సోమవారం 30 నవంబర్ 2020
Rajanna-siricilla - Jun 15, 2020 , 01:01:21

పుస్తకం ఓ నేస్తం.. భవిష్యత్‌కు దారి చూపే సంకలనం.

పుస్తకం ఓ నేస్తం.. భవిష్యత్‌కు దారి చూపే సంకలనం.

పుస్తకం ఓ నేస్తం.. భవిష్యత్‌కు దారి చూపే సంకలనం.  కళ్లెదుటే నవీన ప్రపంచాన్ని ఆవిష్కరించి, మనోధైర్యాన్నిచ్చే కాగితాల సంగ్రహణం. కానీ ఇలాంటి విజ్ఞాన నిధిని అందిపుచ్చుకోవడంలో ప్రస్తుత సాంకేతిక ప్రపంచంలో మనిషి బిజీగా మారిపోగా, వేములవాడకు చెందిన విశ్రాంత అధ్యాపకుడు వీరగోని ఆంజనేయులు మాత్రం 56ఏళ్లుగా నిత్యవిద్యార్థిలా అభ్యసిస్తూనే ఉన్నాడు. పుస్తక సేకరణను హాబీగా మార్చుకోవడంతోపాటు ఇప్పటివరకు ఐదు భాషల్లో 80వేల బుక్స్‌ సేకరించి ఇంట్లోనే, విజ్ఞాన బాంఢాగారాన్ని ఏర్పాటు చేశాడు. - వేములవాడ 

‘చిరిగిన చొక్కా  తొడుక్కో.. ఓ మంచి పుస్తకం కొనుక్కో..’  అనే సూక్తిని అక్షరాలా పాటిస్తున్నాడు పుస్తక ప్రేమికుడు ఆంజనేయులు . వేములవాడ పట్టణంలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి అనుబంధ సంస్కృత పాఠశాలలో ఆంగ్లం టీచర్‌గా పనిచేసి 12ఏళ్ల క్రితం విరమణ పొందాడు. ఆంజనేయులు స్వగ్రామం సుల్తానాబాద్‌ మండలం గర్రెపల్లి కాగా, ఉద్యోగరీత్యా వేములవాడలో స్థిరపడ్డాడు. విద్యార్థి దశ (1964) నుంచే పుస్తక పఠనం అంటే చాలా మక్కువ పెంచుకున్నాడు. సంస్కృతం, ఆంగ్లం, హిందీ, తెలుగు, కన్నడ భాషలలోని నవలలు, ప్రేరణ పుస్తకాలు సమకూర్చుకున్నాడు. 1915లో ముద్రించిన బమ్మెర పోతరాజ శ్రీమదాంధ్ర భాగవతం పుస్తకం మొదలుకొని.. ఇప్పటి ప్రముఖ హస్తభూషణాలన్నీ సేకరించాడు. ఐదు భాషల్లో 80 వేల పుస్తకాలను, 200 వార్తా పత్రికలను సేకరించి, తన ఇంట్లోనే గ్రంథాలయం ఏర్పాటు చేశాడు.

ఇంటి మేడపై ప్రత్యేకంగా ఓ గదిని నిర్మించి పౌరగ్రంథాలయంగా నామకరణం చేశా డు. ప్రధానంగా బాలసాహిత్యం, భాషా   సాహిత్యం, నవలలు, జీవిత చరిత్రలు, కవితలు, పోటీ పరీక్షలకు ఉపయోగపడే పుస్తకాలను తన గ్రంథాలయంలో ఉంచాడు. ఇక తెలుగు, కన్నడ భాషల్లో భగవద్గీత, రామాయణం, మహాభారతం, భాగవతం లాంటి పుస్తకాలు కూడా పొందుపరిచాడు. అందులో ఆధ్యాత్మికతను తెలిపే భగవద్గీత, బైబిల్‌, ఖురాన్‌, బౌద్ధమతం, ధమ్మపదం, జైనమతం, రాధాస్వామి పథం, బ్రహ్మకుమారి, ఓండశాంతి, నిరాకార, ఆస్తిక, నాస్తిక, హేతువాదం లాంటి పుస్తకాలు కూడా ఉన్నాయి. మహనీయుల జీవిత చరిత్రలు, ప్రముఖ ఆలయాలు వాటి విశిష్టతతో కూడిన పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి.

నలుగురికి విజ్ఞానం అందాలనే.. 

పుస్తక పఠనం ద్వారా మేధస్సు పెంపొందుతుంది. నచ్చిన పుస్తకాలను తెచ్చి చదువుకోవడం బాల్యం నుంచే అలవాటుగా ఉండేది. ఇప్పుడు ఎక్కడ కొత్త పుస్తకం కనిపించినా కొనేస్తా. నలుగురికి విజ్ఞానం అందాలనే ఉద్దేశంతో ఇంట్లోనే గ్రంథాలయాన్ని ఏర్పాటు చేశా. నా దగ్గర చదువుకున్న నా శిష్యులతోపాటు ఇతరులు సైతం పుస్తకాల కోసం వస్తుంటారు. ఉద్యోగాలు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువకులకు ఉచితంగా పుస్తకాలను ఇస్తున్నా. ఇంటికి వచ్చి చదువుకునే వారికి వసతి కల్పించి, ప్రోత్సహిస్తున్నా. పీహెచ్‌డీ స్కాలర్‌లు కూడా అవసరమున్న బుక్స్‌ను తీసుకెళ్తుంటారు. 

- వీరగోని ఆంజనేయులు, విశ్రాంత ఉపాధ్యాయుడు  (వేములవాడ)