటివనరుల ప్రాంతాలకే పరిమితమైన చేపల చెరువులు ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దర్శనమిస్తుండడమే అందుకు నిలువెత్తు నిదర్శనం. ఆధునిక పద్ధతులతో చేపల పెంపకాన్ని చేపట్టి లాభాలను ఆర్జిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వేములవాడ మండలం మర్రిపెల్లికి చెందిన పండుగ లక్ష్మీనర్సయ్య ఉపాధి కోసం దాదాపు 17 ఏళ్ల పాటు గల్ఫ్‌కు వెళ్లాడు. తిరిగి వచ్చాక వ్యవసాయంపై దృష్టి పెట్టాడు. మొదటగా వరిని సాగుచేయగా ఆశించిన లాభాలు రాలేదు. దీంతో ఏదైనా కొత్తగా చేయాలని ఆలోచించాడు. ఎకరంలో ఆపిల్‌ బేర్‌ను సాగు చేసి నష్టాల బారిన పడ్డాడు. అయినప్పటికీ కుంగిపోకుండా వినూత్న పంటల సాగుకే మొగ్గుచూపాడు. ఇదే విషయమై గల్ఫ్‌లో తనతో పనిచేసిన ఆంధ్రాప్రాంత మిత్రులతో చర్చించాడు. స్నేహితుల సూచనలతో చేపల చెరువులను ఏర్పాటు చేసేందుకు పూనుకున్నాడు. మర్రిపెల్లి గ్రామానికి ఆనుకొని ఉన్న తన ఎకరం పది గుంటల భూమిలో 25 గుంటల విస్తీర్ణంలో 80 అడుగుల పొడవు, 10 అడుగుల లోతుతో రూ.2లక్షలు వెచ్చించి రెండు చెరువులను తవ్వించాడు. గతేడాదే ఒక చెరువులో 8 వేలు, మరో చెరువులో 30 వేల ఫంగస్‌ ఎఫ్‌ జాతికి చెందిన చేప పిల్లలను పెంచాడు. అయితే స్థానికంగా ఆ జాతి చేపపిల్లలకు అంతగా డిమాండ్‌ లేకపోవడంతో మార్కెటింగ్‌ కోసం ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. ఒకదశలో తానే స్వయంగా జగిత్యాల, హైదరాబాద్‌, కరీంనగర్‌ తదితర ప్రాంతాల్లోని చేపల మార్కెట్లకు వెళ్లి చేపలను సరఫరా చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం స్థానికంగా డిమాండ్‌ ఉన్న రవులు, బొచ్చెలు, మెరిగ, గ్రాస్‌కార్ప్‌, బంగారు తీగలు వంటి ఐదు రకాల చేపలను పెంచుతున్నాడు. దీంతో రెండేళ్లుగా లాభాల బాట పట్టాడు. ఆత్మవిశ్వాసంతో ముందుకుసాగి సంవత్సర కాలంలోనే లాభాలను సాధించాడు. లక్ష్మీనర్సయ్య చేపట్టిన చేపల సాగును క్షేత్రస్థాయిలో పరిశీలించిన రాజన్న సిరిసిల్ల జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, జడ్పీ ఉపాధ్యక్షుడు సిద్ధం వేణు, జిల్లా మత్స్యశాఖ అధికారులు, జిల్లా వ్యవసాయాధికారులు పలువురు ప్రజాప్రతినిధులు ఆయనపై ప్రశంసలు కురిపించారు. 

సహజ ఎరువులతోనే..

