బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 17, 2020 , 02:17:14

తూతూమంత్రంగా ..

తూతూమంత్రంగా ..

l   సభ్యులుంటే అధికారులుండరు.. అధికారులుంటే సభ్యులుండరు.. 

l  జడ్పీ స్థాయీ సంఘాల సమావేశాల తీరిది 

l   కోరం లేకుండానే సాగిన ఐదో స్థాయీ సంఘం సమావేశం

సూర్యాపేట : శాఖల వారీగా ప్రజా సమస్యలపై లోతైన చర్చ చేసి వాటిని పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న జిల్లా పరిషత్‌ స్థాయీ సంఘాల సమావేశాలు తూతూమంత్రంగా సాగుతున్నాయి. సభ్యులుంటే అధికారులుండరు.. అధికారులుంటే సభ్యులుండరనే విధంగా జరుగుతున్నాయి. మంగళవారం జిల్లా పరిషత్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఉదయం ఐదో స్థాయీ  సంఘం సమావేశం, మధ్యాహ్నం ఆరోస్థాయీ సంఘం సమావేశం నిర్వహించేందుకు షెడ్యూల్‌ విడుదల చేశారు. కానీ ఉదయం 10.30గంటలకు ప్రారంభం కావాల్సిన ఐదో సంఘం సమావేశం మధ్యాహ్నం 12.30గంటలకు ప్రారంభమైంది. అది కూడా సంఘం చైర్మన్‌  చింతరెడ్డి చంద్రకళ ఒక్కరే హాజరై ప్రారంభించారు. మిగిలిన సభ్యులు హాజరుకాకపోవడంతో అధికారులు ప్రగతి నివేదికలను చదువుతూ పోయారు. చైర్మన్‌ చంద్రకళ ఒకటి, రెండు ప్రశ్నలు వేసి సమస్యలను తెలుసుకున్నారు. సమావేశం చివరి క్షణంలో మద్దిరాల జడ్పీటీసీ ఒక్కరే సమావేశానికి వచ్చారు. ఇక మధ్యాహ్నం జరిగిన ఆరో స్థాయీ సంఘం సమావేశానికి  సైతం చైర్మన్‌ బాణాల కవిత, సభ్యుడు జీడి భిక్షం మాత్రమే హాజరై సాంఘిక సంక్షేమంపై సమీక్షించారు. 

ఎప్పుడూ ఇదే పరిస్థితి..

జిల్లా పరిషత్‌ సమావేశంతోపాటు స్థాయీ సంఘాల సమావేశాలు దాదాపు ఎప్పుడూ ఇదేవిధంగా సాగుతున్నాయి. ప్రతి జడ్పీ సమావేశంలో నలుగురు జడ్పీటీసీలు మినహా మిగిలిన ఏ ఒక్కరూ మాట్లాడరు. తమకేమీ పట్టనట్లుగా కూర్చుంటారు. ఆ నలుగురే ప్రశ్నలు వేస్తూ వారి పరిధిలోని సమస్యలను ఎత్తిచూపుతారు. ఇక స్థాయీ సంఘాల సమావేశాలకైతే వచ్చేవారే ఉండరు. సభ్యులు పూర్తిగా వచ్చి సమీక్షించిన సమావేశాలు లేవంటే అతిశయోక్తి కాదు. అధికారులు సైతం వారి సిబ్బందిని పంపించి చేతులు దులుపుకుంటున్నారు. ఇక సమయపాలన చెప్పనవసరమే లేదు. సమావేశాలు ఏనాడూ సమయానికి జరిగిన దాఖలాలు లేవు. logo