గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jun 28, 2020 , 03:10:14

కొవిడ్ నిబంధనలు పాటించాలి

కొవిడ్ నిబంధనలు పాటించాలి

  • n కరోనా కట్టడికి సహకరించాలి
  • n కలెక్టర్ కృష్ణభాస్కర్ 
  • n అధికారులతో సమీక్షా సమావేశం

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: జిల్లా ప్రజలు కొవిడ్-19 నిబంధనలను తప్పనిసరిగా పాటిస్తూ, కరోనా కట్టడికి సహకరించాలని కలెక్టర్ కృష్ణభాస్కర్, ఎస్పీ రాహుల్‌హెగ్డే కోరారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతో కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, జిల్లాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో ప్రజలు స్వీయ నియంత్రణ చర్యలు పాటించాలని, వ్యాప్తిని అరికట్టడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వేములవాడ పట్టణంలో నిర్మిస్తున్న వంద పడకల దవాఖాన నిర్మాణ ప్రగతిని అడిగి తెలుసుకున్నారు. సిరిసిల్ల ప్రభుత్వ దవాఖానకు వచ్చే ప్రజలకు అన్నిరకాల సేవలు అందించేందుకు సరిపడా సిబ్బం ది, మెటీరియల్ గురించి ఆరాతీశారు. బస్టాండ్ ప్రాం తంలో పండ్లు విక్రయించే వ్యాపారులు సైతం రైతుబజార్‌లో అమ్ముకొనేలా చూడాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఇతర రాష్ర్టాల నుంచి వలస వచ్చే వారి సమాచారాన్ని కౌన్సిలర్ల సమన్వయంతో వివరాలు తెలుసుకోవాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలు గుంపులుగా బయటకు రావద్దని కోరారు. మాస్కులు తప్పనిసరి ధరించాలని, లేకుంటే జరిమానాలు విధిస్తామని హెచ్చరించారు. ఇందులో అదనపు కలెక్టర్ అంజయ్య, డీఎంహెచ్‌వో సుమన్‌మోహన్‌రావు, మున్సిపల్ వైస్ చైర్మన్ మంచె శ్రీనివాస్, కమిషనర్ సమ్మయ్య, దవాఖాన పర్యవేక్షకులు మురళీధర్‌రావు, రాధాకృష్ణ, మీనాక్షి పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలో చేపడుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని కలెక్టర్ కృష్ణభాస్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లోని మీటింగ్ హాల్‌లో జడ్పీసీఈవో, డీఆర్డీవో, డీపీవో, పంచాయతీరాజ్ ఇం జినీర్లతో కలిసి పంచాయతీల వారీగా వైకుంఠథామాలు, పంచాయతీ భవనాల నిర్మాణాల ప్రగతిపై శనివారం సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, గ్రామాల్లో వైకుంఠధామాలు, పంచాయతీ భవనాల కోసం స్థలం కేటాయించి చాలారోజులు గడుస్తున్నా పనులు ఎందుకు ప్రారంభించలేదని, ప్రారంభించిన చోట్ల ఎందుకు జాప్యంగా జరుగుతుందని సంబంధిత ఏఈలను ప్రశ్నించారు. ఆదివారం నుంచి ప్రతి పంచాయతీలో పనుల ప్రగతిని డీఈ, సంబంధిత అధికారులు క్షేత్రస్థాయిలో సందర్శించి లొకేషన్‌ను పంపించాలని ఆదేశించారు. వైకుంఠథామాలు, పంచాయతీ భవనాల నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేసి వినియోగంలోకి తేవాలన్నారు. ఇప్పటి వరకు నిర్మాణ పనులు ప్రారంభించని సర్పంచులకు ఎంపీడీవోల ద్వారా నోటీసులు పంపించామని తెలిపారు. విధుల్లో అలసత్వం ప్రదర్శించిన అధికారులు, ప్రజాప్రతినిధులపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో జడ్పీ సీఈవో గౌతంరెడ్డి, డీఆర్డీవో కౌటిల్యారెడ్డి, డీపీవో రవీందర్, పంచాయతీరాజ్ అధికారులు, ఇంజినీర్లు తదితరులు పాల్గొన్నారు.