మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 24, 2020 , 02:40:36

రైతు సూసైడ్‌ కేసులో అధికారులపై వేటు

రైతు సూసైడ్‌ కేసులో అధికారులపై వేటు

n కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ బదిలీ

n వీఆర్వో, వీఆర్‌ఏ సస్సెన్షన్‌ 

n కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ ఉత్తర్వులు

కాల్వశ్రీరాంపూర్‌: కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్‌ కార్యాలయం ఎదుట రైతు ఆత్మహత్య కేసులో బాధ్యులైన అధికారులపై పెద్దపల్లి కలెక్టర్‌ సిక్తాపట్నాయక్‌ చర్యలకు ఉపక్రమించారు. తహసీల్దార్‌ను బదిలీ చేయగా, వీఆర్వో, వీఆర్‌ఏను సస్పెండ్‌ చేశారు. వివరాల్లోకి వెళితే.. కరీంనగర్‌ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన మందల రాజిరెడ్డికి కాల్వశ్రీరాంపూర్‌ మండల కేంద్రంలో 694/సీ సర్వే నంబర్‌లో 1.22 ఎకరాల భూమి ఉంది. రాజిరెడ్డి తండ్రి పేరు మల్లారెడ్డి కాగా, పట్టా బుక్కులో నారాయణరెడ్డిగా తప్పుగా అచ్చయింది. పేరు సవరించాలని వీఆర్వో, వీఆర్‌ఏకు దరఖాస్తు చేసుకోగా, మూడేండ్లుగా తిప్పించుకుంటున్నారు. అలాగే గ్రామంలోని 167/బీ సర్వే నంబర్‌లో బంధువుల పేరిట ఉన్న రెండెకరాల భూమిలో వాటా రావాల్సి ఉంది. ఈ క్రమంలో అధికారులు, బంధువులు కలిసి వాటా రాకుండా చేస్తుండడంతో మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంటున్నానని, తన మృతికి తహసీల్దార్‌, వీఆర్వో, వీఆర్‌ఏ, బంధువులే కారణమని సూసైడ్‌ నోట్‌లో రాసి పెట్టుకొని,  ఈ నెల 20వ తేదీన కార్యాలయం ఎదుట పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అయితే ఈ ఘటనపై విచారణ అనంతరం మంగళవారం సాయంత్రం బాధ్యులైన అధికారులపై కలెక్టర్‌ వేటు వేశారు. తహసీల్దార్‌ వేణుగోపాల్‌ను పెద్దపల్లి కలెక్టరేట్‌ కార్యాలయంలోని డీ-సెక్షన్‌ సూపరింటెండెంట్‌గా బదిలీ చేసి, ఆ స్థానంలో ఉన్న జే సునీతను కాల్వశ్రీరాంపూర్‌ తహసీల్దార్‌ నియమించారు. అలాగే వీఆర్వో గురుమూర్తి, వీఆర్‌ఏ చొప్పరి స్వామిని సస్పెండ్‌ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.