బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 16, 2020 , 00:53:31

రైతులకు దన్నుగా వేదికలు

రైతులకు దన్నుగా వేదికలు

n నూతన ఒరడికి ప్రభుత్వం శ్రీకారం

n జిల్లా వ్యాప్తంగా 57 క్లస్టర్ల గుర్తింపు

n ఒక్కో వేదికకు  20లక్షలు మంజూరు

n సర్వత్రా హర్షం

విత్తనాలు వేయడం మొదలు పంటలకు మద్దతు ధర వచ్చేదాకా రైతులకు వెన్నుదన్నుగా నిలిచేందుకు ప్రభుత్వం రైతుబంధు సమితులను బలోపేతం చేస్తున్నది. సమస్యలు పరిష్కరిస్తూ, వేసిన పంటకు రైతే ధర నిర్ణయించుకొనేలా రైతు వేదికల నిర్మాణానికి  కేసీఆర్‌ సర్కార్‌ శ్రీకారం చుట్టింది. జిల్లాలో 57క్లస్టర్లకు గాను ఇప్పటి వరకు 41వేదికలకు స్థలాలను ఎంపిక చేసింది. మిగిలిన వాటికి కోసం స్థల పరిశీలన జరుగుతున్న ది. క్లస్టర్‌కో రైతుబంధు వేదికను 20 లక్షలతో నిర్మించనుండడంతో అన్నదాతల్లో హర్షం  వ్యక్తమవుతున్నది.

- రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ: రైతు వేదికలు వ్యవసాయ అభివృద్ధికి కేంద్రాలుగా మారనున్నాయి. రైతుకు ఏ సమస్య వచ్చి నా చెప్పుకునే అవకాశం గత ప్రభుత్వాలు కల్పించలేదు. అధికారులు అందుబాటులో లేకపోవడం తో రైతులు సమస్యలను దిగమింగుతూ, నష్టాల ను చవిచూశారు. రైతుబిడ్డ సీఎం కావడంతో వారి సమస్యలు అక్కడికక్కడే పరిష్కారమయ్యేలా చర్యలు చేపడుతున్నారు. రైతువేదికల నిర్మాణాలతో వ్యవసాయశాఖ అధికారులు విత్తనాలు, ఎరువులు, పంటల సస్యరక్షణ సలహాలు, సూచనలు అందించనున్నారు. పంటకు మద్దతు ధర నిర్ణయించే అధికారం కూడా ప్రభుత్వం స్థానిక రైతులకే కట్టబెట్టనుంది. కాగా, రైతుబంధు వేదికల నిర్మాణానికి మొదటి పునాదిరాయి జిల్లాలోనే పడింది. ముస్తాబాద్‌, ఎల్లారెడ్డిపేట, బోయినపల్లి మండలాల్లో మంత్రులు కేటీఆర్‌, నిరంజన్‌రెడ్డి గత నెల 26న శంకుస్థాపన చేశారు. 

క్లస్టర్‌కో అధికారి..

ఉమ్మడి పాలనలో ఆహార ఉత్పత్తులు పడిపోయాయి. ఉపాధి లేక రైతులు వలసబాట పట్టి కూలీలుగా మారారు. కేసీఆర్‌ సర్కార్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలో ఎక్కడా లేనివిధం గా రైతుబంధు, రైతుబీమా, నిరంతరం విద్యుత్‌, రుణమాఫీ పథకాలతో రైతులకు భరోసానిచ్చింది. భూసార పరీక్షలు రైతు ముంగింట్లో నిర్వహించేలా చర్యలు తీసుకున్నారు. ఏ భూమిలో ఏఏ పంటలు వేయాలో సూచించేలా ఐదు ఎకరాలకు ఒక విస్తర్ణాధికారిని నియమించారు. దీంతో వారు రైతుల భూములను పరిశీలించి సలహాలు ఇవ్వడంతో దిగుబడి వస్తున్నది. 

రైతుబంధు సమితుల ఏర్పాటు

జిల్లాలో 172 రెవెన్యూ గ్రామాలుండగా, ప్రతి గ్రామంలో 15మంది సభ్యులు, ఒక కో ఆర్డినేటర్‌తో కలిపి గ్రామ రైతుబంధు సమితి సభ్యులను నియమించారు. 13 మండలాల్లో 24మంది చొప్పున మండల రైతుబంధు సమితులను ఏర్పాటు చేశారు. రైతులు సమావేశాలు నిర్వహించుకునేందుకు వేదికలు కావాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగా 500 నుంచి వెయ్యి గజాల స్థలాలను కేటాయించాలని కలెక్టర్లను ఆదేశించింది. జిల్లాలో 57 క్లస్టర్లు ఉండగా, 57మంది వ్యవసాయ విస్తరణ అధికారులు ఉన్నా రు. కలెక్టర్‌ ఆదేశాల మేరకు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు ఇప్పటి వరకు 41 క్లస్టర్లకు స్థలాలను ఎంపిక చేశారు.

సంతోషంగా ఉంది

ప్రభుత్వం రైతు వేదికలు నిర్మించడం సంతోషంగా ఉంది. ఇంతకుముందు వేదికలు లేకపోవడంతో ఇబ్బందిపడేవాళ్లం. రైతులు సమష్టి నిర్ణయాలు తీసుకోవడానికి వేదికలు చానా ఉపయోగపడుతాయి. ప్రభుత్వం, వ్యవసాయశాఖ నుంచి రైతులకు అందించే సబ్సిడీలతో పాటు ఎరువులు, విత్తనాలను సమగ్ర సమచారం అందుబాటులో ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చాలా బాగుంది.- కొండవేని పర్శయ్య, రైతు, బోయినపల్లిlogo