ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 23, 2020 , 00:35:42

ఇదిగిదిగో మోడ్రన్‌ రైతుబజార్‌

ఇదిగిదిగో మోడ్రన్‌ రైతుబజార్‌

  •  రాష్ర్టానికే తలమానికంగా సిరిసిల్ల సమీకృత మార్కెట్‌ 

రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలో దశాబ్దాల కాలం నుంచి గాంధీచౌరస్తాలోనే కూరగాయలతోపాటు మటన్‌, ఫిష్‌ మార్కెట్‌ నడుస్తున్నది. ఇవేగాక కిరాణా, బియ్యం, పండ్లు, పూలు, కూరగాయల వ్యాపారం జరుగుతున్నది. ఇక్కడ సిరిసిల్లతోపాటు, సిద్దిపేట, కామారెడ్డి, దుబ్బాక, వేములవాడ ప్రాంతాలకు చెందిన రైతులు వ్యాపారం చేస్తుండగా, సిరిసిల్ల జిల్లా కేంద్రంగా అవతరించడంతో రద్దీ పెరిగింది. రోడ్లపైనే విక్రయాలతో అటు రైతులు, ఇటు ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వచ్చేది. మున్సిపల్‌ నిధులతో మార్కెట్‌ కాంప్లెక్స్‌ను అభివృద్ధి చేసి రైతులు, ఆయా వ్యాపారులకు స్లాట్‌లు ఏర్పాటుచేసి కేటాయించడంతో కొంతమేర ఉపశమనం దొరికినా పార్కింగ్‌, ఇతర సమస్యలు వేధిస్తున్నాయి. అలాగే రైతులు పెద్ద సంఖ్యలో రావడం, వారందరికీ స్లాట్లు సరిపోక ఇబ్బందులు వస్తున్నాయి. ఈ సమస్యను తెలుసుకున్న మంత్రి కేటీఆర్‌, ఇక్కడ మోడ్రన్‌ రైతు బజార్‌ నిర్మాణానికి సంకల్పించారు. జిల్లా కేంద్రంలోని మానేరుతీరంలో విశాలమైన వాతావరణంలో రైతు బజార్‌ నిర్మాణానికి రెండేళ్ల క్రితం పునాది వేశారు. మూడెకరాల స్థలంలో 5.15కోట్ల నిధులతో పనులు చేపట్టగా, మంత్రి సూచనల మేరకు రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా ఉండేలా అధికారులు తీర్చిదిద్దారు. నేడు మంత్రి కేటీఆర్‌ ప్రారంభించనున్నారు. 

సకల వసతులు.. ఆధునిక హంగులు..

మోడ్రన్‌ రైతుబజార్‌ను సకల వసతులు.. ఆధునిక హంగులతో నిర్మించారు. రాష్ట్రంలోనే మరెక్కడా లేని విధంగా క్రయవిక్రయాల కోసం 106 స్టాళ్లు ఏర్పాటు చేశారు. అందులో కూరగాయలు, చేపలు, చికెన్‌, మటన్‌, వ్యాపారులతో పాటు పూలు, పండ్లు, కమర్షియల్‌ వ్యాపారం చేసుకునేందుకు సిద్ధం చేశారు. వాహనాల పార్కింగ్‌ కోసం ప్రత్యేక స్థలం కేటాయించారు. వినియోగదారులకు తాగునీటి కోసం శుద్ధనీటి ప్లాంట్‌, పురుషులు, మహిళలకు మరుగుదొడ్లు,  కార్యాలయం, స్టోర్‌ రూంలు గార్డెనింగ్‌ పనులు చేస్తున్నారు. కాగా, స్టాళ్లలో మహిళా సంఘాల సభ్యులకు 25శాతం కేటాయించనున్నారు. రైతుల నుంచి డిమాండ్‌ను బట్టి మహిళా సంఘాలకు స్టాల్స్‌ కేటాయింపు చేయనున్నారు. స్టాల్స్‌ కోసం రైతుల డిమాండ్‌ అధికంగా ఉంటే 25శాతం, తక్కువగా ఉంటే 40శాతం మహిళా సంఘాలకు ఇచ్చే అవకాశముందని అధికారులు తెలిపారు. 

ఆహ్లాదం కోసం ఉద్యానవనం.. 

రైతుబజార్‌కు ఇన్‌గేట్‌, అవుట్‌ గేట్‌ ఏర్పాటు చేశారు. ప్రవేశ ద్వారం వద్ద అన్నదాత కుటుంబం, లోపల మహిళా రైతు ప్రతిమలను ఉంచారు. అలాగే ఆహ్లాదకరమైన వాతావరణం కోసం స్టాళ్ల మధ్య చిన్న గార్డెన్‌ను సిద్ధం చేశారు. అందులో పూలు, ఇతర మొక్కలను నాటడంతోపాటు కోడి, చేప, మేక, గొర్రె ప్రతిమలను ఉంచారు. లైటింగ్‌ కూడా సిద్ధం చేశారు.  

సంతోషంగా ఉంది..

మా మార్కెట్‌ కమిటీ పాలకవర్గం హయాంలో మోడ్రన్‌ రైతుబజార్‌ పనులు జరగడం సంతోషంగా ఉంది. మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక చొరవతో జిల్లా రైతులు, ప్రజలకు సకల వసతులతో కూడిన రైతు బజార్‌ అందుబాటులోకి వస్తుంది. కేటీఆర్‌ చేతుల మీదుగా ప్రారంభానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసినం. 

- లింగం రాణి, మార్కెట్‌ కమిటీ అధ్యక్షురాలు, సిరిసిల్ల

కేటీఆర్‌ చొరవతోనే..

మంత్రి కేటీఆర్‌ ప్రత్యేక కృషితో సిరిసిల్ల అభివృద్ధిలో రాష్ర్టానికే ఆదర్శంగా నిలుస్తుంది. సినారె గ్రంథాలయం, సినారె కళామందిరం, బతుకమ్మఘాట్‌, మ్యూజికల్‌ ఫౌంటేన్‌ వంటి అనేక వసతులు అందుబాటులోకి వచ్చాయి. మానేరుతీరంలో నిర్మించిన రైతుబజార్‌ రాష్ర్టానికే రోల్‌మోడల్‌గా నిలుస్తుంది.

- జిందం కళ,మున్సిపల్‌ అధ్యక్షురాలు, సిరిసిల్ల 


logo