బుధవారం 12 ఆగస్టు 2020
Rajanna-siricilla - Jul 05, 2020 , 00:57:09

అపర భగీరథుడి చొరవతో తంగళ్లపల్లి మండలానికి కాళేశ్వరం నీళ్లు

అపర భగీరథుడి చొరవతో తంగళ్లపల్లి మండలానికి కాళేశ్వరం నీళ్లు

  •  మత్తడి దూకుతున్న సోమయ్య చెరువు
  • పారుతున్న బతుకమ్మ ఒర్రె
  • సర్వత్రా హర్షం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో మెట్ట ప్రాంతానికి కాళేశ్వర జలాలు చేరుకున్నాయి. రంగనాయకసాగర్‌ ప్రాజెక్టు నుంచి వస్తున్న గోదావరి నీళ్లు తంగళ్లపల్లి మండలాన్ని తాకాయి. బాలమల్లుపల్లెలోని సోమయ్య చెరువు మత్తడి దూకగా, బతుకమ్మ ఒర్రె కూడా పారుతు న్నది. సిరిసిల్ల ప్రాంతం ప్రస్తుతం కాళేశ్వర జలాలతో సజీవ జల దృశ్యాలకు వేదికవుతున్నదని అన్నదాతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. - సిరిసిల్ల రూరల్‌

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ద్వారా కాలువల నుంచి తంగళ్లపల్లి మండలంలోని చెరువులకు గోదావరి జలాలు చేరుతున్నాయి. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభం కావడంతో తంగళ్లపల్లి మండల ప్రజాప్రతినిధులు, రైతులు మంత్రి కేటీఆర్‌ను ప్రత్యేకంగా కలిశారు. రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు కాలువ ఇల్లంతకుంట మండలం వరకు ఉన్నది. ఈ కాలువలకు నీరు వదలడంతో మండలంలోని పలు గ్రామాల రైతుల్లో ఆశలు చిగురించాయి. ఇల్లంతకుంట మండలంలోని సిరికొండ నుంచి నేరుగా బాలమల్లుపల్లె, అటు జిల్లెల్లకు కాళేశ్వర జలాలు కాలువలు, ఒర్రెల ద్వారా చెరువులకు చేరాయి. 

నిండుకుంటున్న చెరువులు..

సిద్దిపేట జిల్లా చిన్నకొడూర్‌ మండలం జక్కాపూర్‌లో పలువురు రైతులు నీటిని అడ్డుకోవడంతో సరఫరా నిలిచిపోయింది. ఈ విషయాన్ని పలువురు మండల ప్రజాప్రతిని ధులు మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లారు. అమాత్యుడు వెంటనే స్పందించి కాళేశ్వరం ప్రాజెక్టు 11 ప్యాకేజీ, రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు సంబంధిత అధికారులతో మాట్లాడారు. సాధ్యమైనంత వరకు చెరువులు నిండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కేటీఆర్‌ ఆదేశాలతో రంగనాయక సాగర్‌ ప్రాజెక్టు కాలువ ద్వారా తంగళ్లపల్లి మండలంలోని చెరువులకు జలాలు చేరుతున్నాయి. బాలమల్లుపల్లెలోని సోమయ్య చెరువు మత్తడి దూకుతున్నది. బతుకమ్మ ఒర్రె పారుతూ, సండ్రవాగులోకి చేరి అంకుసాపూర్‌లోని చంద్రవంక ప్రాజెక్టులోకి నీరు చేరుతుంది. జిల్లెల్లలోని పెద్ద చెరువు పూర్తిగా నిండింది. త్వరలోనే మత్తడి దూకనున్నది.

37 చెరువులు నింపేందకు ప్రణాళికలు

తంగళ్లపల్లి మండలంలోని అన్ని చెరువులు పునర్జీవం పోసుకుంటున్నాయి. మిషన్‌ కాకతీయ పథకంలో భాగంగా చెరువుల్లో పూడిక తీశారు. కాళేశ్వరం ప్రాజెక్టు 11వ ప్యాకేజీలో రంగనాయకసాగర్‌ నుంచి తంగళ్లపల్లి మండలానికి కాలువ ఏర్పాటు చేయనున్నారు. చిన్నలింగాపూర్‌ నుంచి గోపాలరావుపల్లె వరకు సుమారు 15 కిలో మీటర్ల పొడువు ఈ కాలువ ఉంటుంది. ఇప్పటికే భూసేకరణ పూర్తి చేయగా, త్వరలోనే పనులు ప్రారంభించనున్నారు. దీంతోపాటు జిల్లెల్లలోని పెద్ద చెరువు నుంచి తాడూరు లోని ఊర చెరువు వరకు గొలుసుకట్టు చెరువుల లింక్‌ కాలువలను ఏర్పాటు చేయనున్నారు. దీంతో మండలంలోని 37 చెరువులను పూర్తిగా నింపేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. త్వరలోనే ఈ పనులు కూడా ప్రారంభంకానున్నాయి.

రుణపడి ఉంటాం

సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సార్లకు రుణపడి ఉంటాం. కాళేశ్వర జలాలు మా ఊరి చెరువుకు చేరాయి. సోమయ్య చెరువు నిండి మత్తడి దుంకుతున్నది. కండ్ల ముందు నీళ్లు కనిపిస్తుంటే రైతులు సంబరుపడుతున్నరు. మా కల నెరవేర్చిన కేటీఆర్‌ సార్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. 

- తిరుపతిరెడ్డి, మాజీ సర్పంచ్‌, బాలమల్లుపల్లె

ఇగ మాకు ఢోకా లేదు

నీళ్లను చూస్తే పానం లేచిచ్చింది. మా సోమయ్య చెర్ల నీళ్లను చూస్తుంటే సంబరమైతంది. నేను నాలుగు ఎకరాల్లో వరి వేసిన. బోర్ల నీల్లు ఉంటయో ఉండయో అనుకున్న. ఇక మా చెరువు నిండింది. బాయిలు, బోర్లకు నీళ్లచ్చినయ్‌. ఇకా మాకు ఢోకా లేదు. సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ సార్‌కు రుణపడి ఉంటాం.

- పరశురాములు, రైతు, బాలమల్లుపల్లె


తాజావార్తలు


logo