శుక్రవారం 03 జూలై 2020
Rajanna-siricilla - Jun 17, 2020 , 02:21:48

ప్రభుత్వ చొరవతోనే లాభాల్లోకి..

ప్రభుత్వ చొరవతోనే లాభాల్లోకి..

l  2014 తర్వాతే సింగిల్‌ విండోలు బలోపేతం

l  సాగు పెట్టుబడి కోసమే రైతులకు రుణాలు

l  డీసీసీబీ మెగా రుణ మేళాలో చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి

నల్లగొండ : తెలంగాణ ప్రభుత్వం చొరవతోనే 2014 తర్వాత రాష్ట్రంలోని సింగిల్‌విండో సొసైటీలు ఆర్థికంగా బలోపేతమై లాభాల్లోకి వచ్చాయని టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్‌, డీసీసీబీ చైర్మన్‌ గొంగిడి మహేందర్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌-19 నేపథ్యంలో రైతులకు వానకాలం సీజన్‌లో సాగు పెట్టుబడి నిమిత్తం రుణాలు అందించే కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక డీసీసీబీ కార్యాలయంలో నల్లగొండ నియోజక వర్గ రైతులకు రుణమేళా నిర్వహించారు. అర్హులైన రైతులకు స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగు పెట్టుబడి నిమిత్తం రుణాలు అందిస్తున్నట్లు తెలిపారు. కొవిడ్‌-19 నేపథ్యంలో రాష్ట్రంలోని ఆయా సొసైటీలకు రూ.600 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా.. అందులో ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 107 సొసైటీలకు రూ.80 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. నియోజక వర్గాల వారీగా ఎమ్మెల్యేలు, మంత్రి జగదీశ్‌రెడ్డి సూచనలతో ఒక్కో సొసైటీకి రూ.50 లక్షల నుంచి రూ.70 లక్షల వరకు అందజేస్తున్నట్లు తెలిపారు. విత్తనాలు, ఎరువులు, ఇతర పెట్టుబడి కోసమే రైతులకు పావలా వడ్డీకి రుణాలు అందిస్తున్నట్లు చెప్పారు. సొసైటీలు విత్తనాల విక్రయాల నుంచి పంట ఉత్పత్తుల కొనుగోళ్ల వరకు అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 

నిరంతర విద్యుత్‌తో  అధిక దిగుబడి

ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా రైతులకు ప్రభుత్వం ఉచిత విద్యుత్‌, పెట్టుబడి సాయం అందించడం వల్లే రికార్డు స్థాయిలో పంట ఉత్పత్తి చేతికొస్తున్నట్లు తెలిపారు. భూమి పుట్టిన నాటి నుంచి ఇప్పటి వరకు ఇంత పెద్ద ఎత్తున ధాన్యం పండలేదని, ఒక్క నల్లగొండ జిల్లాలోనే 6.50 లక్షల మెట్రిక్‌ టన్నుల ధాన్యం పండినట్లు తెలిపారు. అనంతరం 280 మంది రైతులకు రూ.5 కోట్ల రుణ చెక్కులను రైతులకు అందజేశారు. కార్యక్రమంలో సీఈఓ మదన్‌మోహన్‌, డీసీఓ శ్రీనివాసమూర్తి, మున్సిపల్‌ చైర్మన్‌ మందడి సైదిరెడ్డి, వైస్‌ చైర్మన్‌ అబ్బగోని రమేశ్‌, డైరెక్టర్‌ పాశం సంపత్‌రెడ్డి, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఆలకుంట్ల నాగరత్నంరాజు, జడ్పీటీసీలు చిట్ల వెంకటేశం, వంగూరి లక్ష్మయ్య, ఎంపీపీ విజయలక్ష్మి, సుమన్‌, కరీంపాషా, తదితరులు పాల్గొన్నారు. logo