సహజ సిద్ధమైన సేంద్రియ ఎరువులతోనే చేపల పెరుగుదల ఆధారపడి ఉంటుంది. వ్యాధి నిరోధక శక్తి ఎక్కువగా ఉంటుంది. మార్కెట్‌లో అతి తక్కువ ధరకు లభిస్తున్న పెసరు పొట్టు, వరి తవుడు, నూకలు, మినపప్పు, కంది, నువ్వుల పండి, పల్లి పిండి, కాటన్‌ కేక్‌ను ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో నీటిలో బలం పెరగడంతో చేప ఆరోగ్యంగా ఉంటుంది. దాణా ఎక్కువైతే కూడా ఆక్సిజన్‌ అందక చేపలు చనిపోయే ప్రమాదముంది. అందుకే నీటిలో తెలియడే పిలేట్‌ సీడ్స్‌(దాణా)ను కూడా వినియోగిస్తున్న. దీంతో దాణాను ఏ మేరకు చేపలు తింటున్నాయో తెలిసిపోతుంది. దాణా కూడా వృథా కాకుండా చెరువు నీటి నాణ్యత బాగుంటుంది. సోమనపల్లిలో 12ఎకరాల విస్తీర్ణంలో..  

 అంతర్గాం మండలం సోమనపల్లికి చెందిన ఎలుగు రవీందర్‌కు 12 ఎకరాల భూమి ఉన్నది. అది వ్యవసాయేతర పనులకు అనుకూలించకపోవడంతో ఎన్నో ఏళ్లుగా మదనపడ్డాడు. ఎల్లంపల్లి నీరు అందుబాటులోకి రావడంతో మూడేళ్లుగా ఫిష్‌కల్చర్‌ను చేపట్టి లాభాలను ఆర్జిస్తున్నాడు. తనకున్న భూమి మొత్తాన్ని చేపల చెరువుగా మార్చాడు. చెరువును ట్యాంకులుగా విభజించి చేపలను పెంచుతున్నాడు. 12ఎకరాల చెరువును మొత్తం నాలుగు ట్యాంకులుగా విభజించి అందులో రవులు, బొచ్చె, బంగారు తీగ, గడ్డి చేప, ఫంగస్‌, వలుస చేప, రూప్‌గాట్‌ మొదలగు జాతుల చేపలను సాగు చేస్తున్నాడు. స్థానిక మార్కెట్లలో విక్రయిస్తూ, ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నాడు. తక్కువ సమయంలోనే లాభాలను ఆర్జిస్తున్నాడు. - ఎలుగు రవీందర్‌, చేపల వ్యాపారి 

ధూళికట్టలో 9 ఎకరాల్లో..

ఎలిగేడు మండలం ధూళికట్ట గ్రామ శివారులో నిర్మించిన చేపల చెరువులు మత్స్య సిరులు కురిపిస్తున్నాయి. ఊర చెరువు దిగువన ప్రైవేటు స్థలాల్లో 9ఎకరాల 15గుంటల విస్తీర్ణంలో దాదాపు పదేండ్ల కిందట చేపల పెంపకం కోసం నాలుగు చెరువులు తవ్వా రు. భూగర్భ జలాలపై ఆధారపడి ఇక్కడ రవులు, బొచ్చల పెంపకాన్ని చేపడుతున్నారు. ఏటా 3టన్నుల దాకా చేపల దిగుబడి వస్తున్నదని రైతులు తెలిపారు. చేపలుపట్టి చెరువుల వద్ద స్థానికులకు కిలో రూ.100, రూ.200 చొప్పున విక్రయిస్తున్నారు. తక్కువ ఖర్చుతో అధిక ఆదాయం పొందడంతో చేపల పెంపకం లాభసాటిగా మారుతున్నది. 

