గురువారం 09 జూలై 2020
Rajanna-siricilla - Jun 04, 2020 , 02:53:08

కాలిస్తే ముప్పే..

కాలిస్తే ముప్పే..

కోత కోసిన పొలాలను తగులబెట్టడం ద్వారా అనేక అనర్థాలు జరుగుతున్నాయి.. ముఖ్యంగా ఎండకాలంలో వరికొయ్యలను కాల్చివేయడంతో నేలకు సారాన్ని చేకూర్చే క్రిమికీటకాలు నశించిపోతున్నాయి. వాయు కాలుష్యం పెరిగిపోవడం, భూమిలో సారం తగ్గిపోవడం, వెరసి అన్నదాతకు తెలియకుండానే తీరని నష్టాలను కలిగిస్తున్నాయి.

గతంలో వరిని కొడవళ్లలో మొదళ్ల దాకా కోసేవారు. అప్పటి రోజుల్లో పశువులు ఎక్కువగా, వరిసాగు తక్కువ ఉండడంతో పశుగ్రాసాన్ని కుప్ప లు (గడ్డివాములు) పెట్టుకునేవారు. ప్రస్తుతం సాగు విధానాల్లో అనేక మార్పులు వచ్చాయి. యంత్రాలను విరివిగా వినియోగిస్తుండడంతో పశువుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయింది. మిషన్‌తో హార్వెస్టింగ్‌ చేసే సమయంలో పైకి కో యడం ద్వారా కొయ్యలు పెద్దగా మిగిలిపోతున్నాయి. అవసరమున్న రైతులు కొద్దో గొప్పో గడ్డిని తెచ్చుకోవడం. మిగిలిన దానిని అక్కడే వదిలివేస్తున్నారు. దీంతో దున్నేటప్పుడు నాగండ్లకు అడ్డుగా వస్తున్నాయని రైతులు కాలబెడుతున్నారు. దీంతో నష్టాలే తప్ప లాభం ఏమాత్రమూ ఉండదని వ్యవసాయ అధికారులు పేర్కొంటున్నారు. 

ఎనిమిది రోజుల ముందుగా దున్నాలి..

చాలా మంది రైతులు వరి నాటు సమయంలో మొదటి దఫా దున్నుడుకు రెండో విడుత నాలుగు నుంచి ఐదురోజుల సమయం మాత్రమే తీసుకుంటున్నారు. దీని వల్ల గడ్డి కొయ్యల మొక్కలు, గడ్డి కుళ్లిపోవు. కలుపు మొక్కలు పెరిగే ఆస్కారం ఉంటుంది. ఈ సమయంలో కొయ్యకాళ్లను కాలబెట్టకుండా అందులోనే కలియదున్నిన తర్వాత కనీసం ఎనిమిది రోజుల సమయం తీసుకొని రెండో దఫా దున్నాలి. వీలైతే మొదటి దఫాలో ఒకసారి రొటోవేటర్‌తో దున్నితే గడ్డి, కొయ్యకాలు చిన్న చిన్న ముక్కలుగా విడిపోయి మరోసారి దున్నినప్పుడు ఎలాంటి సమస్యా ఉండదు. దున్నే ముందు ఎకరానికి 100 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ చల్లడం తో ఇతరత్రా గడ్డి కొయ్యలు మొక్కలు,గడ్డి కుళ్లిపోతాయి.

కొయ్యకాలును కాల్చితే అనేక అనర్థాలు.. 

పొలంలో కొయ్యకాలును కాల్చివేయడం అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకుందని శాస్త్రవేత్తలు, సామాజిక వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రైతులు అవగాహన రాహిత్యంతో పంటకు ఎంతో మేలు చేసే కొయ్యకాలును భూమిలో కలియదున్నకుండా, కాల్చివేసి, భవిష్యత్‌ పంటను నాశనం చేస్తున్నారని, వాతావరణాన్ని తీవ్రంగా కలుషితం చేస్తున్నాడని చెబుతున్నారు. కొయ్యకాలును కాల్చివేసే క్రమంలో భూమి గట్టిపడుతుందని, పొలాన్ని కలియదున్నడం వీలుకాదని సూచిస్తున్నారు. కాల్చివేయడం వల్ల, భూమిలో ఉన్న సూక్ష్మక్రిములు, వానపాములు నాశనమవుతాయని, దీంతో భూమి గుల్లగా మారే పరిస్థితి ఉండదని చెబుతున్నారు. నాట్లు వేసిన వేర్లకు సరిగా పోషకాలు చేరవని, ఫలితంగా పైరు పెరగదని వివరిస్తున్నారు. రైతులు ఎక్కువగా యూరియాను వినియోగించాల్సి వస్తుందని, కానీ దాన్ని స్వీకరించి, వేర్లకు అందించే సూక్ష్మజీవులు అప్పటికే అంతరించిపోవడం వల్ల ప్రయోజనం లేకుండా పోతుందని పేర్కొంటున్నారు. ఇదే సమయంలో యూరియాను అతిగా వాడడం వల్ల భూమిలోకి చేరి భూగర్భజలం విషతుల్యమవుతుందని,  వాతావరణంలో అనేక మార్పులు కలుగుతాయనీ సూచిస్తున్నారు. కార్బన్‌ డై ఆక్సైడ్‌, కార్బన్‌ మోనాక్సై డ్‌, పాలిసైర్లిక్‌,  హైడ్రోకార్బన్‌ గాలిలో కలిసి వాతావరణం, జీవకోటి పైన తీవ్ర ప్రభావం చూపుతాయ న్నారు. వీటి మూలంగా జీవ, మానవ శరీరంలోకి కొవ్వు పదార్థాలు చేరి, అనారోగ్యాలు వస్తాయంటున్నారు.  పురుషుల్లో శుక్రకణాలు దెబ్బతింటాయని, గర్భస్థ శిశువుల ఎదుగుదల తగ్గిపోతుందని, మహిళల్లో హార్మోన్లలో అసమానతలు వస్తాయని, క్యాన్సర్‌, అస్తమా, వంటి ప్రమాదకరమైన రోగాలు సంక్రమిస్తాయని శాస్త్రవేత్తలు వివరిస్తున్నారు. 

