సోమవారం 06 జూలై 2020
Rajanna-siricilla - Jun 16, 2020 , 00:10:36

వినూత్నం.. పిచికారీ యంత్రం

వినూత్నం.. పిచికారీ యంత్రం

  • సురక్షితం.. కూలీల సమస్యకు పరిష్కారం 
  • సమయం, నగదు ఆదా..   
  • రాజన్నపేటలో రైతు అనిల్‌ వినూత్న ప్రయోగం

లాక్‌డౌన్‌ కాలంలో పంటలకు పురుగు మందుల పిచికారీకి కూలీలు దొరక్క, దొరికినా వారడిగినంత కూలి చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అందరిలా కాకుండా సరికొత్త ఆవిష్కరణకు అంకురార్పణ చేశాడు. ట్రాక్టర్‌ ఇంజిన్‌కే తాను తయారు చేసిన స్ప్రేయర్‌ను అమర్చి తన తోటి రైతులకు దారి చూపాడు ఎల్లారెడ్డిపేట మండలం రాజన్నపేటకు చెందిన న్యాలవల్లి అనిల్‌.         - ఎల్లారెడ్డిపేట

అనిల్‌ కుమార్‌ 20 ఏండ్లుగా సుమారు 35 ఎకరాలను కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పంటకు రసాయనాల పిచికారీ కోసం తైవాన్‌ పంపును వినియోగించేవాడు. యేటా ఈ పరికరం మరమ్మతు కోసం వేలకు వేలు వెచ్చించేవాడు. ఈ పంపుతో రసాయనాలు పిచికారీ చేయడంవల్ల ఒంటిపై పడి శ్వాస సంబంధ వ్యాధులతో సతమతమయ్యేవాడు. ఈ ఇక్కట్లన్నింటినీ అధిగమించేందుకు ఈ స్ప్రేయర్‌ను తయారు చేశాడు. ఇప్పుడు తక్కువ సమయంలో ఎక్కువ పంటకు పురుగుల మందులు పిచికారీ చేస్తున్నాడు.  

వాట్సప్‌లో చూసి..

కరోనా కష్టకాలంలో సాగు పనులకు కూలీలు దొరక్క చీడపీడలతో పత్తి పంట దిగుబడి తగ్గే పరిస్థితి తలెత్తింది..ఈ క్రమంలో కర్ణాటకలో తన బంధువులు వినియోగిస్తున్న ఈ తరహా పిచికారీ యంత్రం గురించి తెలుసుకున్నాడు. వాట్సప్‌లో పరిశీలించి మరింత ఉపయుక్తంగా ఈ ఇంజిన్‌ స్ప్రేయర్‌ను రూపొందించాడు.    

ఖర్చు ఆదా..తీరిన బాధ..

తైవాన్‌ పంపు కొనుగోలుకు రూ. 10 నుంచి 12 వేలు ఖర్చయ్యేది. యేటా మరమ్మతుకు వెయ్యి వరకు వెచ్చించాల్సి వచ్చేది. ఈ పరికరం కూడా రెండేళ్ల వరకే పనిచేస్తుంది. అలాగే ఈ యంత్రం వినియోగంతో అనేక అనర్థాలు ఉన్నాయి. చేతులు కాళ్లపై పురుగుల మందు పడడమే కాకుండా నోట్లోకి సైతం వెళ్లి ప్రాణాలకు సైతం ముప్పు ఉంటుంది. కానీ ఇంజిన్‌ స్ప్రేయర్‌కు రూ. 45 వేలు ఖర్చవుతాయి. ఎనిమిది నుం చి పదేళ్ల వరకు ఎలాంటి మరమ్మతులు లేకుండా వినియోగించవచ్చు. ప్రతిరోజూ 40 ఎకరాల పంటకు పిచికారీ చేయవచ్చు. 

సంతోషంగా ఉన్నది..

పదేళ్లుగా తైవాన్‌ పంపులను మరమ్మతు చేస్తున్న ఆ అనుభవమే ఈ యంత్రం తయారీకి ఉపయోగపడింది. దీనికి పంపు, డ్రమ్‌లు, వైఫర్లు, స్టాండు తదితర విడిభాగాలు అవసరం. ఈ డ్రమ్ముల్లో 450 లీటర్ల రసాయనాలను ఏకకాలంలో 40 ఎకరాల పంటకు పిచికారీ చేయవచ్చు. ఊరిలోని రైతులు అద్దెకు ఇవ్వమని అడుగుతున్నారు. 

-న్యాలవల్లి అనిల్‌, రైతు(తయారీదారు) రాజన్నపేట


logo