గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 07, 2020 , 01:33:14

80 రోజుల తర్వాత తెరుచుకోనున్న ఆలయాలు

80 రోజుల తర్వాత 	తెరుచుకోనున్న ఆలయాలు

కరోనా నేపథ్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు

వృద్ధులు, గర్భిణులు, చిన్నారులకు అనుమతి రద్దు

12 గంటల పాటే భక్తులకు అవకాశం

శాశ్వత ఆర్జితసేవలు ఉండవు

అందుబాటులో....లడ్డూ, అన్నప్రసాదం 

ఏర్పాట్లను పరిశీలించిన ఆలయ, పోలీసు అధికారులు

వేములవాడ/ ధర్మపురి/ మల్యాల : సుమారు 80 రోజుల తర్వాత భక్తులకు ఆలయాల్లో దర్శన భాగ్యం కలుగనుంది. కరోనా నేపథ్యంలో మార్చి 22 నుంచి ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని అన్ని ఆలయాల్లో స్వామివారి దర్శనాలు నిలిపివేశారు. ఈ నెల 8 నుంచి అన్ని ఆలయాలు, ప్రార్థనా మందిరాలు తెరుచుకోనుండడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నది. ఈ సందర్భంగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి, ధర్మపురి లక్ష్మీనృసింహస్వామి, కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాలతోపాటు అన్ని దేవాలయాల్లో సోమవారం నుంచి భక్తులను అనుమతించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం రాజన్న ఆలయ అధికారులు, పోలీసులు మందిరంలో ఆలయ పున:ప్రారంభం, ఏర్పాట్లపై సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. 

శాశ్వత, ఆర్జిత సేవలు రద్దు

రాజన్న సన్నిధిలో కోడెమొక్కు, తలనీలాల సమర్పణ, స్వామివారి గర్భాలయంలో నిర్వహించే అభిషేకాలు, అన్నపూజలు, నిత్య కల్యాణాలు, ఇతర శాశ్వత ఆర్జిత సేవలను అధికారులు రద్దు చేశారు. ధర్మగుండంలో స్నానాలు, వసతి గృహాల కేటాయింపును రద్దు చేశారు. వృద్ధులు, చిన్నారులు, గర్భిణులు, ఇతర వ్యాధిగ్రస్తులకు దర్శనానికి అనుమతి లేదు.

ఉదయం 6 నుంచి సాయంత్రం 6గంటల వరకే..

స్వామివారి నిత్య పూజలు యథావిధిగా కొనసాగిస్తామని ఆలయ అధికారులు వెల్లడించారు. ఉదయం 6 నుంచి సాయంత్రం 6 గంటలల్లోపు దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. గంటకు 200 మంది చొప్పున రోజులో సగటున 2400 మందికి దర్శనానికి అనుమతి ఇస్తామన్నారు. భక్తులు తప్పనిసరిగా మాస్క్‌ ధరించాలని సూచించారు. కరోనా వైరస్‌ వ్యాప్తిపై భక్తులను అప్రమత్తం చేసేందుకు ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, మైక్‌ల ద్వారా ప్రచారం చేయనున్నారు. బ్యానర్లను ఏర్పాటు చేసి భక్తులకు వివరించనున్నారు.

ప్రతీ భక్తుడికీ థర్మల్‌ స్క్రీనింగ్‌

రాజన్న ఆలయంతోపాటు అన్ని ఆలయాల్లో దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి థర్మల్‌ స్క్రీనింగ్‌ చేయడమే కాకుండా శానిటేషన్‌ చేసేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. కరోనా లక్షణాలుంటే ప్రత్యేక గదిలో ఉంచేందుకు కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజన్న ఆలయ ఉద్యోగులకు పార్కింగ్‌ స్థలం వద్ద స్క్రీనింగ్‌ పరీక్షలు నిర్వహించిన తర్వాతే విధులకు అనుమతి ఇవ్వనున్నారు. భక్తులను కోడెల క్యూలైను ద్వారా అనుమతించనున్నారు. క్యూలైనులో ఆరడుగుల భౌతిక దూరం పాటించేలా డబ్బాలు గీశారు. క్యూలైన్లను రెండు గంటలకోసారి శానిటేషన్‌ చేయనున్నారు. భక్తులకు ఆన్‌లైన్‌ ద్వారా పూజలు చేసుకునే అవకాశం యథావిధిగా కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు.

అందుబాటులో లడ్డూ ప్రసాదం.. అన్నప్రసాదం

రాజన్న ఆలయంలో భక్తులకు స్వామివారి లడ్డూ ప్రసాదాన్ని అందించేందుకు ఏర్పాట్లు చేశారు. పాత ఆంధ్రాబ్యాంకులో ప్రసాదాన్ని అందుబాటులో ఉంచనున్నారు. ఇక అన్నదాన సత్రంలో ప్రతిరోజూ 200 మందికి అన్నదానం చేసేందుకు ఏర్పాట్లు చేశారు.   

భక్తులు ఒకేసారి రావద్దు

సోమవారం నుంచి రాజన్న దర్శనానికి భక్తులను అనుమతిస్తుండగా ఒకేసారి భక్తులు తరలిరావద్దని ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి ఉమారాణి సూచించారు. ఎక్కువ సంఖ్యలో వస్తే భౌతిక దూరం పాటించడం ఇబ్బందిగా మారుతుందని భక్తులు గమనించాలని కోరారు. ఆలయ అధికారుల సమావేశం అనంతరం ఆలయ పరిసరాలు, పార్కింగ్‌ స్థలం, క్యూలైన్లను ఆమె పరిశీలించారు. సిబ్బంది క్యూలైనులను ఇప్పటికే శుభ్రపరిచారు. ధర్మపురి, కొండగట్టు ఆలయ ఈఓలు శ్రీనివాస్‌, కృష్ణప్రసాద్‌ భక్తులకు ఇబ్బందులు కలుగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సిబ్బందితో చర్చించి తగిన సూచనలు చేశారు.logo