గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 08, 2020 , 03:09:08

దర్శనానికి వేళాయె

దర్శనానికి వేళాయె

  • ఉమ్మడి జిల్లాలోని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తి
  • భక్తులు భౌతిక దూరం పాటించేలా చర్యలు
  • స్టాండింగ్‌ శానిటైజర్లు, థర్మల్‌ స్క్రీనింగ్‌ ఏర్పాటు
  • వేములవాడలో శానిటైజర్‌ టన్నెల్‌

వేములవాడ కల్చరల్‌/ ధర్మపురి/ మల్యాల:  కరోనా నేపథ్యంలో దాదాపు 80 రోజుల తర్వాత భక్తులకు ఆలయాల్లో దర్శన భాగ్యం కలుగనుంది. ఈ మేరకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి దేవస్థానాలతోపాటు అన్ని ప్రముఖ ఆలయాల్లో అధికారులు కరోనా నివారణ చర్యలు చేపట్టారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా క్యూలైన్లలో డబ్బాలు గీశారు. ప్రధాన ద్వారాల వద్ద థర్మల్‌ స్క్రీనింగ్‌, శానిటైజర్లు ఏర్పాటు చేశారు. రాజన్న ఆలయ పరిసరాలను ఆలయ ఈవో రామకృష్ణ పరిశీలించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఇంజినీరింగ్‌ అధికారులకు సూచించారు. భక్తులు భౌతికదూరం పాటించేలా క్యూలైన్లలో మార్కింగ్‌ చేయించామని, శానిటైజ్‌ చేయించామని తెలిపారు. దేవాలయంలోకి వెళ్లే మార్గంలో శానిటైజర్‌ టన్నెల్‌ ఏర్పాటు చేశామని, థర్మల్‌ గన్‌లో 100 లోపు టెంపరేచర్‌ నమోదైతేనే  అనుమతిస్తామని పేర్కొన్నారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 వరకు భక్తులకు దర్శనం ఉంటుందని, అద్దె గదులు కేటాయించబోమని, కేశ ఖండనాలు, ఆర్జిత సేవలు, కోడె మొక్కలు, గుండంలో స్నానాలు రద్దు చేశామని వెల్లడించారు. ఈవో వెంట పట్టణ సీఐ శ్రీధర్‌, ఆలయ ఏఈవో ఉమారాణి, ఈఈ రాజేశ్‌, రఘునందన్‌, ఆలయ అధికారులు ఉన్నారు. ధర్మపురి, కొండగట్టు ఆలయ ఈవోలు శ్రీనివాస్‌, కృష్ణప్రసాద్‌ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా సులువుగా దర్శనం కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందికి సూచనలు చేశారు. భక్తులు భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీసి రంగులు వేశామని, స్టాండింగ్‌ శానిటైజర్‌, థర్మల్‌ స్క్రీనింగ్‌ను అందుబాటులో ఉంచినట్లు వారు తెలిపారు. వాహన పూజలు, కేశ ఖండనాలు నిలిపివేశామని, ఆన్‌లైన్‌ పూజలు కొనసాగుతాయని వెల్లడించారు. దేవాలయానికి వచ్చే భక్తులు విధిగా మాస్కులు ధరించాలని సూచించారు.

రాజన్న ఆలయ ఈవోగా రామకృష్ణ  బాధ్యతలు

వేములవాడ రాజరాజేశ్వరస్వామి ఆలయ ఈవోగా రామకృష్ణ ఆదివారం పదవీ బాధ్యతలు చేపట్టారు. ఆలయంలో విధులు నిర్వర్తించే అధికారులు, సిబ్బంది ఆయనకు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేశారు.


logo