బుధవారం 08 జూలై 2020
Rajanna-siricilla - Jun 12, 2020 , 02:23:36

నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలి

నూనె గింజల సాగుపై దృష్టి పెట్టాలి

  • ఏడీఆర్‌ డాక్టర్‌ ఉమారెడ్డి 
  • ఆదిలాబాద్‌ రైతులకు నూనెతీసే యంత్రాలు, నువ్వుల విత్తనాల పంపిణీ 

జగిత్యాల టౌన్‌ : రైతులు నూనె గింజల సాగుపై ఎక్కువ దృష్టి పెట్టాలని పొలాస ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం సహ సంచాలకుడు ఉమారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీరు సమృద్ధ్ధిగా ఉన్న ప్రాంతాల్లో మాత్రమే రైతులు దీర్ఘకాలిక పంటలను సాగు చేయాలన్నారు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం ఈనెల 1న రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయని, అక్కడి నుంచి తెలంగాణ రాష్ర్టాన్ని చేరుకున్నాయన్నారు. తేలికపాటి నేలల్లో 50-60 మిల్లీమీటర్లు, బరువు నేలల్లో 60-75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదై నేల 15-20 సెంటీమీటర్ల లోతు తడిసిన తర్వాతే రైతులు వర్షాధార పంటలైన పత్తి, సోయాచిక్కుడు, కంది, పెసర వంటి పంటలను విత్తుకోవాలన్నారు. నీరు సమృద్ధిగా ఉన్న ప్రాంతాల్లో రైతులు దీర్ఘకాలిక వరి నారు మళ్లు పోసుకోవడానికి ఇది అనుకూల సమయమని తెలిపారు. తెలంగాణ సోనా (ఆర్‌ఎన్‌ఆర్‌ 15048) వరి విత్తనాన్ని జూన్‌ నెలలో నారుమడి పోసుకోకుండా జులై 15 తర్వాత పోసుకోవాలని సూచించారు. రైతులు వాతావరణ సూచనలు పాటిస్తూ పంటలు సాగు చేస్తే అధిక దిగుబడులు పొందవచ్చన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్‌ డీ పద్మజ, డాక్టర్‌ మోహన్‌దాస్‌, పీ సాద్వి, రైతులు పాల్గొన్నారు. 


logo