గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jul 01, 2020 , 03:27:58

నేడు తొలి ఏకాదశి

నేడు తొలి ఏకాదశి

  •  ఎంతో పుణ్యం.. ఏకాదశి వ్రతం
  •  నియమ నిష్టలే కీలకం 
  •  పండుగలకు ఆది

సిరిసిల్ల కల్చరల్‌: హైందవ సంప్రదాయ ప్రకారం పండుగల్లో తొలి ఏకాదశి మొదటిది. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున వస్తుంది. ఈ రోజుతో పండుగలు ప్రారంభమవుతాయి. దీనినే శయనైకాదశి అని కూడా అంటారు. మన ప్రాంతంలో పెద్ద ఏకాదశి అని వ్యవహరిస్తారు. ఈ రోజుకు ఎంతో విశిష్టత ఉంది. సమస్త మానవాళి చక్కటి జీవన సరళిని అలవరుచుకోవడం ఈ పండుగ వెనుక దాగి ఉన్న ఆంతర్యం. ద్వాదశి నుంచి చాతుర్మాస్య వ్రతం మొదలై కార్తీక శుద్ధ ద్వాదశితో ముగుస్తుంది. ఈ ఏకాదశి గురించి, చాతుర్మాస్య వ్రత విశేషాల గురించి బ్రహ్మవైవర్త పురాణం వివరిస్తోంది.  

తొలి ఏకాదశి.. వ్రత విశేషం

ఆషాఢ మాస ఏకాదశిని తొలి ఏకాదశి పండుగగా జరుపుకుంటాం. ఈ రోజు నుంచి మహావిష్ణువు క్షీరాబ్దిపై శయనిస్తాడు. కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని అంటారు.  తొలి ఏకాదశి వ్రతాన్ని ఆచరించేవారు దశమి రోజు రాత్రి ఆహారం తీసుకోకుండా ఏకాదశి రోజున సూర్యోదయానికి ముందే లేవాలి. శ్రీహరిని పూజించి నైవేద్యాలు సమర్పించాలి. ఆ రోజు మొత్తం ఉపవాసం ఉండాలి. కఠిన నియమాలు పాటించాలి. రాత్రంతా జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి రోజు ఉదయం శ్రీహరిని పూజించిన అనంతరం భోజనం చేయాలి. అప్పుడే వ్రతం సంపూర్ణమవుతుంది. వ్రతకాలంలో చేసే దానాలు అధిక ఫలాన్నిస్తాయి. ఏకాదశి రోజున ఉపవాసం చేయాలని వాయు పురాణం వివరిస్తోంది. పూర్తి ఉపవాసాలు చేయలేని వారు కనీసం ఒక్క పూటైనా ఉపవాసం చేసే పద్ధతి కూడా ఒకటి ఉంది. ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వారు విధిగా బ్రహ్మచర్య దీక్షను పాటించాలి. ఈ నియమాలతో  ఆరోగ్య పరిరక్షణ, మానసికోల్లాసం కలుగుతుందని పెద్దలు పేర్కొంటున్నారు.logo