సోమవారం 25 మే 2020
Rajanna-siricilla - May 24, 2020 , 00:35:08

అయ్యో బిడ్డలాల..

అయ్యో బిడ్డలాల..

 సిరిసిల్ల తేజ హాస్పిటల్‌లో దారుణం 

 వైద్యం కోసం వచ్చి ఇద్దరు మహిళలు మృతి

దిక్కుతోచని స్థితిలో ఐదుగురు పిల్లలు

పాలకోసం ఐదునెలల పాప ఆక్రందన

వైద్యుల నిర్లక్ష్యంతోనేనని కుటుంబీకుల ఆందోళన 

కలెక్టర్‌ ఆదేశాలతో డీఎంహెచ్‌వో విచారణ 

వైద్యశాల సీజ్‌.. డాక్టర్‌పై కేసు

పట్టణంలో విషాదం

రాజన్న సిరిసిల్ల, నమస్తే తెలంగాణ/సిరిసిల్ల క్రైం: రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో దారుణం జరిగింది. పట్టణంలోని తేజ హాస్పిటల్‌లో వైద్యం వికటించి ఇద్దరు మహిళలు మృతి చెందిన సంఘటన కలకలం రేపింది. అధికారులు వెంటనే స్పందించి ఘటనపై విచారణ జరిపి సదరు వైద్యశాలను సీజ్‌ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. సిరిసిల్ల పట్టణంలోని గణేశ్‌నగర్‌కు చెందిన గాజుల కల్పన-విజయేందర్‌ దంపతులు. వారికి శివాజీ, ఐదు నెలల ఆడశిశువు హిమశ్రీ ఉన్నది. ఈ క్రమంలో ఫ్యామిలీ ప్లానింగ్‌ కోసం ఈ నెల 20న విజయేందర్‌ తన భార్య కల్పన(24)ను తేజ హాస్పిటల్‌లో చేర్పించగా, 21న ఆమెకు శస్త్రచికిత్స చేసి అబ్జర్వేషన్‌లో పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం అర్ధరాత్రి వైద్యశాలలోనే మృతి చెందడం బంధువులను కలచివేసింది. ఇదిలా ఉండగా రుద్రంగి మండలం మానాల బడితండాకు చెందిన మాలోత్‌ షీలా(34) పైల్స్‌ ఆపరేషన్‌ కోసం వైద్యశాలలో చేరగా ఆమెకు 21వ తేదీన శస్త్ర చికిత్సను నిర్వహించారు. అదే రోజున ఆమె తీవ్ర అస్వస్థతకు గురికాగా, వైద్యశాల నిర్వాహకులు వెంటనే కరీంనగర్‌కు రిఫర్‌ చేశారు. బంధువులు షీలను కరీంనగర్‌కు తీసుకెళ్తున్న క్రమంలో మార్గమధ్యలోనే ఆమె మృతి చెందింది. 

వైద్యశాల సీజ్‌..

కల్పన, షీలా బంధువులు వారి మృతదేహాలను వైద్యశాల ఎదుట వేసి ఆందోళనకు దిగారు. వైద్యుడి నిర్లక్ష్యం వల్లే ప్రాణాలు పోయాయని ఆరోపిస్తూ ఆగ్రహించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన వైద్యులపై చర్యలు తీసుకోవాలని షీల భర్త గంగాధర్‌, కల్పన భర్త విజయేందర్‌ డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌ వెంటనే స్పందించారు. వెంటనే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్యాధికారి సుమన్‌మోహన్‌రావును ఆదేశించారు. దీంతో కమిటీ బృంద సభ్యుడు చింతోజు భాస్కర్‌, వైద్యుడు రాములు, తహసీల్దార్‌ అంజన్న, శాంతిప్రకాశ్‌ శుక్లాతో కలిసి ఆయన హుటాహుటిన తేజ హాస్పిటల్‌కు చేరుకున్నారు. వైద్యశాలను తనిఖీ చేసి, బాధితులతో మాట్లాడి వివరాలను సేకరించారు. ప్రాథమిక విచారణ పూర్తి చేసి హాస్పిటల్‌ను సీజ్‌ చేశారు. ప్రత్యేక బృందంతో విచారణ చేయించి వైద్యశాల యాజమాన్యానికి శిక్షపడేలా చూస్తామని డీఎంహెచ్‌వో హామీ ఇచ్చారు. అనంతరం బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు వైద్యుడు పత్తిపాక రఘుపై కేసు నమోదు చేశారు. పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించారు. వైద్యశాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. రుద్రంగి మండల మానాలలోనూ పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. 

పాల కోసం ఐదు నెలల పాప..

మహిళలు మృతితో సిరిసిల్ల, మానాల గ్రామాల్లో తీవ్ర విషాదం నింపింది. మృతుల కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. వైద్యశాల ప్రాంగణంలో గాజుల కల్పన ఐదు నెలల పాప హిమశ్రీ పాల కోసం ఏడ్వడం అక్కడున్నవారందరినీ కంటతడి పెట్టించింది. తల్లి లేదని తెలియక పాల కోసం పరితపించిన తీరు అందరి హృదయాలను మెలిపెట్టింది. మానాల గ్రామానికి షీలకు కూతుళ్లు వాణి (12), లావణ్య (8), కొడుకు లఖుపతి (6) ఉన్నారు. తల్లి మృతిచెందడంతో వారు రోదించిన తీరు అందరినీ కలచివేసింది. ఇరుకుటుంబాల రోదనలు మిన్నంటాయి. చిన్నారులను చూస్తూ ‘అయ్యో బిడ్డలాల. భగవంతుడు ఎంత పనిచేశాడు’ అంటూ కన్నీరుమున్నీరుగా విలపించారు.


logo