ఎల్లారెడ్డిపేట మండలం బొప్పాపూర్‌కు చెందిన వర్స కృష్ణహరికి దుమాల శివారులో సుమారు రెండెకరాల భూమి ఉన్నది. అందులో 40 గుంటల విస్తీర్ణంలో రెండు చెరువులను తవ్వించాడు. అందులో బొచ్చెలు, బంగారుతీగలు, రవుల రకానికి చెందిన 3500 చేపలు పెంచుతున్నాడు. మరో 15గుంటల విస్తీర్ణంలో తవ్వించిన చెరువులో ప్రత్యేకంగా కొరమీను (మొట్టలు) పెంచుతున్నాడు. మూడు ఇంచుల చేపపిల్ల ఒక్కోదాన్ని రూ.3కు కొనుగోలు చేశానని ప్రస్తుతం వాటి బరువు సుమారు50గ్రాములు ఉంటుందని చెరువుల నిర్వాహకుడు కృష్ణహరి వెల్లడించాడు. కిలో బరువు పెరిగేందుకు సుమారు 8 నెలల సమయం పడుతుందని, 2కేజీల చేపగా కావడానికి సంవత్సరం పడుతుందని తెలిపాడు. తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచి లాభాలు ఉంటాయని, స్వల్పకాలంలోనే ఆదాయం చేతికి వస్తుందని వివరించాడు.

ఇతర పంటలపై  దృష్టి పెట్టాలి

వ్యవసాయానుబంధం పరిశ్రమలపైనా రైతులు దృష్టి సారించాలి. ఆర్థికంగా ఎంతో మేలు జరుగుతుంది. మూస పద్ధతిలో సేద్యం కన్నా, మారుతున్న కాలానికి, మార్కెట్‌ డిమాండ్‌కు  అనుగుణంగా పంటలను పండించడంతో లాభాలను ఆర్జించవచ్చు. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలతో తక్కువ భూమి ఉన్నా అధిక ఆదాయాన్ని పొందవచ్చు. ప్రభుత్వ ప్రోత్సాహకాలను కూడా వినియోగించుకోవచ్చు. - వర్స కృష్ణహరి, బొప్పాపూర్‌ (ఎల్లారెడ్డిపేట)

