మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 25, 2020 , 01:51:52

అన్నదాతకు ప్రభుత్వం అండ

అన్నదాతకు ప్రభుత్వం అండ

రామడుగు: ముఖ్యమంత్రి కేసీఆర్‌ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్నదాతకు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ పేర్కొన్నారు. రామడుగు మండలం గుండి గ్రామానికి చెందిన రైతు దుర్గం రాములు కుటుంబ సభ్యులకు బుధవారం రూ. ఐదు లక్షల రైతు బీమా మంజూరు పత్రాలు అందించారు. దుర్గం రాములు దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఇటీవల మృతిచెందగా, ఆయన చిత్రపటం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ రంగ అభివృద్ధి లక్ష్యంతో అనేక పథకాలు అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబాన్ని రైతుబీమాతో ఆదుకుంటున్నారని కొనియాడారు. అలాగే వెంకట్రావుపల్లిలో రోడ్డు పక్కన పనులు చేస్తున్న ఉపాధి హామీ కూలీలను చూసిన ఎమ్మెల్యే, వాహనం దిగి వారితో మాట్లాడారు. ఆరోగ్యాన్ని కాపాడుకునేలా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ మార్కొండ లక్ష్మి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ ఏనుగు రవీందర్‌రెడ్డి, వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ గంట్ల వెంకటరెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ జూపాక కరుణాకర్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు గంట్ల జితేందర్‌ రెడ్డి, సర్పంచ్‌ గుండి మానస, ఎంపీటీసీ మడ్డి శ్యాంసుందర్‌, ఏడీ రామారావు, ఏవో యాస్మిన్‌, టీఆర్‌ఎస్‌ నాయకులు కలిగేటి లక్ష్మణ్‌, గుండి ప్రవీణ్‌ తదితరులు పాల్గొన్నారు.