గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - Jun 28, 2020 , 02:59:42

ఆత్మ నిర్భర్ కింద 10వేల రుణం

ఆత్మ నిర్భర్ కింద 10వేల రుణం

  • n ఇప్పటికే సర్వే పూర్తి చేసిన అధికారులు 
  • n అర్హులకు గుర్తింపు పత్రాలు జారీ 
  • n జూలై 1నుంచి రుణ పంపిణీకి ఏర్పాట్లు

వీధి వ్యాపారులకు భరోసా కల్పించేందుకు బల్దియా సన్నాహాలు చేస్తున్నది. ప్రధాన రహదారులకు ఇరువైపులా, ఖాళీ స్థలాల్లో తాత్కాలిక ఆవాసాలు, తోపుడు బండ్లను ఏర్పాటు చేసుకొని జీవనం సాగిస్తున్న వ్యాపారులను మెప్మా ఇప్పటికే సర్వే చేసి గుర్తించింది. అర్హులందరికీ గుర్తింపు పత్రాలు జారీ చేసింది. ఆత్మ నిర్భర్ పథకం కింద వీరందరికీ జూలై 1వ తేదీ నుంచి 10వేలు ఆర్థిక సాయాన్ని అందించేందుకు అధికార యంత్రాంగం సన్నద్ధమైంది. దీంతో వీధి వ్యాపారుల్లో హర్షం వ్యక్తమవుతున్నది.          

-  సిరిసిల్ల టౌన్


అర్హులైన వీధి వ్యాపారులకు ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి పథకం కింద జూలై 1నుంచి రుణాలు మంజూరు చేసేందుకు బల్దియా ఏర్పాట్లు చేసింది. వ్యాపారుల గుర్తింపునకు జూన్ 9న చేపట్టిన సర్వే ఈ నెల 25వరకు కొనసాగింది. సర్వే ఆధారంగా గుర్తించిన వీధి వ్యాపారులకు వెండింగ్ సర్టిఫికెట్లు మంజూరు చేస్తారు. మరో వైపు టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ అధికారులు సమన్వయంతో వెం డింగ్ జోన్ల గుర్తింపు ప్రక్రియ కూడా చేపట్టారు. వ్యాపారుల గుర్తింపు సర్వే జాబితా, వెండింగ్ జోన్ల గుర్తింపు ఈ రెం డింటి ఆధారంగా వ్యాపారులు ఒక క్రమపద్ధతిలో తమకు గుర్తించిన ప్రాంతాలు, నిర్ధారిత సమయాల్లో మాత్రమే విక్రయాలు సాగించాల్సి ఉంటుంది. 

అందరికీ అందేలాచర్యలు

టౌన్ ప్లానింగ్, ట్రాఫిక్ విభాగాలు అధికారుల సమన్వ యంతో స్ట్రీట్ వెండింగ్ ప్లాన్‌ను రూపొందిస్తారు. లబ్ధిదారుల జాబితాలో కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం వివిధ రకాల వ్యాపారులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి. రుణాలు పొందేందుకు వీలుగా వీరికి వెండింగ్ సర్టిఫికెట్లు జారీ చేస్తారు. మున్సిపల్ కమిషనర్, మెప్మా పీడీ బ్యాంకర్ల కమిటీ మీటింగ్‌ను ఏర్పాటు చేసి వీధి వ్యాపారులందరికీ ఖాతాలు తెరిచే విధంగా చర్యలు తీసుకోవడంతోపాటు ప్రధానమంత్రి పథకం ద్వారా రుణాలు లభించేవిధంగా చర్యలు తీసుకుంటారు. వీధి వ్యాపారులతో లీడ్ బ్యాంకు మేనేజర్, పోలీస్, మెప్మా అధికారుల సమక్షంలో సమావేశాలు నిర్వహించి ఒకటో తేదీ నుంచి రుణాలు అందేలా చర్యలు తీసుకుంటున్నారు. 

జిల్లాలో 914మంది గుర్తింపు..

మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య పర్యవేక్షణలో సిరిసిల్ల, వేములవాడ మున్సిపాల్టీల పరిధిలో వీధి వ్యాపారుల గుర్తింపు సర్వే పూర్తి చేశారు. 16 రోజుల పాటు జరిగిన ఈ సర్వేలో సిరిసిల్ల మున్సిపాలిటీలో 566 మంది, వేములవాడలో 348మంది వీధి వ్యాపారులు ఉన్నట్లు గుర్తించారు. సర్వేలో వ్యాపారులందరికీ గుర్తింపు కార్డులను జారీ చేస్తూ, ప్రభుత్వం నుంచి అందే అన్నిరకాల సౌకర్యాలు కల్పించనున్నట్లు అధికారులు చెబుతున్నారు.

డ్వాక్రా తరహాలోనే సంఘాలు..

డ్వాక్రా మహిళా సంఘాల తరహాలోనే వీధి వ్యాపారులతో సంఘాలను ఏర్పాటు చేయనున్నారు. ఐదు లేదా పది మంది సభ్యులతో గ్రూపులుగా ఏర్పడి బ్యాంకుల్లో పొదుపు అకౌంట్ తెరుస్తారు. వీరు లావాదేవీలు సక్రమంగా జరిపితే మొదట్లో 75వేలు, తర్వాత 10లక్షలు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు. ఆత్మనిర్భర్ నిధి పథకం ద్వారా పొందిన 10వేలు రుణం ప్రతినెలా 946 చొప్పున 12నెలల పాటు వాయిదాల రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. సకాలంలో రుణాలు చెల్లించిన వారి ఖాతాలో 1,602 సబ్సిడీ జమ చేస్తారు. డిజిటల్‌కు ప్రాధాన్యతను కల్పించాలన్న ఉద్దేశంతో ఆన్‌లైన్‌లో నగదు చెల్లించిన వారికి ప్రతినెల అదనంగా 100 క్యాష్ బ్యాక్ పొందే అవకాశం కల్పించారు. 


 ఒక్కొక్కరికి 10వేలు

ప్రధానమంత్రి ఆత్మ నిర్భర్ నిధి ద్వారా అర్హులైన వీధి వ్యాపారులందరికీ 10వేలు వడ్డీ లేని రుణం అం దిస్తాం. వీధి వ్యాపారులకు అండగా నిలిచేందుకు ప్రభుత్వం సహాయాన్ని ప్రకటించింది. తీసుకున్న రుణాన్ని ఏడాదిలోగా వడ్డీ లేకుండా వాయిదాలో చెల్లించాలి. వీధి వ్యాపారులకు గుర్తింపు కార్డులు, వెండింగ్ జోన్లను ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేశాం. డ్వాక్రా గ్రూపుల తరహాలో సంఘాలను ఏర్పాటు చేసి రుణాలు అందించనున్నాం. వచ్చే నెల 1 నుంచి ఈ ప్రక్రియను ప్రారంభిస్తాం. 

- సమ్మయ్య, మెప్మా పీడీ, మున్సిపల్ కమిషనర్ 


సద్వినియోగం చేసుకోవాలి

వీధి వ్యాపారులకు ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేందుకు ఆత్మ నిర్భర్ నిధి పథకం దోహదపడుతుంది. ఇప్పటికే పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో సర్వే చేసి వ్యాపారులను గుర్తించాం. ఈ పథకం ద్వారా ఒక్కో వ్యాపారికి 10వేలు రుణం అందిస్తారు. తీసుకున్న రుణం 12నెలల్లో వాయిదా పద్ధతిలో చెల్లించాలి. వీధి వ్యాపారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.

- జిందం కళ, మున్సిపల్ అధ్యక్షురాలు, సిరిసిల్ల



logo