ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - Jun 03, 2020 , 03:37:44

అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం

అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదాం

  • రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో మంత్రి కేటీఆర్‌
  • సిరిసిల్లలో జాతీయ పతాకం ఆవిష్కరణ
  • మల్కపేట రిజర్వాయర్‌  సర్జ్‌పుల్‌ పంప్‌హౌస్‌, బండ్‌-2 కట్ట పరిశీలన

సిరిసిల్ల/సిరిసిల్ల టౌన్‌/కోనరావుపేట : ముఖ్యమంత్రి కేసీఆర్‌ అకుంఠిత దీక్షతో తెలంగాణ అద్వితీయమైన విజయాలను సాధించిందని, దే శంలో చెరగని ముద్ర వేసి ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్‌ కొనియాడారు. సిరిసిల్ల కలెక్టరేట్‌లో మంగళవారం నిరాడంబరంగా నిర్వహించిన రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఆయన హాజరయ్యారు. ఉదయం 9.30 గంటలకు సిరిసిల్ల పాత బస్టాండ్‌ సమీపంలోని తెలంగాణ అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఆ తర్వాత 9.50 గంటలకు కలెక్టరేట్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్‌ చాంబర్‌లో జిల్లా అధికారులతో ఆరేండ్ల అనుభవాలను పంచుకున్నారు. సీఎం కృషితో మన రాష్ట్రం అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నిలించిందని, ఇదే స్ఫూర్తితో అన్నిరంగాల్లో తెలంగాణను అగ్రగామిగా నిలుపుతామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో టెస్కాబ్‌ చైర్మన్‌ కొండూరి రవీందర్‌రావు, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌హెగ్డ్డే, జడ్పీ అధ్యక్షురాలు న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, అదనపు కలెక్టర్‌ అంజయ్య, శిక్షణ కలెక్టర్లు సత్యప్రసాద్‌, రిజ్వాన్‌ షేక్‌బాషా, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గడ్డం నర్సయ్య, సెస్‌ చైర్మన్‌ దోర్నాల లక్ష్మారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

నిధులు మంజూరు చేస్తా..

రెండో రోజు నిర్వహిస్తున్న పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి ఉదయం 11.10 గంటలకు వీధుల్లో మంత్రి కేటీఆర్‌ పర్యటించారు. స్థానిక 37వ వార్డులో 35 ఏళ్ల క్రితం నిర్మించిన మురుగుకాలువను పరిశీలించారు. పలు వార్డుల గుండా ప్రవహించే ఈ 11 కి.మీల కాలువలో మురుగునీరు పేరుకపోయి పారిశుధ్యం లోపిస్తున్నదన్నారు. నూతన కాలువ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని ప్రకటించారు. అనంతరం జేపీ నగర్‌లోని శ్మశాన వాటిక స్థలాన్ని పరిశీలించారు. 

మల్కపేట రిజర్వాయర్‌ పరిశీలన..

కాళేశ్వరం తొమ్మిదో ప్యాకేజీలో భాగంగా నిర్మిస్తున్న మల్కపేట రిజర్వాయర్‌ సర్జ్‌పుల్‌ పంప్‌హౌజ్‌ను, బండ్‌-2 కట్ట పనులను మధ్యాహ్నం 12.30 గంటలకు మంత్రి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పనుల పురోగతిపై ఇంజినీరింగ్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని ఆదేశించారు. దసరా వరకు కాళేశ్వరం జలాలతో మల్కపేట నిండుకుండలా కళకళలాడుతుందని చెప్పారు. కొన్ని రోజుల్లోనే ఈ ప్రాంతమంతా సస్యశామలం కాబోతుందని పే ర్కొన్నారు. ఆయనవెంట ప్రాజెక్టు ఈఈ గంగం శ్రీనివాస్‌ రెడ్డి, ఎంపీపీ చంద్రయ్యగౌడ్‌, సెస్‌ డైరెక్టర్‌ తిరుపతి, సింగిల్‌ విండో చైర్మన్లు బండ నర్స య్య, రామ్మోహన్‌రావు, టీఆర్‌ఎస్‌ పార్టీ మండల అధ్యక్షుడు రాఘవరెడ్డి, డీఈలు పాల్గొన్నారు.logo