మంగళవారం 14 జూలై 2020
Rajanna-siricilla - Jun 26, 2020 , 01:52:16

భవిష్యత్‌ తరాలకు హరిత సంపద బహుమతిగా ఇవ్వాలి

భవిష్యత్‌ తరాలకు హరిత సంపద బహుమతిగా ఇవ్వాలి

  •  కలెక్టర్‌ గుగులోత్‌ రవి 

మేడిపల్లి : భవిష్యత్‌ తరాలకు హరిత సంపద బహుమతిగా ఇవ్వాలని కలెక్టర్‌ గుగులోత్‌ రవి పిలుపునిచ్చారు. మోత్కురావుపేటలో గురువారం జడ్పీ ఉపాధ్యక్షుడు హరిచరణ్‌రావుతో కలిసి కలెక్టర్‌, డీఎఫ్‌వో బీవీరావు మొక్కలను నాటారు. గత సంవత్సరం హరితహారంలో మోత్కురావుపేట గ్రామం జిల్లాస్థాయి అవార్డు తీసుకున్నదని గుర్తు చేశారు. అదే స్ఫూర్తితో మరిన్ని ఆవార్డులు పొందాలని ఆకాంక్షించారు. అనంతరం వైకుంఠధామం పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీపీ  ఉమాదేవి, సర్పంచ్‌ లక్ష్మీనర్సయ్య, ఎంపీటీసీలు  రాజేశ్వరి, పూర్ణిమ, డీఆర్డీవో లక్ష్మీనారాయణ, ఎంపీడీవో పద్మజ, తహసీల్దార్‌ రాజేశ్వర్‌, డీఎఫ్‌ఆర్‌వో రవికుమార్‌, ఎంపీవో సుష్మ, ఏపీవో కొమురయ్య, ఏపీఎం అశోక్‌, ఎఫ్‌బీవో మధు, ఎస్‌ఐ శ్రీనివాస్‌ పాల్గొన్నారు.

 మెరుగ్గా పనిచేయాలి

జగిత్యాల : యాసంగిలో ధాన్యం కొనుగోళ్లను విజయవంతంగా పూర్తి చేశారని, వచ్చే సీజన్‌లో మరింత మెరుగ్గా పనిచేయాలని కలెక్టర్‌ గుగులోతు రవి పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పద్మనాయక కల్యాణ మండపంలో ప్రాథమిక సహకార సంఘాలు, వ్యవసాయ శాఖ అధికారులు, ఎరువుల కంపెనీ ప్రతినిధులతో గురువారం సమావేశం నిర్వహించి మాట్లాడారు. రైతుల సంక్షేమం కోసం  పనిచేయాలని, ప్రస్తుతం రైతులు ఎరువులు, విత్తనాల కొనుగోళ్లను ప్రారంభించారన్నారు. రైతులకు సరిపడా విత్తనాలు, ఎరువులు  ఉండేలా వ్యవసాయాధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రైతుబంధు డబ్బులు రైతుల ఖాతాల్లో పడ్డాయని, వాటిని తీసుకోవడానికి  బ్యాంకులకు వచ్చే రైతులు భౌతిక దూరం పాటించేలా చూడాలన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాల్లో రైతులు నియంత్రిత సాగు పద్ధతిలో పంటలు వేస్తున్నారా.. లేదా.. అని గమనించాలన్నారు. 295 రెవెన్యూ గ్రామాల్లో 215 గ్రామాల రైతు కార్డులను రూపొందించారని, దీంతో రైతులు ఏ పంట వేసుకుంటున్నారో చూసుకోవచ్చన్నారు. వ్యవసాయ అధికారులు గ్రామాలకు వెళ్లి రైతులకు వానకాలంలో ఏ పంట వేయాలో సూచిస్తున్నారని, ప్రాథమిక సహకార సంఘాల సభ్యులు కూడా రైతులకు సలహాలు అందించాలని సూచించారు.  కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ బేతి రాజేశం, జిల్లా వ్యవసాయాధికారి సురేశ్‌, డీసీవో రామాంజనేయులు పాల్గొన్నారు. logo