ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 10, 2020 , 03:20:48

సాగుకు సన్నద్ధం

సాగుకు సన్నద్ధం

n నియంత్రిత పద్ధతిలో పంటలు వేసేందుకు ఏర్పాట్లు

n అందుబాటులో ఎరువులు, విత్తనాలు

n గోదావరి జలాలతో బీడు భూములు సస్యశ్యామలం

n బిజీబిజీగా రైతాంగం

వానకాలం సీజన్‌ ప్రారంభం కావడంతో దుక్కులు దున్నుతూ రైతాంగం బిజీ అయ్యింది. సీఎం కేసీఆర్‌ సూచన మేరకు నియంత్రిత సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. సన్నరకం వరి, కంది, పత్తి పంటల సాగు పెంచే దిశగా వ్యవసాయ శాఖ అడుగులు వేస్తున్నది. గతేడాది వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 2,31,732 ఎకరాల్లో సాగు కాగా, ఈ సారి 2,50,220 ఎకరాల్లో పంటలు సాగు చేయనున్నారు. గోదావరి జలాలతో బీడు భూములు సాగులోకి రానుండగా అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. 

ఊపందుకున్న పనులు

జిల్లాలో వ్యవసాయ పనులు ఊపందుకున్నాయి. చాలా గ్రామాల్లో రైతులు దుక్కులు దున్నుకొని భూమిని సిద్ధం చేసుకున్నారు. వానలు పడగానే విత్తుకునేందుకు సమాయత్తమవుతున్నారు. జిల్లాలో ఎప్పుడూ ఒకే రకం పంట వేసే రైతులు ఈసారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పిలుపు మేరకు నియంత్రిత పంటలు సాగు చేసేందుకు మొగ్గుచూపుతున్నారు. దొడ్డురకం వరి సాగుకు స్వస్తి చెప్పి, సన్నరకం వరి సాగు చేసేందుకు ముందు కొస్తున్నారు. బీపీటీ, జై శ్రీరాం, తెలంగాణ సోనా వంటి రకాలను సాగు చేయాలని వ్యవసాయశాఖ అధికారులు రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. 

పెరుగనున్న సాగు విస్తీర్ణం

కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి కావడంతో గోదావరి జలాలు మెట్ట ప్రాంతానికి చేరాయి. మండువేసవిలో వేములవాడ, సిరిసిల్ల నియోజకవర్గాలతో పాటు ఇల్లంతకుంట మండలంలోని చెరువులు అలుగులు పారుతున్నాయి. భూగర్భ జలాలు ఆరు మీటర్లపైకి రావడంతో వ్యవసాయ బోర్లలో నీరు పైపైకి వస్తుంది. గత వానకాలంలో జిల్లా వ్యాప్తంగా 2,31,732 ఎకరాల్లో పంటలు సాగు చేయగా, ఈ ఏడాది 2,50,220 ఎకరాలకు పైగా సాగు అవుతుందని వ్యవసా య శాఖ అధికారులు అంచనా వేశారు. అందుకు తగ్గట్టుగా విత్తనాలు, యూరియా అందుబాటులో ఉంచారు. 2,50,220 ఎకరాల్లో వివిధ రకాలైన పంటలు సాగు చేసే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. వరి 1,10, 000 ఎకరాలు, పత్తి 1,30,000, కంది 8,000, సోయాబీన్‌ 25, జొన్న 80, పెసర 1,000, అనుములు 150, చెరుకు 150, ఇతర పంటలు 815 ఎకరాల్లో సాగు చేయనున్నారు. వర్షాలు ఎక్కువగా పడితే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.

ఎరువులు, విత్తనాలు సిద్ధం

గత సమైక్య పాలనలో విత్తనాలు, ఎరువుల కోసం రైతు లు రోజుల తరబడి దుకాణాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి. కేసీఆర్‌ ప్రభుత్వం రైతులకు ఇబ్బంది కలుగకూడదని విత్తనాలు, యూరియాను ముందుగానే అందుబాటులో ఉంచింది. జిల్లాలో ఇప్పటి వరకు 29,374.8 టన్నుల యూరియా, 8,223.3 టన్నుల డీఏపీ, 1,1021.6 టన్నుల మోనోపాజ్‌, 20,450.2 టన్నుల కాంప్లెక్స్‌ ఎరువులు అందుబాటులో ఉన్నాయి. సీఎం కేసీఆర్‌ సూచనతో రైతులు సన్నరకం వరి సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. దీంతో బీపీటీ విత్తనాలు 15,048 క్వింటాళ్లు, తెలంగాణ సోనా 1,040, దొడ్డు రకాలు 9,054, కందులు 53.75, పెసర 12, మినుములు నాలుగు క్వింటాళ్లు, పత్తి 1,32,000 ప్యాకెట్ల విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. 

పంట చేలకు అధికారులు

సీజన్‌ ప్రారంభం కావడంతో వ్యవసాయాధికారులు పంటచేలకు పరుగులు పెడుతున్నారు. నియంత్రిత పద్ధతి లో సాగు చేయాలన్న సీఎం సూచన మేరకు వ్యవసాయాధికారులు రైతులకు అవగాహన కల్పించే పనిలో నిమగ్నమయ్యారు. రైతుబంధు కమిటీ ప్రతినిధులతో కలిసి గ్రామాల్లో తిరుగుతూ రైతులకు సన్నరకం వరి, కందులు, పెసర్లు, చిరుధాన్యాలు సాగు చేసేలా ప్రోత్సహిస్తున్నారు. భూసార పరీక్షలు చేసి ఏ పంట వేయాలో వివరిస్తున్నారు. 


logo