సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jun 21, 2020 , 00:35:22

పల్లెపల్లెకూ పార్కులు

పల్లెపల్లెకూ పార్కులు

  • ఎకరం స్థలంలో ఏర్పాటుకు ఆదేశాలు జిల్లాకు 255 మంజూరు  
  • స్థలాల ఎంపికకు సర్వే

పల్లెల్లో ఆహ్లాదకర వాతావరణం కల్పించేందుకు కేసీఆర్‌ సర్కార్‌ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది. పల్లె ప్రగతి కార్యక్రమంలో భాగంగా గ్రామానికో ప్రకృతి వనాన్ని ఏర్పాటు చేయనున్నది. జిల్లాకు 255 పార్కులు మంజూరు కాగా, ప్రభుత్వం వీటిని ఎకరం స్థలంలో నిర్మించనున్నది. స్థలాలు గుర్తించి ప్రతిపాదనలు పంపేందుకు అధికార యంత్రాగం సర్వే చేస్తుండడంతో సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.

జిల్లాలో 255 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో వంద పంచాయతీల్లో వెయ్యి కన్నా జనాభా తక్కువగా ఉన్నారు. 148 గ్రామ పంచాయతీల్లో 5వేల వరకు జనాభా ఉన్నారు. ఐదు వేల కన్నా ఎక్కువ జనాభా కలిగిన గ్రామ పంచాయతీలు ఏడు ఉన్నాయి. ఆయా గ్రామ పంచాయితీల్లో పార్కులను ఏర్పాటు చేసేందుకు ఎకరం స్థలం అవసరం. కాగా జిల్లాలో 120 గ్రామ పంచాయితీల్లో పార్కుల ఏర్పాటుకు అవసరమయ్యే స్థలం అందుబాటులో ఉన్నది. మిగతా గ్రామాల్లో స్థల సేకరణపై అధికారులు దృష్టిసారించారు. ప్రతి గ్రామంలో ఎకరం తక్కువగా కాకుండా స్థలా న్ని సేకరించి పార్కులను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తుంది. స్థలం అందుబాటులో లేకుంటే దాతల ద్వారా గానీ, కొనుగోలు చేసి అయినా పార్కులను ఏర్పా టు చేసేందుకు ప్రభుత్వం సర్వే నిర్వహిస్తున్నది.

ఓపెన్‌ జిమ్‌.. వాకింగ్‌ ట్రాక్‌లు

ప్రకృతి వనంలో పెద్దలకు ఓపెన్‌ జిమ్‌, ఉదయం సాయంత్రం నడక కోసం నడక ట్రాక్‌ను ఏర్పాటు చేయ నున్నారు. పిల్లల ఆడుకునేందుకు వీలుగా ఆట వస్తువులను ఏర్పాటు చేస్తారు. దీంతో ప్రజలకు ఆరోగ్యంతోపాటు ఆహ్లాదం పంచేందుకు, కుటుంబ సభ్యులతో కాలక్షేపంగా గడిపేందుకు ఈ పార్కులు ఉపయోగపడనున్నాయి. 

ఉత్సవాల నిర్వహణకు వీలుగా..

ప్రజలకు సౌకర్యవంతంగా నిర్మించే ఈ పార్కులో ఉత్స వాలు నిర్వహించేందుకు వీలుగా ఏర్పాట్లు చేయనున్నారు. దసరా పండుగ నిర్వహించుకునేందుకు జమ్మి చెట్టు, కార్తీక మాసంలో కార్తీక వన భోజనాల కోసం ఉసిరి చెట్టు, 12రాశులకు సంబంధించి 12రకాల మొక్కలనూ పెంచనున్నారు. వీటితో పాటు పండ్ల, ఔషధ మొక్కలను నాటి పార్కులో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించేందుకు ప్రభు త్వం సన్నాహాలు చేస్తున్నది.

స్థలాన్ని సేకరిస్తున్నాం

ప్రభుత్వ ఆదేశాల మేరకు పల్లెపల్లెనా ప్రకృతి వనం ఏర్పాటుకు స్థలాన్ని సేకరిస్తున్నాం. గ్రామాల్లో సిబ్బందితో సర్వే చేయిస్తున్నాం. అన్ని మండలాల ఎంపీడీవోలకు స్థలం సేకరించి పార్కుల ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశాలు జారీ చేశాం. ఆహ్లాదకరమైన వాతావరణంలో కుటుంబ సభ్యులతో కాలక్షేపంగా గడిపేలా పార్కులను ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది.

- రవీందర్‌, జిల్లా పంచాయతీ అధికారి logo