బుధవారం 25 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 24, 2020 , 01:32:52

పండుగను తలపించిన కేటీఆర్‌ పర్యటన

పండుగను తలపించిన కేటీఆర్‌ పర్యటన

n  సమీకృత రైతుబజార్‌ ప్రారంభం

n  రైతులను పలుకరిస్తూ ముందుకు..

సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్‌: రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ సిరిసిల్ల పర్యటన విజయవంతమైంది. మంగళవారం ఉదయం 11:40 గంటలకు పట్టణానికి చేరుకున్న మంత్రి ముందుగా మానేరు వాగు వద్ద ఎస్పీ నివాస గృహం సమీపంలో రూ.5.15 కోట్లతో నిర్మించిన మోడ్రన్‌ సమీకృత రైతుబజార్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా మార్కెట్‌లో కలియదిరుగుతూ స్టాళ్లను పరిశీలించారు. ‘కూరగాయల సాగు బాగా చేసి.. దళారులకు ఇవ్వకుండా సొంతంగా విక్రయించి ఆర్థికంగా ఎదగాలి’ అంటూ ఈ సందర్భంగా రైతులకు సూచించారు. అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన వేదికపై ప్రసంగించారు. 12:55 గంటలకు నెహ్రూనగర్‌ శివారులో మానేర్‌వాగుపై రూ.1.20 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యాం పనులకు జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణతో కలిసి శంకుస్థాపన చేశారు. చెక్‌డ్యాం ప్రయోజనాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. 1:15 గంటలకు గణేశ్‌నగర్‌లో 13 గుంటల స్థలంలో రూ.41 లక్షలతో నిర్మించిన పార్కును ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీవాసులను పలుకరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి, సంరక్షించాలని సూచించారు. మధ్యాహ్నం 3 గంటలకు సిరిసిల్ల మున్సిపల్‌ అభివృద్ధి, ఈ నెల 25న ప్రారంభించనున్న హరితహారం కార్యక్రమ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షా సమావేశం నిర్వహించి దిశానిర్దేశం చేశారు. 

రైతుబజార్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దాం

సిరిసిల్ల సమీకృత రైతు బజార్‌ను రాష్ట్రంలోనే ఆదర్శంగా తీర్చిదిద్దినట్లు మంత్రి కేటీఆర్‌ తెలిపారు. ఈ సముదాయంలో వసతి చూడముచ్చటగా ఉందన్నారు. పట్టణంలో అభివృద్ధి పరుగులు పెడుతున్నదని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలోనూ సమీకృత రైతు బజార్లు నిర్మిస్తామని వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలను సిరిసిల్ల మాదిరిగా అభివృద్ధి చేస్తామని ప్రకటించారు. 

ప్లాస్టిక్‌ రహితంగా ఉంచాలి

రైతు బజార్‌ను ప్లాస్టిక్‌ రహితంగా ఉండేలా చూడాల్సిన బాధ్యత మున్సిపల్‌ పాలకవర్గం, అధికారులదేనని మంత్రి కేటీఆర్‌ సూచించారు. రైతుబజార్‌ స్టాళ్లలోని ప్రతి ఒక్కరికీ మున్సిపల్‌ నుంచి తడి, పొడి చెత్త బుట్టలను అందించాలని అధికారులను ఆదేశించారు. బట్ట సంచులు, టిఫిన్‌ బా క్సులు తెచ్చుకున్నవారికే కూరగాయలు, మాంసం ఇవ్వాలని సూచించారు. 

