ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - May 29, 2020 , 01:33:35

పెట్రో కార్లకు డ్రోన్లు

పెట్రో కార్లకు డ్రోన్లు

నేరస్థులు, ఆకతాయిల పనిపట్టేందుకు పోలీస్‌శాఖ సరికొత్త కార్యక్రమం

పైలెట్‌ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లా ఎంపిక  

జిల్లాకు 11 డ్రోన్‌ కెమెరాలు.. పది పోలీస్‌ వాహనాలకు ఏర్పాటు 

సిరిసిల్ల పట్టణ పరిధిలో అత్యాధునిక థర్మల్‌ డ్రోన్‌.. చీకట్లోనూ చిత్రీకరణ

హెడ్‌క్వార్టర్స్‌లో ప్రారంభించిన ఎస్పీ రాహుల్‌ హెగ్డే

తప్పుచేశారా..? అయితే ఇక తప్పించుకోలేరు..! ఆకతాయిలు, పోకిరీలతోపాటు లాక్‌డౌన్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారి పనిపట్టేందుకు రాష్ట్ర పోలీస్‌ శాఖ సరికొత్త నిర్ణయం తీసుకున్నది. ఇప్పటికే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అనేక కేసులను ఛేదిస్తుండగా, ఇప్పుడు కొత్తగా పోలీస్‌ సిబ్బంది పెట్రో కార్లకు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేయబోతున్నది. ఈ మేరకు రాష్ట్రంలోనే పైలెట్‌ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా, అప్పుడే జిల్లా యంత్రాంగం రంగంలోకి దిగింది. గురువారం పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో 10 పెట్రోల్‌ కార్లకు ఈ డ్రోన్లను ఏర్పాటు చేయగా, ఎస్పీ రాహుల్‌ హెగ్డే ప్రారంభించారు. ఇక్కడ సక్సెస్‌ అయితే రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించనున్నట్లు తెలిపారు.                                                                             - సిరిసిల్ల క్రైం 

శాంతిభద్రతల పరిరక్షణ, ఆకతాయిల పనిపట్టేందుకు సిబ్బంది పెట్రోకార్లకు డ్రోన్‌ కెమెరాలు అమర్చాలని పోలీసు శాఖ నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో పైలెట్‌ ప్రాజెక్టు కింద రాజన్న సిరిసిల్ల జిల్లాను ఎంపిక చేయగా, ప్రభుత్వ రంగ టీ హబ్‌లోని ఎయిర్‌ సర్వ్‌ ఇన్‌టివేటివ్స్‌, పాలిడన్‌ డ్రోన్స్‌ ఐటీ కంపెనీల ఆధ్వర్యంలో నిర్వహణ చేపట్టనున్నారు. జిల్లాకు 11 డ్రోన్లు రాగా, అన్ని ఠాణాల పరిధిలోని 10 పెట్రోకార్లకు ఏర్పాటు చేశారు. టీహబ్‌లో అత్యాధునికంగా తయారైన మరో థర్మల్‌ డ్రోన్‌ను సిరిసిల్ల పట్టణ పరిధిలో రాత్రివేళల్లో ఉపయోగిస్తారు. పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో గురువారం వీటిని ఎస్పీరాహుల్‌ హెగ్డే ప్రారంభించారు. ఆయన వెంట డీఎస్పీ చంద్రశేఖర్‌, సీఐ వెంకటనర్సయ్య, ఎస్‌ఐలు, పోలీస్‌ సిబ్బంది, కంపెనీల ప్రతినిధులు ఉన్నారు. 

కమాండ్‌ కంట్రోల్‌ నుంచే పర్యవేక్షణ.. 

ఈ డ్రోన్లు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేస్తాయి. మూడు కిలోమీటర్ల దూరం వరకు పనిచేసే సామర్థ్యం కలిగి ఉన్నాయి. 500 మీటర్ల ఎత్తు వరకు ఎగురుతాయి. థర్మల్‌ డ్రోన్‌ అయితే చీకట్లోనూ అద్భుతంగా ఫొటోలు, వీడియోలు తీస్తుంది. ఇవి కమాండ్‌ కంట్రోల్‌ రూంకు అనుసంధానమై పనిచేస్తాయి. వీటి కోసం 11 మంది ఆపరేటర్లను నియమించారు. ముందుగా టీ హబ్‌లోని ఎయిర్‌ సర్వర్‌ ఇంటివేటివ్స్‌, పాలిడన్‌ డ్రోన్‌ ఐటీ కంపెనీ సభ్యులు డ్రోన్‌ కెమెరాల వినియోగం, పనితీరుపై పోలీస్‌శాఖకు అవగాహన కల్పించనున్నారు. కొద్దిరోజులపాటు పెట్రోకారు సిబ్బంది వెంట టీం సభ్యులు ఉండి శిక్షణ ఇస్తారు. ఆ తర్వాత పోలీస్‌ సిబ్బంది సొంతంగా వినియోగిస్తారు. కమాండ్‌ కంట్రోల్‌ రూం నుంచే ఆపరేట్‌ చేస్తారు. 

సక్సెస్‌ అయితే రాష్ట్ర వ్యాప్తంగా అమలు : ఎస్పీరాహుల్‌ హెగ్డే

రాష్ట్రంలోనే ప్రథమంగా జిల్లాలోనే పెట్రోకార్లకు డ్రోన్‌ కెమెరాలు ఏర్పాటు చేశాం. ఎయిర్‌ సర్వ్‌ ఇంటివెటివ్స్‌ ఐటీ కంపెనీ టీహబ్‌ నుంచి సమకూర్చారు. ఇవి వాహనాలు వెళ్లని ప్రదేశంలో పనిచేస్తాయి. థర్మల్‌ డ్రోన్‌ కూడా ప్రారంభించాం. పెట్రోలింగ్‌ వాహనం, బ్లూకోల్ట్‌ వాహనాలు కవర్‌ చేయని ప్రదేశంలో డ్రోన్‌ ఉపయోగించుకోవచ్చు. అన్ని డ్రోన్‌ విజువల్స్‌ పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌కు వస్తాయి. కమాండ్‌ కంట్రోల్‌కు లోకేషన్‌ వస్తుంది. అక్కడికి డ్రోన్‌ పంపించవచ్చు. 100 డయల్‌కు వచ్చిన కాల్స్‌ ఆధారంగా డ్రోన్‌ పంపవచ్చు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో థర్మల్‌ డ్రోన్‌ సాయంతో రాత్రివేళల్లో నిబంధనలు ఉల్లంఘించి రోడ్లపై తిరిగేవారి ఫొటోలు తీయవచ్చు.


logo