గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 08, 2020 , 03:09:14

పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం

పరిశుభ్రతతో ఆరోగ్యవంతమైన సమాజం

రాజన్న సిరిసిల్ల, నమస్తేతెలంగాణ/పెద్దపల్లి రూరల్‌/ మెట్‌పల్లి: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని, ఆరోగ్యవంతమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని అధికారులు, ప్రజాప్రతినిధులు పిలుపునిచ్చారు. రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన పిలుపు మేరకు ‘ప్రతి ఆదివారం 10 గంటలకు 10 నిమిషాలు’ కార్యక్రమంలో భాగంగా తమ ఇంటి ఆవరణను శుభ్రం చేసుకున్నారు. పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని పారబోయడంతోపాటు చెత్తాచెదారం తొలగించి స్వచ్ఛత స్ఫూర్తిని చాటారు. రాజన్న సిరిసిల్లలో కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ తన నివాసంలో పూల కుండీలు, కూలర్లను స్వయంగా శుభ్రం చేశారు. జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ తన ఇంట్లోని పూల కుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. పెద్దపల్లి కలెక్టర్‌ సిక్తా పట్నాయక్‌ తన క్యాంపు కార్యాలయ పరిసరాలను శుభ్రం చేశారు. తన రెండేండ్ల కుమారుడు సారంగ్‌ పట్నాయక్‌తో కలిసి చెత్తను తొలగించారు. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి జిల్లా కేంద్రంలో గల క్యాంపు కార్యాలయంలోని పూలకుండీల్లో నిల్వ ఉన్న నీటిని తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు సూచించారు. వానకాలంలో సీజనల్‌ వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవాలన్నారు. కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు మెట్‌పల్లిలోని తన ఇంటి ఆవరణలో చెత్తాచెదారాన్ని స్వయంగా పార చేతబట్టి తొలగించారు. పూలకుండీల్లో నిల్వ నీటిని తొలగించి మళ్లీ నీళ్లు పోశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యక్తిగత, పరిసరాల శుభ్రతతోనే వ్యాధులను నివారించవచ్చన్నారు. రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్‌ తన క్యాంపు కార్యాలయంలోని ఫ్రిజ్‌లో నీటిని తొలగించి, శుభ్రపరిచారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత పాటించి, సీజనల్‌ వ్యాధులను అరికట్టాలని పిలుపునిచ్చారు.


logo