మంగళవారం 24 నవంబర్ 2020
Rajanna-siricilla - May 27, 2020 , 03:02:43

సీఎం మాటే మా బాట

సీఎం మాటే మా బాట

నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తాం 

ప్రతినబూనుతున్న రైతులు

ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో ఆరు గ్రామాల్లో తీర్మానం

తాజాగా మరో ఏడు గ్రామాలు

సర్కారు నిర్ణయానికి సంపూర్ణ మద్దతు 

ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టే నియంత్రిత పద్ధతిలో పంటలు సాగు చేస్తామని రైతులు ప్రతినబూనుతున్నారు. ఇప్పటికే జగిత్యాల జిల్లాలో ఒకటి, కరీంనగర్‌ జిల్లాలోని రెండు, పెద్దపల్లి జిల్లాలో మూడు  గ్రామాలు తీర్మానాలు చేయగా, తాజాగా మరో ఏడు గ్రామాలు అదే బాటపట్టాయి. డిమాండ్‌ ఉన్న పంటలను వేయాలని చెబుతున్న సర్కారు నిర్ణయానికి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాయి. 


వీణవంక/ హుజూరాబాద్‌రూరల్‌/ ఇల్లందకుంట/ జమ్మికుంట రూరల్‌/ ధర్మపురి/ కథలాపూర్‌: నియంత్రిత పద్ధతిలో డిమాండ్‌ ఉన్న పంటలు సాగు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయానికి రైతాంగం పూర్తి మద్దతు తెలుపుతోంది. ఆయా గ్రామాల్లో అధికారులు సూచించిన ప్రకారం సాగు చేస్తామని రైతులు ప్రతిజ్ఞలు చేస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్‌ జిల్లా గంగాధర మండలంలోని చెర్లపల్లి(ఆర్‌), చిగురుమామిడి మండలం గాగిరెడ్డిపల్లి, పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నర్సింహులపల్లి, కానంపల్లి, బుచ్చయ్యపల్లి గ్రామ రైతులు తీర్మానం చేయగా, మంగళవారం హుజూరాబాద్‌ మండలం ధర్మరాజుపల్లి, వీణవంక మండలం మామిడాలపల్లి, జమ్మికుంట మం డలం కేశవాపూర్‌, ఇల్లందకుంట మండలకేంద్రాల్లో రైతులు ప్రభుత్వ నిర్ణయానికి మద్దతు తెలిపారు. మామిడాలపల్లిలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. మరోవైపు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం గాదెపల్లి రైతులు ఇప్పటికే తీర్మానం చేయగా, తాజాగా ఇదే మండలంలోని జైన, తిమ్మాపూర్‌ గ్రామాలతో పాటు కథలాపూర్‌ మండలం బొమ్మెనలో ప్రతిజ్ఞ చేశారు. కాగా, జైన గ్రా మంలో డీసీఎమ్మెస్‌ చైర్మన్‌ఎల్లాల శ్రీకాంత్‌రెడ్డి, కథలాపూర్‌ మం డలం బొమ్మెనలో మార్క్‌ఫెడ్‌ మాజీ చైర్మన్‌ లోక బాపురెడ్డి హాజరై పత్తి, కంది, సన్నరకం వరిపై దృష్టిసారించాలని రైతులకు సూచించారు.

సన్న రకాలు వేస్తామన్నరు.. 

ముఖ్యమంత్రి పిలుపు మేరకు నియంత్రిత పద్ధతిలో సాగు చేస్తామని, పూర్తిగా సన్నరకాలు వేస్తామని రైతులు ఏకగ్రీవ తీర్మానం చేశారు. రైతులకు కూడా నాణ్యమైన విత్తనాలు, సకాలంలో ఎరువులు అందేలా మేం చర్యలు తీసుకుంటున్నాం. ఎలాంటి సందేహాలున్నా వ్యవసాయశాఖ అధికారులతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం.

- బండ సుజాత (సర్పంచ్‌), మామిడాలపలి.

కొత్త పంటలు వేస్తం

ఇక నుంచి పాతకాలం పంటలకు స్వస్తి పలికి సీఎం సారు చెప్పినట్టు కొత్త పంటలు వేస్తం. సన్నరకాలు సాగు చేసి లాభసాటి వ్యవసాయానికి శ్రీకారం చుడుతం. రాష్ట్రంలో పండించిన ప్రతి పంటకు సంపూర్ణ మద్దతు ధర వస్తున్నది. నీళ్లు సమృద్ధిగా ఉండడంతో ఏడాదికి రెండు పంటలు పండుతున్నయ్‌. నాకున్న ఐదెకరాల్లో పూర్తిగా సన్నరకాలు సాగు చేసి అధిక దిగుబడి సాధిస్తా. అందరికీ ఆదర్శంగా ఉంటా. - మ్యాకల సత్యనారాయణరెడ్డి

-రైతుబంధు సమితి కో ఆర్డినేటర్‌ , మామిడాలపల్లి