కలియ దున్నితే ప్రయోజనాలు

వరి కొయ్యలు నేలలో కలియదున్నడం వల్ల సేంద్రియ కార్బన్‌ శాతం పెరిగి దిగుబడులు 5 నుంచి 10 శాతం పెరిగే అవకాశమున్నది.

వరి పొలాల్లో యూరియా, సూపర్‌ పాస్పేట్‌, పొటాష్‌ వేసి కలిపి దుక్కిదున్నే సమయంలో సూపర్‌ ఫాస్పేట్‌ చల్లితే  అవశేషాలు రెండు వారాల్లో మురిగి పోషకాలుగా అందుబాటులోకి వస్తాయి. ఫలితంగా డీఏపీ వాడకం సగం వరకు తగ్గుతుంది. 

కలియ దున్నితే ఎకరాకు దాదాపుగా టన్ను ఎరువు తయారవుతుంది.

 2 శాతం నత్రజనిని(యూరియా), పాస్పరస్‌ 4 శాతం అదనంగా మొక్కలకు అందిస్తుంది.

జింక్‌, మాంగనీస్‌, ఇనుము, కాల్షియం లాంటి సూక్ష్మధాతువులను పంటకు చేకూర్చుతాయి.

నేలలో కరుగని మూలకాలనూ పంటకు అనుకూలంగా మార్చుతుంది. నీటినిల్వ సామర్థ్యం పెరుగుతుంది.

ఉత్తర భారతంలో నిషేధం.. 

ఉత్తర భారత దేశంలో ముఖ్యంగా పంజాబ్‌, ఢిల్లీ, మధ్య ప్రదేశ్‌ రాష్ర్టాల్లో ప్రభుత్వాలు కొయ్యకాలు కాల్చివేతపై నిషేధం విధించారు. అతిగా వాతావరణ, గాలి కాలుష్యం జరుగుతుండడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఒక వేళ ప్రభుత్వ నిషేదాజ్ఞలను అతిక్రమించి కొయ్యకాలును కాల్చివేస్తే, రైతులపై క్రిమినల్‌ కేసులను నమోదు చేసి, జైలుకు పంపుతున్నాయి. అలాగే కొయ్యకాలును కాల్చిన రైతు పొలంలో పండిన పంటను కొనుగోలు చేయడంపై సైతం ఆంక్షలు విధిస్తున్నాయి. వాతావరణ కాలుష్యాన్ని అడ్డుకునే విషయంలో దేశంలోని అన్ని రాష్ర్టాలు కొయ్యకాలును నిషేధించాలని, సుప్రీంకోర్టు సైతం సూచనలు చేయడం గమనార్హం. 

మన దగ్గర  నిషేధం విధించాలి.. 

రాష్ట్రంలో వానకాలం, యాసంగి పంటల కోతల తర్వాత కొయ్యకాలును రైతులు కాల్చివేస్తున్నారు. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశం. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి పెట్టాలి. కొయ్యకాలు కాల్చిన రైతుల పంట కొనుగోలు చేయబోమని, రైతుబంధు, బీమా పథకం వర్తింపజేయమని ఆదేశాలివ్వాల్సిన అవసరం ఉంది. పంటకు మెడవిరుపు, అగ్గితెగులు, పంటలో తాలు, తప్ప రావడానికి కొయ్యకాలు కాల్చివేతే ప్రధాన కారణం. కొయ్యకాలును కాల్చివేస్తే, భూమిలోని సూక్ష్మజీవులు చనిపోతాయి. వాస్తవానికి అవే ముందుగా యూరియాను గ్రహించి, మొక్కకు చేరవేస్తాయి. కొయ్యకాలును కాల్చడం వల్ల అవి అక్కడ ఉండవు. దీంతో యూరియాను మొక్కలు గ్రహించలేవు. దీంతో యూరియా, భూమిలోకి ఇంకిపోయి, భూమిని విషతుల్యంగా మార్చివేస్తుంది. రైతులు ఇప్పటికైనా కొయ్యకాలును కాల్చివేయకుండా, వాటిని భూమిలోనే కలియదున్ని సేద్యాన్ని సాగించాలి.

- ఉమారెడ్డి,  పొలాస పరిశోధన స్థానం ఏడీఆర్‌

కొయ్య కాలుతో సేంద్రియ ఎరువు..

కొయ్య కాలును పొలంలో కలియ దున్నితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. ఎకరానికి దాదాపు టన్ను ఎరువు తయారవుతుంది. దున్నే ముందు తప్పనిసరిగా సూపర్‌ ఫాస్పేట్‌ చల్లితే కొయ్యలు, గడ్డి మొక్కలు తొందరగా కుళ్లిపోతాయి.  మురిగిన కొయ్యకాలు ఎరువుగా మారడంతో దిగుబడి పెరుగుతుంది. రసాయన ఎరువుల వాడకం తగ్గించవచ్చు. మొక్కలకు అదనపు పోషకాలు చేకూరి బలం  పెరుగుతుంది.

- సునీల్‌కుమార్‌, మండల వ్యవసాయ అధికారి (హుజూరాబాద్‌)  logo