ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 12, 2020 , 03:23:22

సీఎంను విమర్శిస్తే పెద్ద లీడర్‌ కాలేరు

సీఎంను విమర్శిస్తే పెద్ద లీడర్‌ కాలేరు

  • n  ప్రజలను బాధపెట్టేలా సంజయ్ వ్యాఖ్యలు
  • n  మండిపడ్డ మంత్రి గంగుల 
  • n  టీఆర్‌ఎస్‌లోకి బీజేపీ కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ
  • n  కండువా కప్పి ఆహ్వానం

కార్పొరేషన్‌: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ నా యకుడు బండి సంజయ్‌ ఏకవచనంతో చేసిన అనుచిత వాఖ్యలతో రాష్ట్ర ప్రజలందరూ బాధపడుతున్నారని, ఇలా విమర్శిస్తే పెద్ద నాయకులు కాలేరని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ హితవుపలికారు. ఈ వాఖ్యలకు బాధపడి బీజేపీకి చెందిన 36వ డివిజన్‌ కార్పొరేటర్‌ టీఆర్‌ఎస్‌ చేరారని తెలిపారు. ఈ మేరకు గురువారం మంత్రి మీసేవా కార్యాలయంలో టీఆర్‌ఎస్‌లో చేరిన కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్‌కు గులాబీ కండువా కప్పి ఆహ్వానించారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ప్రజలు ఏం కోరుకుంటున్నారో, వారి అభిప్రాయాల మేరకు కార్పొరేటర్‌ మంచి నిర్ణయం తీసుకున్నారని అభినందించారు. తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్‌ను దేశ ప్రధాని కూడా గౌరవిస్తారని, అలాంటి వ్యక్తిపై ఏకవచనంతో చేస్తున్న విమర్శలకు ప్రజల మనస్సులు గాయపడుతున్నాయన్నారు. బీజేపీ నాయకులు కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌, దత్తాత్రేయ లాంటి వారు కూడా ఏ రోజూ ముఖ్యమంత్రిని ఏకవచనంతో విమర్శించలేదన్నారు. సీఎంపై వాఖ్యలు చేస్తే ప్రజలు, రైతులు ఒప్పుకోరని, సంజయ్‌ ఊబిలో కూరుకపోయే వ్యక్తి అని అభివర్ణించారు. ఆ విమర్శలే ఇప్పుడు బీజేపీకి ఎదురుదెబ్బలు తగిలేలా చేస్తున్నాయన్నారు. జిల్లాలో జరిగే జడ్పీ సమావేశాలు, స్మార్ట్‌సిటీ, కలెక్టరేట్‌లో జరిగే సమీక్షలకు రారని, గెలిచినప్పటి నుంచి అభివృద్ధి పనుల కోసం ఒక్క లెటర్‌ ప్యాడ్‌ కూడా వినియోగించలేదని, కేవలం అభివృద్ధిని అడ్డుకునేందుకు, ఫిర్యాదుల కోసం మాత్రమే వినియోగిస్తారని దుయ్యబట్టారు. గతంలో జిల్లాలో ట్రిపుల్‌ఐటీ కోసం పాత ఎంపీ యత్నాలు చేశారని, అది కూడా ఇప్పుడు కర్ణాటకకు తరలిపోయిందన్నారు. పార్టీకి మంచి చేస్తున్నారో, చెడు చేస్తున్నారో పరిశీలించుకోవాలని హితవుపలికారు. ఎన్నికల్లో ఓడిపోయినా రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌ కరీంనగర్‌ నియోజకవర్గంలో తిరుగుతుంటే.. గెలిచిన ఎంపీ సంజయ్‌ మాత్రం క్వారంటైన్‌లో ఉన్నారని, చిన్న పిల్లావాడికి లొడాస్‌ లాగు పరిస్థితిగా బీజేపీ ఉందని ఎద్దేవా చేశారు. సమావేశంలో మేయర్‌ వై సునీల్‌రావు, మాజీ డిప్యూటీ మేయర్‌ రమేశ్‌, కార్పొరేటర్‌ రాజేందర్‌రావు, నాయకులు చల్ల హరిశంకర్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.logo