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

సింగిల్‌ విండో చైర్మన్‌ నుంచి సీఎం వరకు ఎదిగినా, రైతు సంక్షేమం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచిస్తారని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. నాడు సింగిల్‌ విండో చైర్మన్‌గా ఉన్న సమయంలోనూ రైతు ప్రయోజనాల కోసమే పాటుపడేవారని, నేడు సీఎం స్థాయిలో ఉన్నా రైతును రాజు చేయాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని చెప్పారు. ముఖ్యమంత్రి రోజుకు 18 గంటల పాటు రైతుల కోసమే ఆలోచిస్తున్నారని జిల్లా రైతుబంధు సమితి అధ్యక్షుడు గడ్డం నర్సయ్య ప్రసంగాన్ని అనుసరించిన మంత్రి కేటీఆర్‌, సీఎం ఆలోచనా విధానాన్ని వివరించారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో పరిపాలనాదక్షత కలిగిన కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండడం వల్లే దేశం అబ్బురపడేలా రాష్ట్రంలో అభివృద్ధి జరుగుతుందని, తెలంగాణ పథకాలను కేంద్రం సైతం అమలు చేయడమే దీనికి ఉదాహరణ అని వివరించారు. వ్యవసాయం దండుగ నుంచి వ్యవసాయం పండుగలా చేసిన ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందని స్పష్టం చేశారు.

విప్లవాల యుగం ఆరంభం

రాష్ట్రంలో విప్లవాల యుగం ఆరంభమైందని మంత్రి కేటీఆర్‌ స్పష్టం చేశారు. గోదావరి జలాలను మెట్ట ప్రాంతమైన శ్రీరాజరాజేశ్వర జలాశయం, కొండపోచమ్మ సాగర్‌, రంగనాయక్‌సాగర్‌కు ఎత్తిపోసి రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ జల విప్లవం తీసుకొచ్చారని తెలిపారు. ప్రాజెక్టుల్లో నీటితో మత్స్య పరిశ్రమ అభివృద్ధి చెందిందని, తద్వారా నీలివిప్లవం వచ్చిందన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం యాదవ కుటుంబాలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేసి, గొర్రెల పెంపకంలో నంబర్‌వన్‌గా నిలిచిందని, మాంసం ఉత్పత్తుల్లో దేశంలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకొని గులాబీ విప్లవాన్ని సాధించిందన్నారు. ప్రతి ఇంటికీ బర్రెలను పంపిణీ చేసి క్షీర విప్లవానికి శ్రీకారం చుట్టనున్నట్లు చెప్పారు

ఇన్ని చేసి రైతు బంధు ఎగ్గొడతమా..!

అన్నదాతల సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టిన ముఖ్యమంత్రి కేసీఆర్‌, రైతుబంధు ఎగ్గొడుతారని ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు హాస్యాస్పదంగా ఉన్నాయని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. నియంత్రిత సాగుపై ప్రతిపక్షాల వక్రభాష్యాలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. రైతుబంధు ఎగ్గొట్టే ఆలోచనే లేదని స్పష్టం చేశారు. గత వానకాలంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలో 1,03,153 మంది రైతులకు రూ.121 కోట్లు అందించా మని, ఈ వానకాలంలో 1,12,767 మంది రైతులకు రూ.128.05 కోట్లు అందిస్తున్నా మని వివరించారు. గత ఏడాది కంటే ఈసారి దాదాపు 9614 మంది రైతులు పెరిగారని తెలిపా రు. సీఎం కేసీఆర్‌ రైతులకు అన్యాయం చేయరని చెప్పారు. కరోనా సంక్షోభ సమయంలోనూ రైతు సంక్షేమం కోసం ఆలోచించి సోమవారం నుంచి వారి ఖాతాల్లో నగదు జమయ్యేలా చూస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే చెల్లుతుందన్నారు. ప్రస్తుతం 25 లక్షల మెట్రిక్‌ టన్నుల గోదాంలు అందుబాటులో ఉన్నాయని, రాబోయే కాలంలో 50 లక్షల మెట్రిక్‌ టన్నుల నిలువ సామర్థ్యం గల గోదాంలను నిర్మిస్తామని వివరించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ అధ్యక్షుడు రవీందర్‌రావు, జడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, సెస్‌ అధ్యక్షుడు దోర్నాల లక్ష్మారెడ్డి, గ్రంథాలయ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ లింగం రాణి, జిల్లా మార్కెటింగ్‌ అధికారి శాబొద్దీన్‌, కౌన్సిలర్లు ఎల్దండి దేవదాస్‌, అన్నారపు శ్రీనివాస్‌, వేముల రవి, టీఆర్‌ఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి తోట ఆగయ్య, పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి, సీనియర్‌ నాయకురాలు పూసపల్లి సరస్వతి, తదితరులు పాల్గొన్నారు.