ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 10, 2020 , 03:58:21

ప్రాణాలు తీసిన భూతగాదా

ప్రాణాలు తీసిన భూతగాదా

n  8 గుంటల భూమి కోసం భార్యాభర్తల దారుణ హత్య

n  కత్తులు, గొడ్డళ్లతో వెంటాడి నరికిన ప్రత్యర్థులు

n  వీణవంక మండలం కొండపాకలో కలకలం

n ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ కమలాసన్‌రెడ్డి

వీణవంక : గెట్టు పంచాయితీలో 8 గుంటల భూమి కోసం భార్యాభర్తలను ప్రత్యర్థులు దారుణంగా హతమార్చారు. వీణవంక మండలం కొండపాకలో జంట హత్యల ఘటన కలకలం సృష్టించింది. గ్రామస్తులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొండపాక గ్రామానికి చెందిన పూరెళ్ల పోచయ్య (70)కు, అదే గ్రామానికి చెందిన సంగెం ఓదెలుకు  20 సంవత్సరాలుగా భూతగాదాలు ఉన్నాయి. ఇద్దరికి సంబంధించిన భూమి సర్వే నంబర్‌ 811లో ఉంది. ఇందులో  పోచయ్యకు 2 ఎకరాల 37 గుంటలు, అతని భార్య సుశీల(65)కు 30 గుంటల భూమి ఉండగా, సంగెం ఓదెలుకు ఎకరం 20 గుంటలు ఉన్నది. అయితే తమకు మోకాపై భూమి తక్కువగా ఉందని, ఓదెలు భూమిలో నుంచి 8 గుంటలు పోచయ్యకు రావాలని 20 సంవత్సరాలుగా గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయంలో ఇరువర్గాలు పలుమార్లు పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లాయి. గ్రామంలో పెద్దల సమక్షంలో పంచాయితీలు కూడా జరిగాయి. ఇదే క్రమంలో మంగళవారం భూమి విషయంలో రెండు కుటుంబాల మధ్య గొడవ జరిగింది. గొడవ పెద్దది కావడంతో సంగెం ఓదెలు కుటుంబ సభ్యులు పూరెళ్ల పోచయ్యను, అతని భార్య సుశీలను వెంటాడి తగాదాకు కారణమైన భూమి వద్దనే కత్తులతో, గొడ్డళ్లతో దారుణంగా నరికి హత్య చేశారు. కాగా, పోచయ్యకు మొదటి భార్య పోచమ్మ, కొడుకు ఉన్నారు. పూరెళ్ల సుశీల 1995లో ఎంపీటీసీగా పని చేశారు.

ఘటనా స్థలాన్ని పరిశీలించిన సీపీ..

కొండపాకలో   పోచయ్య, సుశీల దంపతుల జంట హత్యల విషయం తెలిసిన వెంటనే కరీంనగర్‌ సీపీ కమలాసన్‌రెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. 

నిందితులను త్వరలో పట్టుకుంటాం : ఏసీపీ శ్రీనివాస్‌రావు

పూరెళ్ల పోచయ్యకు, సంగెం ఓదెలుకు గత 20 ఏళ్లుగా భూతగాదాలు ఉన్నాయి. అదే విషయంలో సంగెం ఓదెలు కుటుంబ సభ్యులు,  పోచయ్య-సుశీల దంపతులను నరికి చంపారు. నిందితులు పరారీలో ఉన్నారు.  తొందరలోనే వారిని పట్టుకుంటాం.logo