బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 15, 2020 , 01:24:04

లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం

లక్ష మొక్కలు నాటడమే లక్ష్యం

లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా సిరిసిల్ల బల్దియా ఆరో విడుత హరితహారానికి సన్నద్ధమైంది. ప్రభుత్వ ఆదేశాలతో ఈ ఏడాది మున్సిపల్‌ పరిధిలోనే ప్రత్యేకంగా నర్సరీని ఏర్పాటు చేసి అవసరమైన మొక్కలను పెంచింది. పండ్లు, పూలతోపాటు పలు రకాల మొక్కలను అందుబాటులో ఉంచింది. గుంతలు తవ్వే ప్రక్రియతో పాటు మొక్కలు నాటడం, ట్రీ గార్డుల ఏర్పాటుకు వార్డుల వారీగా అవసరమైన అన్ని చర్యలను యంత్రాంగం తీసుకుంటున్నది.- సిరిసిల్ల టౌన్‌

ఆరో విడుత హరితహారంలో భాగంగా మంత్రి కేటీఆర్‌ ఆదేశాలతో సిరిసిల్ల మున్సిపల్‌ పరిధిలో లక్ష మొక్కలు నాటేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ఇందుకోసం స్థానిక సాయినగర్‌, వెంకంపేట, డంప్‌యార్డులతో పాటు లలితానగర్‌లోని నర్సరీలో అవసరమైన మొక్కలను పెంచారు. వేప, చింత, టేకు, కానుగ, తులసీ, మామిడి, దానిమ్మ, జామ వంటి పలు రకాల పండ్లు, పూల మొక్కలు సిద్ధం చేశారు. 

వార్డుల వారీగా ఏర్పాట్లు..

మున్సిపల్‌ పరిధిలోని 39 వార్డుల్లో లక్ష మొక్కలు నాటేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. హరితహారంలో భాగంగా ఇంటింటికీ పంపిణీ చేయాల్సిన మొక్కలతోపాటు వార్డుల వారీగా ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేస్తూ లక్ష మొక్కలు నాటేందుకు మున్సిపల్‌ ఈఈ వెంకటశేషయ్యను ప్రత్యేకాధికారిగా నియమించారు. మొద టి విడుతలో నిర్వహించిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా వార్డులోని 15మంది సభ్యులతో కలిపి వార్డు కమిటీలను ఏర్పాటు చేశారు. మౌలిక వసతుల కల్పనతోపాటు మొక్కల సంరక్షణకు వార్డు కమిటీలో ప్రాధాన్యత కల్పించారు. గతంలో నాటిన మొక్కల సంరక్షణతోపాటు వార్డు అధికారుల భాగస్వామ్యంతో ఇంటింటికీ అవసరమైన మొక్కల జాబితాను హరిత కమిటీ సభ్యులు సేకరించారు. ఈ జాబితా ఆధారంగా ఆరో విడుతలో ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేయనున్నారు. గుంతలు తవ్వే ప్రక్రియతో పాటు మొక్కలు నాటడం, ట్రీ గార్డుల ఏర్పాటుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నారు. 

స్థలాలను గుర్తించాం

మున్సిపల్‌ పరిధిలోని 39వార్డుల్లో మొక్కలు నాటేందుకు అవసరమైన స్థలాలను ఇప్పటికే గుర్తించాం. పట్టణంలోని అంతర్గత రోడ్లతోపాటు ప్రధాన రహదారులు, ప్రధాన కూడళ్లు, పార్కుల వద్ద మొక్కలు నాటేందుకు ఏర్పాట్లు చేస్తున్నా. వార్డు కమిటీ సభ్యుల ద్వారా ఇంటింటికీ మొక్కలు పంపిణీ చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. ప్రజాప్రతినిధులు, అధికారులు, సిబ్బందిని భాగస్వాములను చేసి కార్యక్రమం విజయవంతమయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం.  - సమ్మయ్య, మున్సిపల్‌ కమిషనర్‌, సిరిసిల్ల

లక్ష్యాన్ని సాధిస్తాం..

మున్సిపల్‌ ఆధ్వర్యంలో లక్ష మొక్కలు నాటడమే లక్ష్యంగా ఏర్పాట్లు చేస్తున్నాం. వార్డుల వారీగా మొక్కలు నాటేందుకు ప్రజాప్రతినిధులు, వార్డు కమిటీల సభ్యులకు అవగాహన కల్పిస్తున్నాం. వేప, చింత, టేకు, కానుగ, తులసీ, మామిడి, దానిమ్మ, జామ వంటి మొక్కల పంపిణీకీ సన్నాహాలు చేస్తు న్నాం. రోడ్ల వెంట నాటే మొక్కల సంరక్షణ కోసం ట్రీగార్డులు ఏర్పాటు చేస్తాం.  ఆరో విడుతను విజయవంతం చేయాలి. - జిందం కళ, మున్సిపల్‌ అధ్యక్షురాలు, సిరిసిల్లlogo