శనివారం 30 మే 2020
Rajanna-siricilla - May 24, 2020 , 00:35:13

నేతన్నలకు సర్కారు ‘చేయూత’

నేతన్నలకు సర్కారు ‘చేయూత’

 గడువుకు ముందస్తుగానే త్రిఫ్టు పథకం నగదు విడుదల 

 మంత్రి కేటీఆర్‌ నిర్ణయంతో పొదుపుదారులకు ఊరట

 కార్మికక్షేత్రంలో 235 మందికి లబ్ధి

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తేతెలంగాణ: లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేనేత కార్మికులకు సర్కారు అండగా నిలిచింది. త్రిప్టు (పొదుపు) పథకంలో చేరిన వారికి గడువుకు ముందే నగదు అందించేందుకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఈ మేరకు మంత్రి కేటీఆర్‌ శనివారం చేసిన ప్రకటనతో నేతన్నలకు ఎంతో ఊరట నిస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 235 మందికి, రూ. కోటి విడుదల కానుండడంతో కార్మికుల కుటుంబాల్లో హర్షం వ్యక్తమవుతున్నది. చేనేత మగ్గంపై జీవనోపాధి పొందుతున్న నేతన్నలకు సర్కారు చేయూతనిచ్చింది. దేశంలో ఎక్కడా లేని విధంగా కేసీఆర్‌ ప్రభుత్వం చేనేత కార్మికులకు త్రిప్టు (పొదుపు )పథకాన్ని ప్రవేశపెట్టింది. కార్మికుడు నెలకు 8శాతం 1200 పొదుపు చేస్తే, అందుకు ప్రభుత్వం 16శాతం 2400 జమచేస్తుంది. ఆ మొత్తాన్ని మూడేళ్ల తర్వాత సదరు పొదుపుదారుడు తీసుకునే అవకాశం ఉన్నది. ఈ పొదుపు పథకానికి 2017లో ప్రభుత్వం శ్రీకారం చుట్టగా, ఈ సంవత్సరం జూలైతో మూడేళ్ల కాలం ముగియనున్నది. అనంతరం పొదుపుదారులు డబ్బులు డ్రా చేసుకునే అవకాశమున్నది. 

మూడు నెలలకు ముందే చెల్లింపు!

లాక్‌డౌన్‌ నేపథ్యంలో చేనేత పరిశ్రమ మూతపడి పోయి నేతన్నలు ఉపాధి కోల్పోయారు. 20రోజుల క్రితమే సడలింపులు ఇవ్వడంతో మరమగ్గాలు నడిపిస్తున్నారు. తాజాగా వారి కుటుంబాలను ఆదుకునేందుకు త్రిప్టు పథకం కింద జమ చేసిన డబ్బును తీసుకునేందుకు మరో మూడు నెలల గడువున్నా, వాటిని ముందే చెల్లిస్తామని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారు. ఈ మేరకు హైదరాబాద్‌లోని టీఎస్‌ఐఐసీ కేంద్ర కార్యాలయంలో చేనేత జౌళిశాఖ డైరెక్టర్‌ శైలజారామయ్యర్‌, టీఎస్‌ఐసీ చైర్మన్‌ బాలమల్లు, పరిశ్రమల శాఖల ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్‌తో నిర్వహించిన సమీక్షా సమావేశంలో అమాత్యుడు నిర్ణయించారు. మంత్రి రామన్న ప్రకటన నేత కుటుంబాలకు ఎంతో ఊరటనిచ్చింది. అదీగాక 2018లో త్రిఫ్టు పథకంలో చేరిన కార్మికులకు సైతం ముందస్తుగానే డబ్బులు చెల్లించాలని మంత్రి కేటీఆర్‌ నిర్ణయం తీసుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది. ఇక ఈ పథకం ద్వారా జిల్లాలో మొత్తం 235 మంది చేనేత కార్మికులకు లబ్ధి చేకూరనుండగా, దాదాపు రూ. కోటి నిధులు విడుదల కానున్నాయి. తమకు అన్నివిధాలా అండగా ఉంటున్న రామన్నకు చేనేతకార్మికులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నారు.logo