శుక్రవారం 07 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 05, 2020 , 00:57:01

మాకు అండగా నిలిచిండు

మాకు అండగా నిలిచిండు

  • lగౌరవ భృతిని పెంచిండు
  • lనమస్తేతో రాజన్న ఆలయ అనువంశిక బ్రాహ్మణులు  lవేములవాడతో పీవీకి విడదీయలేని అనుబంధం

సీఎంగా.. పీఎంగానే కాదు రాజన్న ఆలయ ధర్మకర్తగా పీవీ చెరగని ముద్ర వేసుకున్నారు. 1958-60 మధ్య కాలంలో ధర్మకర్తగా ఉన్న సమయంలో అనువంశిక బ్రాహ్మణుల గౌరవ భృతి రూ.45వేలకు పెంచిన ఆయన దేవాదాయ శాఖ మంత్రి బాధ్యతలు తీసుకున్నాక రూ. 60వేలకు పెంచుతూ జీవో కూడా జారీ చేశారు. వేములవాడతో సార్‌కు విడదీయలేని అనుబంధం ఉండేదని, తరచూ సందర్శిస్తుండేవారని పుజారులు, సన్నిహితులు చెబుతున్నారు.     - వేములవాడ కల్చరల్‌

ఆలయ ధర్మకర్తగా సేవలు..

మాజీ ప్రధాని పీవీ నరసింహారావుకు రాజన్న క్షేత్రంతో మంచి అనుబంధం ఉంది. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా మంథని ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 1958-60 మధ్య కాలంలో ఆలయ ధర్మకర్తగా పీవీ పనిచేశారు. రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రిగా కల్లూరి చంద్రమౌళి పనిచేసిన సమయంలో ఇక్కడికి వచ్చిన ఆయన, వేములవాడ అనువంశిక బ్రాహ్మణులకు ఇచ్చే ఘర్‌పట్టి(వార్షిక భృతి) చాలా తక్కువగా ఉన్నదని తెలుసుకున్నారు. ఈ క్రమంలో వెంటనే ఘర్‌పట్టి 10 ఏండ్ల సగటు రూ.45 వేలకు పెంచారు. ఆ తర్వాత 1965-66లో పీవీ దేవాదాయశాఖ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాక మరోసారి ఘర్‌ పట్టిని రూ.60 వేలకు పెంచుతూ జీవో కూడా జారీ చేసినట్లు రికార్డుల్లో ఉంది. పీవీ 1969-70లో సీఎం కాసు బ్రహ్మనంద రెడ్డితో కలిసి ఆలయ సందర్శనకు వచ్చారని, ఆ సమయంలో జాతర గ్రౌండ్‌లో ధర్మశాలల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారని చెబుతున్నారు. పీవీయే కాక ఆయన సోదరుడు పాములపర్తి మనోహర్‌రావు సైతం ఒకసారి ధర్మకర్తగా పనిచేశారని, వారి బంధువు కూడా ధర్మకర్తగా పనిచేసినట్లు చెబుతున్నారు. ఇక సాహిత్య ప్రియుడైన పీవీ.. 1970లో వేములవాడ ఆలయానికి వచ్చారు. ఆ సమయంలో వేములవాడ ముద్దుబిడ్డ మధురకవి మామిడిపెల్లి సాంబకవి రచనాగాన మాధుర్యానికి ముగ్దుడై, కాళేశ్వర సుప్రభాతాన్ని రచించమని కోరారు. ఈ క్రమంలో సాంబకవి సుప్రభాతం రచించడంతోపాటు ‘పీవీ నృసింహ సచివేన విబోధితేనభక్తేన సాంబకవి నోదిత సుప్రభాతం యద్యేకవార ముషసి ప్రథమం పఠేధ్యః తస్యేప్సితం దిశతి ముక్తిపతి ర్మహేశః’ అని పీవీ గురించి సంస్కృతంలో అద్భుతంగా వర్ణించినట్లు సాంబకవి కొడుకులు కోటేశ్వరశర్మ, రాజన్న, శ్రీనివాస్‌ చెబుతున్నారు. ఇలా ఆలయ ధర్మకర్తగా.. దేవాదాయశాఖ మంత్రిగా రాజన్న ఆలయ అభివృద్ధికి కృషిచేసిన పీవీ విగ్రహాన్ని వేములవాడలో ఏర్పాటు చేయాలని, అనువంశిక కుటుంబాలవారు కోరుతున్నారు.   logo