ఆదాయం బాగానే ఉన్నది..
చేపల పెంపకం వల్ల లాభాలు బాగానే ఉన్నయ్‌. సంవత్సరానికి రూ.1.85 లక్షలకు చేపల చెరువులను లీజుకు తీసుకున్న. ఇతర గ్రామాల నుంచి చెరువు కాడికే వచ్చి చేపలు కొనుక్కవోతున్నరు. మార్కెట్ల సుత చాపలకు మంచి గిరాకీ ఉంది. మత్స్య శాఖ అధికారులు ప్రోత్సహిస్తే మరింత మంది చెరువులు తవ్వుకుంటరు. ప్రభుత్వం చేపల పెంపకం కోసం రాయితీలు ఇచ్చి ప్రోత్సహించాలె.- గణేశ్‌, గుత్తేదారు-పూసాల (సుల్తానాబాద్‌)
రామడుగు మండలం శ్రీరాములపల్లికి చెందిన యువరైతు వొంటెల కరుణాకర్‌రెడ్డి మొదట సంప్రదాయ పద్ధతిలో వరి సాగు చేశాడు. ఆధునిక పద్ధతిలో వినూత్న పంటలను సాగు చేయాలనే ఆసక్తి ఉన్నా అందుకు నీటి కొరత ప్రధాన సమస్యగా ఉండేది. ఇటీవల కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తరలిస్తుండడంతో సాగునీటికి ఢోకాలేకుండా పోయింది. అదీగాక శ్రీరాజరాజేశ్వర జలాశయానికి నీటిని తరలించడంలో లక్ష్మీపూర్‌లోని గాయత్రీ పంపుహౌస్‌ నుంచి శ్రీరాములపల్లి శివారు మీదుగా వెళ్లే గ్రావిటీ వరద కాలువ కీలకంగా ఉంటుంది. అక్కడి జంక్షన్‌ పాయింట్‌కు సుమారు రెండు వందల మీటర్ల దూరంలో వొంటెల కరుణాకర్‌రెడ్డి వ్యవసాయ భూమి ఉండడం, కాళేశ్వరం జలాలు ఏడాది పొడవునా ప్రవహిస్తుండడంతో సరికొత్తగా ఆలోచించాడు. తన  పెద్దనాన్న రాఘవరెడ్డి సలహా మేరకు ఐదెకరాల్లో చేపల చెరువును తవ్వించాలనుకున్నాడు. వెంటనే జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలను సంప్రదించి చేపల పెంపకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను, పాటించాల్సిన పద్ధతులను తెలుసుకున్నాడు. వారి సూచనల మేరకు సుమారు రూ.3లక్షలు వెచ్చించి మూడు ఎకరాల్లో మూడు చేపల చెరువులను తవ్వించాడు. జగిత్యాల నుంచి బొమ్మెలు (కొరమీను), బంగారు తీగలు, బొచ్చెలు, రవ్వులు, గ్యాస్‌కట్‌ తదితర విభిన్న రకాల పిల్లలను తీసుకొచ్చి పెంపకం మొదలుపెట్టాడు. సాగు చేపట్టిన ఆరునెలల్లోనే తను పెట్టిన పెట్టుబడి తిరిగి వచ్చిందని రైతు కరుణాకర్‌రెడ్డి సంతోషం వ్యక్తం చేస్తున్నాడు. చెరువును కేవీకే ఆధ్వర్యంలో పెద్దపల్లి, సిద్దిపేట, సిరిసిల్ల, జగిత్యాల, కరీంనగర్‌ జిల్లాల నుంచి 22 మంది ఔత్సాహిక రైతులు సైతం సందర్శించి, సలహాలను తీసుకుంటున్నారని వివరిస్తున్నాడు. వినూత్న ఆలోచనతో చేపల చెరువును తవ్వించి లాభాలను గడిస్తున్న యువ రైతు కరుణాకర్‌రెడ్డి ఇప్పుడు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాడు. 
 లాభాలు వస్తున్నయ్‌..
చేపల చెరువు తవ్వినప్పుడు నన్ను అందరూ తిట్టిన్రు. లాగోడి కూడా రాదన్నరు. అయినా నేను అవేవీ పట్టించుకోలె. రెండు సంవత్సరాలుగా చేపలను పెంచుతున్న. మొదటి సారి కొన్ని తిప్పలు వడ్డ. రెండో యేటి నుంచి తప్పులను సరిచేసుకుంటూ ముందుకు సాగిన. ఇప్పుడు లాభాలు వస్తున్నయి. మనకాడ డిమాండ్‌ ఉన్న రవులు, బొచ్చెల రకాలను ఎంపిక చేసుకోవడంతో ఇక్కడికే వచ్చి చేపలను కొనుక్కపోతున్నరు. మార్కెట్‌కు అనుగుణంగా కొత్త ఆలోచనలతో సాగు చేస్తే మంచి ఆదాయాన్ని పొందవచ్చు. - పండుగ లక్ష్మీనర్సయ్య, మర్రిపెల్లి (వేములవాడ)
మరిన్ని చెరువులు తవ్విస్త..
చేపల చెరువు ఏర్పాటు చేయాలని మా పెద్దనాన్న రాఘవరెడ్డి సూచన. తరాలుగా వరి సాగు చేస్తున్నామని ఏదైనా కొత్తగా చేయాలని ఆయన అభిలాష. అందుకే నేను చేపల చెరువును తవ్వించిన. తొలి యేడాదే చేపలు అనుకున్నదానికంటే ఎక్కువ బరువులో పెరిగినయ్‌. మంచి లాభాలు వచ్చినయ్‌. రాబోయే రోజుల్లో మరిన్ని చేపల చెరువులను తవ్వించేందుకు ప్రణాళికలు వేసుకుంటున్న. చేపల చెరువుల సాగును చేపడుతున్న రైతులకు విద్యుత్‌, దాణాను అందించడంలో రాయితీ ఇస్తే ఎంతో బాగుంటుంది. - వొంటెల కరుణాకర్‌రెడ్డి, శ్రీరాములపల్లి (రామడుగు)



logo