గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 10, 2020 , 03:18:42

జోరుగా ‘ఉపాధి’ పనులు

జోరుగా ‘ఉపాధి’ పనులు

n వలస కూలీలు తిరిగి గ్రామాలకు  రావడంతో పెరిగిన డిమాండ్‌

n అడిగిన అందరికీ పని కల్పిస్తున్న  అధికారులు

రుద్రంగి : మండలంలో ఉపాధిహామీ పనులు కొనసాగుతున్నాయి.  జీవనోపాధి కోసం వివిధ నగరాలకు వలస వెళ్లిన కూలీలు అక్కడ పనులు లభించక స్వస్థలాలకు తిరిగి వచ్చారు. కూలీ పనులు చేసుకొని జీవించే వారికి పనులు లేక కుటుంబ పోషణ భారమైన క్రమంలో ఉపాధిహామీ పథకం వీరందరికీ ఆసరాగా నిలుస్తున్నది. భౌతిక దూరం పాటించి, మాస్కులు ధరించి ఉపాధి హామీ పనులు చేసుకోవచ్చని అధికారులు మార్గదర్శకాలు జారీ చేయడంతో గ్రామాల్లో పనులు జోరుగా సాగుతున్నాయి, రుద్రంగి మండలంలో   కూలీల సందడి నెలకొంది. అధికారులు ఉపాధిహామీ  పనులను పర్యవేక్షిస్తున్నారు. 

చేపడుతున్న పనులు...

ఉపాధి హామీ పనులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. వీటిని సిబ్బందికి కేటాయించి కూలీల సహాయంతో పూర్తి చేసేలా అవగాహన కల్పిస్తున్నారు. రైతుల పొలాలకు దారులు, వాలు కట్టలు, నీటి కుంటల నిర్మాణాలు, హరితహారం గుంతలు తీయడం, మొక్కలు పెంచడం వంటివి ప్రధానంగా గుర్తించారు. ఇప్పటికే పలు చోట్ల పనులు కూడా సాగుతున్నాయి. కూలీ రేటు ప్రస్తుతం రూ. 237గా నిర్ణయంచడంతో కూలీలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చేసిన పనులకు కూడా అధికారులు వారం రోజుల్లో డబ్బులు చెల్లిస్తున్నారు. 

రోజూ 1500 మంది కూలీలు హాజరు

మండలంలోని పలు గ్రామాల్లో ఉపాధి హామీ పనులు సాగుతున్నాయి. ప్రతి రోజూ 1500 మంది పనులకు వస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. కూలీల సంఖ్య  ఇంకా పెరిగే అవకాశం ఉందని సిబ్బంది తెలుపుతున్నారు. ఉపాధిహామీ పనులను రైతులు కూలీలు సద్వినియోగం చేసేకోవాలని అధికారులు చెబుతున్నారు. 


logo