గురువారం 03 డిసెంబర్ 2020
Rajanna-siricilla - Jun 17, 2020 , 01:46:09

రాష్ర్టానికే ఆదర్శం కరీంనగర్‌ డెయిరీ

రాష్ర్టానికే ఆదర్శం కరీంనగర్‌ డెయిరీ

n  పాడిని ప్రోత్సహిస్తున్న సీఎం కేసీఆర్‌

n  ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌

n  హైదరాబాద్‌లోని నిజాంపేటలో 54వ పార్లర్‌ ప్రారంభం

n  హాజరైన డెయిరీ చైర్మన్‌ రాజేశ్వర్‌ రావు

(కరీంనగర్‌, నమస్తే తెలంగాణ)

కరీంనగర్‌ డెయిరీ రాష్ర్టానికే ఆదర్శంగా నిలిచిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం హైదరాబాద్‌లోని నిజాంపేటలో కరీంనగర్‌ డెయిరీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 54వ పార్లర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వినోద్‌కుమార్‌ మాట్లాడుతూ రైతుల సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న సీఎం కేసీఆర్‌ పాడిని ప్రోత్సహిస్తున్నారని గుర్తుచేశారు. రాష్ట్రంలోని రైతులకు ఇప్పటికే పెద్ద సంఖ్యలో పాడి పశువులను సబ్సిడీపై అందించారన్నారు. రాష్ట్రంలోని వినియోగదారులకు అవసరమైన పాల ఉత్పత్తిని పూర్తి స్థాయిలో ఇక్కడే చేయాలని ఆకాంక్షించారు. పాలపై లీటరుకు రూ. 4 చొప్పున ప్రోత్సాహకం అందించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనన్నారు. పాడి పరిశ్రమ అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కరీంనగర్‌ డెయిరీ సేవలు మరింత విస్తరించాలన్నారు. డెయిరీ చైర్మన్‌ చెలిమెడ రాజేశ్వర్‌ రావు మాట్లాడుతూ పాడి రైతుల సంక్షేమం కోసం కరీంనగర్‌ డెయిరీ కృషి చేస్తున్నదన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక పాలను సేకరించి వినియోగదారులకు నాణ్యమైన, శ్రేష్టమైన, స్వచ్ఛమైన పాల ఉత్పత్తులను అందిస్తున్నదన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచనలతో హైదరాబాద్‌ మహానగరంలో పాల ఉత్పత్తుల విక్రయాలు ప్రారంభించామని చెప్పారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ మల్కాజిగిరి పార్లమెంట్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి రాజశేఖర్‌ రెడ్డి, హైదరాబాద్‌ ఇన్‌చార్జి పూర్ణచందర్‌ రావు, సీఅండ్‌ఎఫ్‌ ఏ శ్రీనివాస్‌, డెయిరీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పీ శంకర్‌ రెడ్డి, డిస్ట్రిబ్యూటర్లు తదితరులు పాల్గొన్నారు.