ఆదివారం 05 జూలై 2020
Rajanna-siricilla - May 29, 2020 , 01:33:36

‘బీమా’తో మారిన బతుకు

‘బీమా’తో మారిన బతుకు

 భార్య మృతితో అందిన ‘రైతుబీమా’ సాయం

 గల్ఫ్‌ను వీడి సాగుబాట పట్టిన గిరిజన రైతు

 మూడెకరాల్లో సేద్యం.. 

 దిగుబడులతో ఆనందం

నాడు ఉన్న ఊళ్లో ఉపాధి కరువై, మూడెకరాల భూమి ఉన్నా చేసే స్థోమత లేక అందరిలాగే గల్ఫ్‌బాట పట్టాడు. కట్టుకున్న భార్యను, కన్న ఇద్దరు పిల్లలను వదిలేసి పన్నెండేళ్లుగా ఏడారి దేశం వెళ్తున్నాడు. ఇంటి వద్ద కూలీనాలీ చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న భార్య, అనారోగ్యంతో ఏడాదిన్నర క్రితం కన్నుమూయడంతో అయోమయంలో పడ్డాడు. కానీ, అప్పుడు ‘రైతుబీమా’ కింద అందిన సాయంతో గత యాసంగి నుంచి సాగుబాట పట్టాడు. వరి సిరులు పండించి, మంచి లాభాలు ఆర్జించడంతో ఆయన బతుకు చిత్రం మారిపోయింది.  - గంభీరావుపేట 

గంభీరావుపేట మండలం దమ్మన్నపేటలోని జగదాంబతండాకు చెందిన అజ్మీర సర్వన్‌- మంగ్లీ దంపతులకు తండా శివారులో మూడెకరాల భూమి ఉంది. వీరికి రవీందర్‌, రాజేందర్‌ అనే ఇద్దరు కొడుకులు ఉన్నారు. భూమిలో బోరు వేసేందుకు ఆర్థిక స్థోమత లేకపోవడంతో బీడుపెట్టి పొట్టకూటి కోసం, 12 ఏళ్లుగా గల్ఫ్‌కు వెళ్తున్నాడు. భార్య కూలీ నాలీ చేసుకుంటూ కుటుంబ భారాన్ని మోసేది. ఉన్నంతలో బతుకుబండి లాగిస్తున్న ఆ కుటుంబాన్ని విధి వెక్కిరించింది. మంగ్లీ అనారోగ్యం పాలై చికిత్స చేసుకునే స్థోమత లేక 2019 జనవరి 28న మరణించింది. దీంతో దుబాయిలో ఉన్న భర్త సర్వన్‌ సొంతూరికి చేరుకుని అంత్యక్రియలు నిర్వహించాడు. తనకున్న మూడెకరాల భూమి భార్య మంగ్లీ పేరు మీద ఉండగా, ఆమె మరణించిన 10 రోజుల్లోనే నామినీ అయిన భర్త సర్వన్‌ ఖాతాలో సర్కారు 5 లక్షలు జమ చేసింది. ఈ నగదే ఆ కుటుంబ స్థితిగతులను మార్చేసింది.

 సాగుబాట.. ‘ఇంటి’కి పునాది..

సర్కారు అందించిన నగదుతో సర్వన్‌ సేద్యపు బాట పట్టాడు. భూమిని సాగు చేయాలని నిర్ణయానికి వచ్చాడు. వెంటనే తనకున్న మూడెకరాల పొలంలో 1.40 లక్షలతో  బోరు వేయగా నీళ్లు పుష్కలంగా పడ్డాయి. మరో 80 వేలు వెచ్చించి పొలం అచ్చుకట్టాడు. వెంటనే యాసంగిలో వరి సాగు చేసి పెట్టుబడి పోను అదనంగా 80 వేలు సంపాదించాడు. ఈ నగదుతోపాటు బీమా సొమ్ములోని మిగతా మొత్తం కలుపుకొని 3.30 లక్షలతో ఇటీవలే ఇంటి నిర్మాణానికి పూనుకున్నాడు. పెద్ద కొడుకు రవీందర్‌కు పెళ్లి కాగా, ప్రైవేట్‌ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. చిన్న కొడుకు రాజేందర్‌ గల్ఫ్‌కు వెళ్లి తండ్రికి ఆర్థిక చేయూతనందిసున్నాడు. 

బీమా పథకమే ఆదుకున్నది..

ప్రభుత్వం అందించిన బీమా పైసలే మా కుటుంబాన్ని ఆదుకున్నయి. ఎంతో కష్టపడి పిల్లలను పెద్దచేసిన నా భార్య, పాణం మంచిగ లేక సచ్చిపోయింది. అప్పుడు ఏంజేయాల్నో తోచలె. భార్య కాలం చేసిన పది రోజులకే సర్కారు నుంచి ఐదు లక్షలు అచ్చినయి.. ఆ పైసలతోనే బోరేసిన. మస్తు నీళ్లు పడ్డయ్‌. నాకున్న భూమిని పొలంజేపిచ్చి వరేసిన. ఇల్లు కూడ కడుతున్న, కొడుకులుగూడ సాయంజేత్తన్రు.

- సర్వన్‌logo