ఆదివారం 12 జూలై 2020
Rajanna-siricilla - May 28, 2020 , 07:18:01

మూససాగుకు స్వస్తి..

మూససాగుకు స్వస్తి..

  • సుస్థిర సేద్యానికి శ్రీకారం
  •  నియంత్రిత సాగుతో సత్ఫలితాలు 
  • నాలుగేళ్లుగా వరితోపాటు వివిధరకాల పంటలతో లాభాలు 
  • తాజాగా నాటుకోళ్ల పెంపకంతోనూ రెండు చేతులా ఆదాయం
  • ఆదర్శంగా నిలుస్తున్న కూనారం రైతు 

ఇతనో సన్నకారు రైతు. దశాబ్ధాలుగా అందరిలాగే తన ఐదెకరాల పొలంలో వరి సాగుచేసేది. కాలం సహకరించి, మార్కెట్లో మద్దతు ధర ఉండి లాభం వస్తే తీసుకునేది లేదంటే పెట్టుబడులకూ తండ్లాడేది. సాగును విడిచి, ఇతర పని చేసుకుందామనుకున్నా మనసొప్పక కష్టమో నష్టమో అని భూమిని నమ్ముకునే బతికేది. కానీ ఒకనాడు వచ్చిన ఆలోచన తన జీవితాన్నే మార్చేసింది. ఒక్క పంటతో లాభం లేదని నియంత్రిత వ్యవసాయానికి శ్రీకారం చుట్టాడు. నాడు పెట్టుబడులకు వెంపర్లాడిన చేతులతోనే ఇవ్వాళ సిరుల పంట పండిస్తున్నాడు. వరి, పత్తితో లాభాలు పొందుతూనే, స్వయం ఉపాధి కింద నాటుకోళ్ల పెంపకాన్ని చేపట్టి ఆదర్శంగా నిలుస్తున్నాడు. 

- కాల్వశ్రీరాంపూర్‌

నియంత్రిత సాగు పద్ధతి. ఇది రాష్ట్ర ప్రభుత్వ ఈ వానకాలం నుంచి అమలు చేయబోతున్న బృహత్తర కార్యక్రమం. ఒకే రకం పంట వేసి మార్కెట్లో డిమాండ్‌ లేక నష్టపోయే రైతులకు ఆర్థిక భరోసా ఉండాలనే లక్ష్యంతో తీసుకొస్తున్న సరికొత్త సేద్య విధానం ఇది. కానీ కాల్వశ్రీరాంపూర్‌ మండలం కూనారం గ్రామానికి చెందిన రైతు మొగిలి గత నాలుగేళ్ల కిందే మొదలు పెట్టి లాభాలు సాధిస్తున్నాడు. 

వరితోపాటు పత్తి, మక్క

ఏళ్లుగా ఒకే పంట వేసి నష్టపోయి తేరుకున్న మొగిలి తన     ఐదెకరాల క్షేత్రంలో కొన్నేళ్లుగా వివిధ రకాల పంటలపై ప్రయోగాలు చేస్తున్నాడు. మూడెకరాలలో వరి, మరో రెండెకరాల్లో పత్తి, మక్క సాగు చేస్తూ లాభాలు సాధిస్తున్నాడు. గత సీజన్‌లో వరి దిగుబడి ఎకరానికి 30 క్వింటాళ్లు, పత్తి 13క్వింటాళ్లు, మక్క 30క్వింటాళ్లు రాగా, పెట్టుబడులు పోను ఎకరానికి 30వేలపైనే ఆదాయం వచ్చినట్లు      మొగిలి చెప్పాడు. 

కోళ్ల పెంపకంలోనూ రాణింపు.. 

ఓ వైపు వ్యవసాయం చేస్తూనే మరోవైపు స్వయం ఉపాధి కింద నాటుకోళ్లు పెంచుతూ రెండు చేతులా సంపాదిస్తున్నాడు. వెయ్యి కోడి పిల్లలు కొనుక్కొని వచ్చి తన వ్యవసాయ క్షేత్రంలో 20 గుంటల స్థలంలో రూ.6లక్షల వ్యయంతో షెడ్డు నిర్మించి నాలుగు నెలలుగా పెంచుతున్నాడు. ప్రస్తుతం మార్కెట్లో కిలో నాటుకోడి ధర రూ. 350, గుడ్డు ధర రూ.7 పలుకుతున్నది. గత మూడు నెలల కాలంలో కోళ్లు రెండు కిలలో బరువు పెరుగ్గా, గత ఒక్క నెలలో 130 కోళ్లు అమ్మడం ద్వారా రూ.50వేల ఆదాయం వచ్చినట్లు మొగిలి తెలిపారు. కాగా, పెట్టలు కూడా గుడ్ల దశకు చేరుకున్నాయని, మరో 10రోజుల్లో రోజుకు 500 గుడ్లు పెట్టే అవకాశముందని చెప్పాడు.  

ఒకే దాని మీద ఉండద్దు.. 

రైతులు రెండు రకాల పనులు చేత్తనే లాభం ఉంటది. ఎవుసంతోపాటు కోళ్లు, బర్రెలు, ఆవులు పెంచుకుంటే ఏదో ఒక దానిలో వచ్చే లాభంతో నష్టాల నుంచి తప్పించుకోవచ్చు. నేను అటు వరి, పత్తి సాగుచేత్తన్న. నాలుగు నెలల నుంచి కోళ్లు కూడా పెంచుతున్న. నాటు కోళ్లకు, గుడ్లకు మార్కెట్లో మంచి గిరాకీ ఉండడంతో కావల్సినోళ్లు షెడ్డు వద్దకు వచ్చే కొంటున్నరు. మంచి ఆదాయం వస్తంది. గుడ్లు పెట్టుడు కూడా మొదలైతే రోజుకు రూ.3500 దాకా వస్తయ్‌.  

             -డొనికెన మొగిళి, రైతు


logo