గురువారం 02 జూలై 2020
Rajanna-siricilla - May 29, 2020 , 01:33:23

నారుదశలో జాగ్రత్త

నారుదశలో జాగ్రత్త

 సస్యరక్షణతో చీడపీడల కట్టడి 

 యాజమాన్య పద్ధతులు చేపడితే అధిక దిగుబడులు  

 ఏడీఏ దోమ ఆదిరెడ్డి

సాగునీరుకు ఢోకా లేక పోవడంతో వానకాలం సాగులో భాగంగా రైతులు వరి పనులు మొదలు పెట్టారు. అయితే నారు దశలోనే తగిన జాగ్రత్తలు పాటిస్తే మున్ముందు చీడపీడల వల్ల వచ్చే ఇబ్బందులను చాలా వరకు కట్టడి చేయవచ్చునని, దీంతో దిగుబడి పెరిగే అవకాశాలున్నాయని ఏడీఏ దోమ ఆదిరెడ్డి పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా రైతులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.  - హుజూరాబాద్‌

విత్తనాలు చల్లిన 15 రోజుల తర్వాత ఆకులపై మొవ్వు పురుగు గుడ్లు కనిపించినా లేదా ఉల్లి కోడు, తాటాకు పురుగు, తామర పురుగు కనిపించినా లీటర్‌ నీటికి 2.5 మిల్లీ లీటర్ల క్లోరిఫైరిఫాస్‌ లేదా 2 మిల్లీలీటర్ల క్వినాల్‌ఫాస్‌ కలిపి పిచికారీ చేయాలి. నారు తీయడానికి వారం ముందు 800 గ్రాముల కార్బోప్యూరాన్‌-3జీ గుళికలు లేదా 250 గ్రాముల ఫోరేట్‌-10జీ గుళికలు వేయాలి. పొడ, కాండం కుళ్లు తెగుళ్ల బారి నుంచి కాపాడాలంటే కలుపు మొక్కలు లేకుండా చూసుకోవాలి.

ఏపుగా ఎదిగేందుకు..

తగిన మోతాదులో ఎరువులు వాడితే నారు ఎదుగుదల మంచిగా ఉంటుంది. దీని కోసం ప్రతి రెండు గుంటల నారుమడికి అడుగు ఎరువుగా 7 కిలోల సూపర్‌ ఫాస్పేట్‌ కానీ, 2 కిలోల డీఏపీ లేదా 2 కిలోల పొటాష్‌ లేదా ఒక కిలో జింక్‌ సల్ఫేట్‌ వేసుకోవాలి. నారు పచ్చబడిన తర్వాత 5 కిలోల యూరియాను రెండు దఫాలుగా రెండున్నర కిలోల చొప్పున వేయాలి. విత్తనం 10-15 రోజుల తర్వాత పైపాటుగా 2 కిలోల యూరియాను నారుమడిలో చల్లుకోవాలి. వరిలో జింక్‌ లోప లక్షణాలు  గమనిస్తే లీటర్‌ నీటికి 2 గ్రాముల జింక్‌ సల్ఫేట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయాలి.

ఎండ తగ్గే వరకు రెండు తడులివ్వాలి

నారు ఏపుగా పెరిగేందుకు ఎండ తగ్గే వరకు రెండు దఫాలుగా నీరు పెట్టాలి. ఉదయం 9 గంటల లోపు ఒకసారి, మధ్యాహ్నం 2 గంటల లోపు మరోసారి ఇవ్వాలి. ఉదయం పెట్టిన నీళ్లను మడిలో నుంచి తీసివేసిన తర్వాతనే రెండో దఫా నీళ్లు పెట్టాలి. వాతావరణం చల్లబడే వరకు ఈ విధంగానే చేయాలి.logo